తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైళ్లలో పెట్టినా డీఎస్సీ అక్రమాలపై వెనక్కి తగ్గేదే లేదన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు, అర్హతలపై వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలను రౌడీలు, గూండాలు అని ముద్రవేస్తే డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నలు మాయమైపోవన్నారు. అనుకూల మీడియాతో ఎంత ప్రచారం చేయించినా చంద్రబాబు, లోకేష్ డీఎస్సీ విధానాన్ని కప్పిపుచ్చలేరన్నారు.
‘సెప్టెంబర్ 21న శాప్ కార్యాలయానికి వెళ్లింది సీబీఐ విచారణ కోరుతూ మెమొరాండం ఇవ్వడానికే. మా కార్యక్రమం గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చాం.. అయినా అక్కడ ఘర్షణకు దారితీసిన పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి?, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన సుమారు 300 మంది టీచర్లు రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు ఎలా వచ్చారు?, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లకు ఒకేసారి సెలవులు ఎవరిచ్చారు? ఆన్ డ్యూటీపై వచ్చారా? ప్రభుత్వం చెప్పాలి.
ప్రొబేషన్‌లో ఉన్న టీచర్లు స్కూళ్లు వదిలి ప్రభుత్వ కార్యాలయం ముందు కార్యక్రమానికి రావడానికి సర్వీస్ రూల్స్ అనుమతిస్తాయా?, డీఈలు,, ఆర్జేడీలు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దీనిపై ఎందుకు స్పందించడం లేదు?, టీచర్లకు ఏసీ బస్సులు ఎవరు ఏర్పాటు చేశారు? విజయవాడలో వసతి, భోజన ఏర్పాట్లు ఎవరు చేశారు?, శాప్ కార్యాలయం వద్ద షామియానాలు, కుర్చీలు, మైకులకు అనుమతి ఎవరిచ్చారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వైఎస్సార్‌సీపీ నేతలపై ఫిర్యాదులు ముందుగానే సిద్ధం చేశారనే అనుమానాలకు పోలీసులు సమాధానం చెప్పాలి.
ఇక సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి పేర్ని నాని మాట్లాడుతూ.. ఈ కేసులో హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌నే తప్పుదోవ పట్టించే యత్నం చేశారంటే ఎంత బరితెగింపు?, ఐపీఎస్ అధికారులు హైకోర్టుకే వాస్తవాలు తెలియకుండా చేయాలని ప్రయత్నించడం అత్యంత తీవ్రమైన విషయం. నేరస్తుడైతే కోర్టు శిక్షించాలి.. ఖాకీ యూనిఫాం ఉందని ఎవరినైనా హింసించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?, విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును, డీజీపీని అడుగుతున్నాం.
పోలీసులకు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధికారం ఏ రాజ్యాంగం ఇచ్చింది?, సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఆయన మరణానికి బాధ్యులెవరో నిగ్గు తేలాలి. సాయికృష్ణ కేసులో పోలీసులను జగన్ ప్రశ్నిస్తే చంద్రబాబు, పవన్, లోకేష్ ఎదురుదాడి చేశారు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?, నిజాలు బయటకు రావడానికి ఆలస్యం కావచ్చు.. కానీ ఎంతటి అధికారంలో ఉన్నవారైనా నిజం నుంచి తప్పించుకోలేరు.
164 సీట్ల బలం ఉందనే అధికార మదంతో వ్యవహరించినా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. సాయికృష్ణ వ్యవహారంలో నిజాలు బయటకు వస్తున్నట్లే దగా డీఎస్సీలోనూ నిజాలు బయటకు వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 800 నుంచి 1,000 మంది వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకున్నారనే అనుమానాలు ఉన్నాయి.
కార్యక్రమానికి రాని వారి పేర్లు కూడా కేసుల్లో ఉంటే.. ఆ కేసులు ఎలా తయారయ్యాయో ప్రభుత్వం చెప్పాలి. వైఎస్సార్‌సీపీ వికలాంగ విభాగం నాయకుడిపై దాడి జరుగుతుంటే అక్కడున్న పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు?, అరెస్టు ఎందుకు చేస్తున్నారో, ఏ కేసులో చేస్తున్నారో సంబంధిత వ్యక్తికి చట్టప్రకారం తెలియజేయాల్సిందే. అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు తప్పనిసరిగా పాటించాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే సంబంధిత అధికారులే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ‘బాబు అండతో చెలరేగుతున్న ఏ ఒక్క అధికారినీ వదలం’


