గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు సస్పెన్షన్
చలో విజయవాడ పిలుపే నేరమా?
సెలవు రోజైన ఆదివారం నిరసన చేపట్టినా విధులకు ఆటంకమా!
చంద్రబాబు ప్రభుత్వ చర్యపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
వెంటనే సస్పెన్షన్ ఉపసంహరించాలని డిమాండ్
సాక్షి, అమరావతి: సమస్యలపై గళమెత్తిన ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపునకు దిగింది. చలో విజయవాడకు పిలుపునిచ్చారన్న నెపంతో విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రణస్థలం మండలం జె.ఆర్.పురం సచివాలయ సర్వేయర్ బూరాడ మధుబాబును సస్పెండ్ చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీ చేశారు.
సోషల్ మీడియా గ్రూపుల ద్వారా సర్వేయర్లను రెచ్చగొట్టారని, తుపాను అత్యవసర సమయంలో విధులకు, రీసర్వేకు ఆటంకం కలిగించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. మధుబాబు సంఘాన్ని గుర్తింపు లేని సంఘంగా ఉత్తర్వుల్లోనే పేర్కొనడం గమనార్హం.
సెలవు రోజు నిరసన.. విధులకు ఆటంకమెలా?
తుపాను రాకముందే సెప్టెంబర్ 17న చలో విజయవాడపై ఎస్‌జీఎస్‌డబ్ల్యూ డైరెక్టర్‌కు ముందస్తు నోటీసు ఇచ్చా
మని, తుపాను దృష్ట్యా 25న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తుపాను తగ్గడంతో 27న ఆదివారం సెలవు రోజున శాంతియుతంగా కార్యక్రమం చేపడుతున్నామని, అది విధులకు ఎలా ఆటంకమవుతుందని ప్రశ్నిస్తున్నాయి.
సస్పెన్షన్ ఉపసంహరించాలి
మధుబాబు సస్పెన్షన్ అసంబద్ధమని ఎస్‌జీఎస్‌డబ్ల్యూ ఐక్య వేదిక రాష్ట్ర ప్రతినిధి, సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్ నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఆవేదనలో ఉన్న 1.27 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఈ చర్య మరింత ఆగ్రహం రగిలిస్తుందని, నాయకులపై వరుస చర్యలతో ఉద్యమాన్ని అణచాలనుకోవడం సమస్యను తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. సస్పెన్షన్ తక్షణమే ఉపసంహరించకపోతే 27న చలో విజయవాడను మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు చలో శ్రీకాకుళం కార్యక్రమానికి తరలివస్తారని స్పష్టం చేశారు.


