వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
సీఈసీ నియామక చట్టాన్ని పునఃసమీక్షించాలి
ఈసీ నిర్ణయాలు, ఓటర్ల జాబితాలపై స్పష్టత ఇవ్వాలి
ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలి.. ఓటు హక్కును వినియోగించుకునేలా వ్యవస్థలను పటిష్టం చేయాలి
ఏపీలో సర్ ప్రక్రియలో పాలక పార్టీ అధికార దుర్వినియోగం
అనేక సందర్భాల్లో మా విజ్ఞప్తులు పట్టించుకోలేదు
‘స్థానిక’oగా నియోజకవర్గాలు, డివిజన్ల పునర్విభజనలో మా అభ్యంతరాలను పక్కన పెట్టారు
ఇలాంటి చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని బలహీన పరుస్తాయి
పారదర్శకత, జవాబుదారీ తనాన్ని కాపాడటం ఎన్నికల సంఘం ప్రాథమిక బాధ్యత
సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఈసీ నియామక చట్టాన్ని పునఃసమీక్షించాలన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలుమార్లు నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు, ఈసీఐనెట్ (ఎలక్షన్ కమిషన్ ఇంటర్‌నెట్)నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం ప్రజల్లో తీవ్రమైన ప్రశ్నలు, సందేహాలకు దారితీస్తోందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఆరోపణల కంటే వాస్తవాలపై స్పష్టత
పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కంటే.. ఏ అభ్యంతరాలు నమోదు అయ్యాయి? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం, తిరిగి చేర్చడం వంటి ప్రక్రియలు ఎంత పారదర్శకంగా జరిగాయి? అనే అంశాలపై ప్రజలకు స్పష్టత అవసరం. ఈ అంశాలపై ప్రజల్లో విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలి. అంతిమంగా ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలి. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలి. ఎలాంటి భయం లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.
పారదర్శకతతో పాటు నమ్మకమూ అవసరం
ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటం మాత్రమే కాకుండా.. పారదర్శకత ఉన్నదనే నమ్మకం కూడా ప్రజల్లో కలగాలి. గతంలో తమ మద్దతు పొందిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీ కాల చట్టం–2023ను ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది.
ముగ్గురు సభ్యుల కమిటీతో నియామకాలు
కేంద్ర ప్రభుత్వం (అధికార పార్టీ) ముందుకు వచ్చి, ప్రస్తుతం నెలకొన్న భయాలు, అనుమానాలను తొలగించే విధంగా ఒక సాధారణ విశ్వసనీయమైన విధానాన్ని పునరుద్ధరించాలి. ఎన్నికల కమిషనర్ నియామకాన్ని మళ్లీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ద్వారా చేపట్టేలా చట్ట సవరణ తీసుకురావాలి. ఈ కమిటీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి ఉండాలి. తనకు పరీక్ష నిర్వహించే పరీక్షకుడిని విద్యార్థి తానే నియమించుకోవడం అనేది.. పరీక్షకుడు ఎంత నిజాయితీపరుడైనా ఆరోపణలకు అవకాశం కల్పిస్తుంది. అందుకు బదులుగా తటస్థమైన వ్యక్తి లేదా వ్యవస్థ ద్వారా నియామకం జరగడం మరింత సముచితం. ఇలాంటి మార్పు ఎన్నికల సంఘంపై ప్రజల్లో ఉన్న గౌరవం, విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పేందుకు దోహద పడుతుంది.
ఏపీలో ఎస్‌ఐఆర్ పైనా అభ్యంతరాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐఆర్ (సర్) ప్రక్రియ సందర్భంగా అధికారంలో ఉన్న పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసినందున ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకొంది. అనేక సందర్భాల్లో తాము చేసిన అనేక విజ్ఞప్తులను పట్టించుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో నియోజకవర్గాలు, డివిజన్ల పునర్విభజన జరిగిన తీరుపైనా ప్రతిపక్ష పార్టీగా వ్యక్తం చేసిన అభ్యంతరాలను పక్కన పెట్టారు. ఇలాంటి చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని బలహీన పరుస్తాయి. ప్రజాస్వామ్యంలో ఏ సంస్థ ఎలా పని చేస్తుందో అంచనా వేయడానికి పారదర్శకత, జవాబుదారీతనం నిజమైన ప్రమాణాలు. వీటిని కాపాడటం ఆ సంస్థ ప్రాథమిక బాధ్యత’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

సార్ మీ సాయం మరువలేం
వైఎస్ జగన్‌కు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్దిపొందిన కుటుంబం కృతజ్ఞతలు
చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘సార్.. మీరు చేసిన సాయం ఎప్పటికీ మరువలేం..’ అని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్‌ను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం కొర్లగుంటకు చెందిన మహేష్, వినీల దంపతులు తమ కుమార్తె ధన్సికతో సహా శుక్రవారం కలిశారు. ధన్సిక 2019లో రెండు నెలల పాపగా ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైందని తెలిపారు. అప్పటికి కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారని చెప్పారు.

చిన్నారి ధన్సికతో ఆప్యాయంగా మాట్లాడుతున్న వైఎస్ జగన్
ఆ సమయంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రిలో మెదడుకి సంబంధించి అత్యంత క్లిష్టమైన న్యూరో సర్జరీ ఉచితంగా చేశారని, తమ కుమార్తె కోలుకుందని వైఎస్ జగన్‌కు వివరించారు. ఆపరేషన్ తర్వాత తమ కుమార్తె ఆరోగ్యంగా ఉందని చెప్పారు. అత్యంత క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచి పాపకు సకాలంలో వైద్య సాయం అందించేలా చేసిన వైఎస్ జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని మహేష్, వినీల దంపతులు చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి ధన్సికను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని చిన్నారిని వైఎస్ జగన్ ఆశీర్వదించారు. చిన్నారి, ఆమె తల్లిదండ్రుల కోరిక మేరకు వారితో కలిసి సెల్ఫీ దిగారు.


