భారీవర్షాలకు తెగిపోయిన రోడ్లు
గంగవరంలో ఇంటివద్దే ప్రసవం
అనంతరం కోమాలోకి వెళ్లి మృతి
సీలేరు: తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీవర్షాలు కురిసి రహదారులు తెగిపోవడంతో ఆస్పత్రికి వెళ్లే దారిలేక అల్లూరి జిల్లాలో బాలింత మృతిచెందింది. గూడెంకొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని గంగవరం గ్రామంలో పాంగి సన్యాసిరావు భార్య లావణ్య (28) మగబిడ్డకు జన్మనిచ్చి మరణించింది. నిండుగర్భిణి అయిన ఆమె వాయుగుండం ప్రభావానికి ముందు అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు దారకొండ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు.
ఇదిలా ఉండగా భారీ వర్షాలకు గంగవరం గ్రామానికి సమీపంలోని ఒడిశా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన నాలుగురోజుల కిందట కొట్టుకుపోయింది. గ్రామానికి అవతల ఉన్న మరో చిన్న వంతెన కూడా తెగిపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గురువారం సాయంత్రం లావణ్యకు ఇంటివద్ద ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆమెను ఎలాగైనా ఆస్పత్రికి తరలించాలని గంటల తరబడి ప్రయత్నించారు.
గ్రామానికి రెండు వైపులా వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాధ్యం కాలేదు. ఈలోగా ఇంటివద్దే లావణ్య మగశిశువుకు జన్మనిచ్చి కోమాలోకి వెళ్లి మృతిచెందింది. దారకొండ ఆస్పత్రి సిబ్బంది వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులకు సమాచారం అందించారు. వర్షాలతో రహదారులు తెగిపోయి అత్యవసర సమయంలో ఆస్పత్రికి తరలించలేకపోవడంతో లావణ్య ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.


