ఏఐ రూపం.. భూమికి శాపం | Severe water drought with AI videos | Sakshi
Sakshi News home page

ఏఐ రూపం.. భూమికి శాపం

Sep 26 2026 5:19 AM | Updated on Sep 26 2026 6:55 AM

Severe water drought with AI videos

ఏఐ వీడియోలతో తీవ్ర నీటి కరువు  

10 సెకన్ల వీడియో తయారీకి 4.1 లీటర్ల నీరు ఆవిరి  

ఏఐ ఇచ్చే సాధారణ టెక్ట్స్‌ మెసేజ్‌కి 25 ఎంఎల్‌ నీరు ఖర్చు  

ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు ఏటా వినియోగిస్తున్న నీరు 4.5 ట్రిలియన్‌ లీటర్లు.. 2027 నాటికి ఇది 6.6 ట్రిలియన్‌ లీటర్లకు పెరుగుదల  

భారత్‌లో 38 శాతం ఏఐ వినియోగం సరదా కోసమే.. ఏఐ దుర్వినియోగంలో జెన్‌–జీ యువతే అత్యధికం 

యునైటెడ్‌ నేషన్స్‌ వర్సిటీ, కాలిఫోర్నియా వర్సిటీల పరిశోధనలో వెల్లడి 

డిజిటల్‌ విచక్షణ లేకపోతే ముప్పు తప్పదని హెచ్చరిక  

 సాక్షి, అమరావతి : స్మార్ట్‌ఫోన్‌ తెరపై ఒక్క క్లిక్‌.. క్షణాల్లో 80ల నాటి రెట్రో రూపం, సరదాగా మాట్లాడే యానిమేషన్‌ అవతార్, సోషల్‌ మీడియా రీల్స్‌లో లైకుల వర్షం కురిపించే చిన్న వీడియో క్లిప్‌.. నేటి ఆధునిక సమాజం ఈ   కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న     దృశ్య మాయాజాలంలో మైమరచి పోతోంది. అయితే.. వర్చువల్‌ క్లౌడ్‌లో జరిగే ఈ తేలికపాటి వినో­దం వెనుక నేలమీద ఉన్న స్వచ్ఛమైన జలవనరులు నిశ్శబ్దంగా ఆవిరై   పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాహం కేకలు మిన్నంటుతున్న తరుణంలో.. మన చేతివేలి కొన చేసే అనవసర క్లిక్కు సమాజాన్ని నీటి   కరువు కష్టాల తీరానికి చేరుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.      

కనిపించని డిజిటల్‌ దాహం..
కృత్రిమమేధ అనేది కేవలం గాల్లో తేలే అల్గారిథమ్‌ కాదు. దాని మనుగడకు అంతర్జాతీయంగా విస్తరించిన భారీ డేటా సెంటర్లు, లక్షలాది హై–ఎండ్‌ గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు (జీపీయూ) నిరంతరం పనిచేయాలి. ఈ సర్వర్లు పనిచేసేటప్పుడు ఉత్పన్నమయ్యే విపరీతమైన వేడిని నియంత్రించడానికి శీతలీకరణ టవర్ల (కూలింగ్‌ టవర్స్‌) ద్వారా నీటిని నిరంతరం ప్రవహింపజేస్తారు. ఉష్ణోగ్రతను తగ్గించే క్రమంలో స్వచ్ఛమైన మంచినీరు నేరుగా వాతావరణంలోకి ఆవిరైపోతుంది. 

డేటా సెంటర్లను 24 గంటలూ నడిపేందుకు అవసరమయ్యే భారీ విద్యుత్‌ ఉత్పత్తిలో (బొగ్గు ఆధారిత ప్లాంట్లు) అపారమైన నీరు పరోక్షంగా ఖర్చవుతుంది. ప్రత్యక్షంగా డేటా సెంటర్లలోని సర్వర్ల వేడిని తగ్గించడానికి, ఏఐ కోసం అవసరమైన భారీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్‌ ప్లాంట్లలోను, ఏఐ చిప్‌లు, సెమీ కండక్టర్లను తయారుచేసే ప్లాంట్లలోను అత్యంత స్వచ్ఛమైన అల్ట్రా–ప్యూర్‌ వాటర్‌ వినియోగిస్తున్నారు.

ఒక క్లిక్‌.. ఎంత నీటిని హరిస్తోందంటే..
అంతర్జాతీయ పరిశోధన సంస్థలైన యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ (జపాన్‌) ఏఐ ఆధారిత ఒక్కో డిజిటల్‌ ప్రక్రియకు ఖర్చయ్యే నీటి లెక్కలను వెల్లడించాయి. మనం నిత్యం జెమినీ, చాట్‌ జీపీటీలను అడిగే సాధారణ టెక్ట్స్‌ ప్రశ్నకు దాదాపు 25 మిల్లీలీటర్లు, సగటున 20 ప్రశ్నలకు దాదాపు 500 మిల్లీలీటర్ల (అరలీటరు) నీరు ఖర్చవుతోంది. ఇప్పుడు ట్రెండీగా మారిన 80ల నాటి రెట్రో ఏఐ ఫొటో తయారీకి 30 మిల్లీలీటర్లు అంటే రెండుగుక్కల నీరు ఆవిరవుతోంది. 

మనకు నచ్చినట్టు పరిపూర్ణమైన ఫొటోకోసం ఒకవ్యక్తి సగటున 10 నుంచి 15 సార్లు రీ–ట్రై చేసినప్పుడు సుమారు లీటరు వరకు ఖర్చవుతుంది. 5 నుంచి 10 సెకన్ల నిడివిగల ఒక్క ఏఐ వీడియో కోసం దాదాపు 4.1 లీటర్ల నీరు ఆవిరవుతోంది. వీడియోల్లో ప్రతి ఫ్రేమ్‌ను క్లిష్టమైన డిఫ్యూజన్‌ మోడళ్ల ద్వారా రెండర్‌ చేయాల్సిరావడమే ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

మనదేశంలో సంక్షోభ తీవ్రత..
మనదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మాత్రమే కాదు.. అత్యంత తీవ్రమైన జలసంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటిగా మారబోతున్నట్టు యూఎన్‌వో ఆందోళన వ్యక్తంచేస్తోంది. నీతి ఆయోగ్‌ కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌ ప్రకారం.. దేశంలో దాదాపు 60 కోట్లమంది ప్రజలు తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో వెలికితీసే మొత్తం భూగర్భ జలాల్లో 25 శాతం మన దేశంలోనే జరుగుతోంది. మరోపక్క భారత్‌ డేటా సెంటర్ల హబ్‌గా మారుతోంది. 

ముంబై, చెన్నై, హైదరాబాద్, నోయిడా, విశాఖపట్నం వంటి నగరాలు డేటా సెంటర్ల కేంద్రాలుగా శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే తాగునీటి కోసం వేసవిలో ట్యాంకర్లపై ఆధారపడే ఈ మెట్రో నగరాల్లో భారీ సర్వర్ల నిర్వహణ స్థానిక ప్రజల తాగునీటిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మితివీురిన పోకడ నియంత్రణ లేకుండా కొనసాగితే రాబోయే కాలంలో మానవాళికి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ముందున్నది గడ్డు కాలం..
» 2022 చివర్లో జనరేటివ్‌ ఏఐ విస్తరణ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏఐ డేటా సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష కోట్ల (ట్రిలియన్‌) లీటర్ల నీటిని వినియోగించాయి. 
» యూఎన్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు ఏడాదికి దాదాపు 4.5 ట్రిలియన్‌ లీటర్ల నీటిని వినియోగిస్తున్నాయి. ఇందులో ఏఐ వాటా దాదాపు 20 శాతం (750 బిలియన్‌ లీటర్ల నుంచి 900 బిలియన్‌ లీటర్లు). 
»  నాలుగేళ్లుగా ఏఐ ట్రైనింగ్, ప్రాసెసింగ్, చిప్‌ తయారీకి 3 ట్రిలియన్‌ లీటర్లకు పైగా నీటిని వినియోగించారు. 
» వాటర్‌ రీసెర్చ్‌ అధ్యయనం ప్రకారం.. ఏఐ వినియోగం ఇలాగే పెరిగితే 2027 నాటికి ఏటా 6.6 ట్రిలియన్‌ లీటర్లకు చేరుకోవచ్చని అంచనా. ఇది డెన్మార్క్‌ లేదా యూకే వంటి దేశాల వార్షిక గృహావసర నీటి వినియోగంతో సమానం.

అంతర్జాతీయంగా జల సంక్షోభం..
ఈ వినోద వినియోగం ప్రపంచంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులతో పోల్చినప్పుడు తీవ్రమైన పర్యావరణ అసమానతలను బయటపెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మందికి పైగా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు. మరో 350 కోట్ల మంది కనీసం సంవత్సరంలో ఒక నెలపాటు తీవ్రమైన నీటి ఎద్దడిని అనుభవిస్తున్నారు. చవకైన భూమి, పన్ను మినహాయింపులు, అనుకూల వాతావరణం పేరుతో బహుళజాతి టెక్‌ సంస్థలు తీవ్ర నీటికొరత ఉన్న ప్రాంతాల్లోనే డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. 

అమెరికాలోని అయోవా, అరిజోనా వంటి ప్రాంతాల్లో స్థానిక మున్సిపాలిటీల తాగునీటి సరఫరాలో 20 శాతం వరకు ఈ సర్వర్లే లాగేసుకుంటున్నాయి. నీటివనరులు కలుషితమై లేదా అడుగంటిపోవడంవల్ల ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల నుంచి లక్షలాదిమంది ప్రజలు వలసబాట పడుతుండగా, మరోవైపు విలాసవంతమైన డిజిటల్‌ వినోదం కోసం రోజూ కోట్లాది లీటర్ల నీటిని ఆవిరి చేసేస్తున్నారు.

భారత్‌లో 60% ఏఐ రీల్స్‌ కోసమే..
భారతదేశంలో నిత్యం 7 నుంచి 10 కోట్లమంది క్రియాశీల ఏఐ వినియోగదారులు ఉన్నారు. సేల్స్‌ఫోర్స్, ప్యూ రీసెర్చ్, కాంటర్‌ సంస్థ గ్లోబల్‌ సర్వే, అధ్యయనం ప్రకారం భారతదేశంలో చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ, లెన్సా, పర్‌చాన్స్‌ వంటివి ఉపయోగించే మొత్తం క్రియాశీల భారతీ­యుల్లో దాదాపు 3.5 కోట్లమంది (38 శాతం) కేవలం కాలక్షేపం, సరదా, వినోదం కోసమే వాడుతున్నారు. వైరల్‌ ట్రెండ్స్‌ నడిచే సమయాల్లో (ఉదా.. మెట్రో ఫి­ల్టర్లు, యానిమేట్‌ అవతార్లు వచ్చినప్పుడు) ఈ సంఖ్య 5 కోట్లు దాటుతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ ట్రెండ్‌లు నడిచే రోజుల్లో ఈ అనవసర విని­యోగదారుల సంఖ్య అంతకుమించుతోంది. జెన్‌–­జీ (వయసు 16–24) యువతలో 60% మంది రీల్స్, ఫేస్‌–స్వాప్, మీమ్స్‌ కోసమే గంటల తరబడి సర్వర్లను రీ–జనరేట్‌ చేస్తూ నీటిని కరి­గి­స్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement