ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. ఊపిరితిత్తుల సమస్య! | You May Look Healthy: But Your Lungs Could Be in Trouble | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. ఊపిరితిత్తుల సమస్య!

Sep 26 2026 6:05 AM | Updated on Sep 26 2026 9:02 AM

You May Look Healthy: But Your Lungs Could Be in Trouble

వాటికుండే ప్రత్యేక సామర్థ్యం వల్ల ప్రారంభ దశలో కన్పించని లక్షణాలు

శ్వాస క్రియలో మార్పులు, వ్యాయామ సామర్థ్యం తగ్గుదలను గమనించాలి  

విశ్రాంతి తీసుకుంటున్నా ఆయాసం, దీర్ఘకాలిక దగ్గు ఉంటే జాగ్రత్త పడాల్సిందే 

కొన్ని జాగ్రత్తలతో ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చంటున్న నిపుణులు

ఆరోగ్యంగా కనిపించే వ్యక్తులలో కూడా అంతర్గతంగా ఊపిరితిత్తుల వ్యాధులు ఉండే అవకాశాలు అధికంగానే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులకు విశేషమైన పని సామర్థ్యం (రిజర్వ్‌ కెపాసిటీ వల్ల) ఉండటం వల్ల, వ్యాధి ప్రారంభ దశల్లో లక్షణాలు కన్పించవని, శరీరం కూడా ఆ పరిస్థితిని తట్టుకుంటుందని అంటున్నారు. కాబట్టి ఒకరు శారీరకంగా దృఢంగా ఉన్నట్లు కనిపించినంత మాత్రాన వారి ఊపిరితిత్తులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్‌:

మరి ముందస్తుగా ఎలా గుర్తించాలి?
⇒ బయటి రూపాన్ని బట్టి కాకుండా, శ్వాసక్రియలో వచ్చే వివిధ మార్పుల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.  
⇒ వ్యాయామ సామర్థ్యం తగ్గుదల...గతంలో సులభంగా చేసిన పనులు (ఉదాహరణకు నడక, రన్నింగ్, మెట్లు ఎక్కడం) ఇప్పుడు చేస్తున్నప్పుడు త్వరగా అలసిపోవడం లేదా ఊపిరి అందకపోవడం 
⇒ వదలకుండా వేధించే దగ్గు... ఎటువంటి జలుబు, జ్వరం లేకపోయినా 3–4 వారాల కంటే ఎక్కువ కాలం పాటు దగ్గు ఉండటం 

⇒ కఫం రావడం.. ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు నిరంతరం కఫం బయటకు రావడం (ముఖ్యంగా రంగు మారినట్లయితే) 
⇒ శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం (వీజింగ్‌)...గాలి పీల్చేటప్పుడు లేదా వదిలేటప్పుడు గురక లాంటి లేదా ఈల వేసినట్లు శబ్దం రావడం 
⇒ ఛాతీలో నొప్పి లేదా బిగుతు.. శ్వాస తీసుకునే సమయంలో ఛాతీ భాగంలో అసౌకర్యంగా లేదా బరువుగా అనిపించడం

తీసుకోవాల్సిన రక్షణ చర్యలు 
⇒ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. 
⇒ ధూమపానం (సిగరెట్లు, బీడీలు తాగడం) పూర్తిగా మానేయాలి. ఇతరులు వదిలిన పొగ పీల్చకుండా జాగ్రత్త పడాలి 
⇒ బయటకు వెళ్లే ముందు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (గాలి నా­ణ్యత సూచిక)ను పరిశీలించాలి. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో తప్పనిసరిగా మాస్క్‌ (ఎన్‌95) ధరించాలి 

⇒ ఇల్లు, ఆఫీసు గదుల్లో గాలి ధారాళంగా ఆడేలా (వెంటిలేషన్‌) చూసుకోవాలి. వీలైతే ఎయిర్‌ ప్యూరిఫైయర్లను ఉపయోగించాలి 
⇒ క్రమం తప్పకుండా రోజుకు కనీసం 20–30 నిమిషాల పా­టు ప్రాణాయామం, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది 
⇒ రోజూ తగినంత నీరు తాగడం వల్ల ఊపిరితిత్తులలోని శ్లేష్మం పల్చగా మారి, టాక్సిన్స్‌ సులభంగా బయటకు వెళ్లిపోతాయి 
⇒ వైద్యుల సలహా మేరకు ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ) న్యుమోకోకల్‌ వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

ఊపిరితిత్తులకు ఎంత నష్టం జరిగితే ఎలాంటి లక్షణాలు కన్పించే అవకాశం?
ఊపిరితిత్తుల నష్టం శాతం- బయటకు కనిపించే లక్షణాలు
0%  - 20% - ఎలాంటి లక్షణాలు ఉండవు
20% -  50% - వ్యాయామం చేసేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు స్వల్ప ఆయాసం
50% కంటే ఎక్కువ - విశ్రాంతి తీసుకుంటున్నా ఆయాసం, దీర్ఘకాలిక దగ్గు, అలసట

శారీరక స్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా..
శారీరక స్థితి - తీసుకోవాల్సిన చర్యలు 
పూర్తిగా ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపిస్తారు- సాధారణ వార్షిక తనిఖీలు 
సాధారణంగానే కనిపిస్తారు - స్పిరోమెట్రీ పరీక్ష అవసరం 
బలహీనత లేదా అనారోగ్యం - తక్షణ వైద్య చికిత్స, పర్యవేక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement