8 చక్కెర కర్మాగారాల అమ్మకం | State govt has announced that it is no longer possible to continue the cooperative sugar factories | Sakshi
Sakshi News home page

8 చక్కెర కర్మాగారాల అమ్మకం

Sep 26 2026 5:12 AM | Updated on Sep 26 2026 5:12 AM

State govt has announced that it is no longer possible to continue the cooperative sugar factories

మూడు ఫ్యాక్టరీలకు నేరుగా లిక్విడేషన్‌  

ఐదింటిపై హైకోర్టు ఆదేశాల తర్వాత నిర్ణయం  

ఆస్తులు అమ్మి రుణాలు, వేతన బకాయిల చెల్లింపు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలను కొనసాగించడం ఇక ఎంతమాత్రం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ ఆర్థికసంస్థలకు చెల్లించాల్సిన రుణ బకాయిలతో పాటు రైతులు, ఉద్యోగుల బకాయిలను.. ఆస్తులను తెగనమ్మడం ద్వారా చెల్లించాలని నిర్ణయించింది. క్రషింగ్‌ లేక ఇటీవలే మూతపడిన మూడు చక్కెర కర్మాగారాలను నేరుగా విక్రయించేందుకు (లిక్విడేషన్‌కు) అనుమతి ఇచ్చిన ప్రభుత్వం మరో ఐదు ఫ్యాక్టరీల విషయంలో హైకోర్టు ఆదేశాల తర్వాత నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్యశాఖ జీవో ఎంఎస్‌ నంబర్‌ 250 జారీచేసింది.శ్రీవిజయరామ గజపతి కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ (భీమసింగ్‌), ఏటికొప్పాక కో–ఆపరేటివ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఇండ్రస్టియల్‌ సొసైటీ (దార్లపూడి), తాండవ కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ (పాయకరావుపేట) కర్మాగారాల లిక్విడేషన్‌కు ప్రభుత్వం నేరుగా అనుమతి ఇచ్చింది. 

చెరకు కొరత, పాతబడిన యంత్రాల కారణంగా కొంతకాలంగా ఈ మూడు కర్మాగారాల్లో క్రషింగ్‌ను నిలిపేశారు. మరోవైపు ఇప్పటికే మూతపడిన శ్రీ వేంకటేశ్వర కో–ఆపరేటివ్‌ షుగర్స్‌(గాజులమండ్యం), చిత్తూరు కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ (చిత్తూరు), కోవూరు కో–ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ (నెల్లూరు), అనకాపల్లి వి.వి.రమణ కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ (తుమ్మపాల), ఎన్‌.వి.ఆర్‌.–ఏ.డి.ఆర్‌. కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ (జంపని) విషయంలో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్నందున, హైకోర్టు ఆదేశాల మేరకు లిక్విడేషన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. జనరల్‌ బాడీ సమావేశాల నిర్వహణ కోసం ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను లిక్విడేటర్లుగా నియమించే అవకాశం కల్పించారు. ఈ ఎనిమిది కర్మాగారాల ఆస్తులను నగదుగా మార్చి ఆర్థికసంస్థలు, ఇతర రుణదాతలకు బకాయిలు చెల్లించిన తరువాత మిగిలే మొత్తాన్ని ప్రభుత్వ రుణాల పూర్తి, తుది పరిష్కారానికి వినియోగించాలని ఆదేశించింది.  

వేతన బకాయిలకోసం ఏపీఐఐసీ నుంచి రూ.66.57 కోట్ల రుణం 
శ్రీవిజయరామ గజపతి, ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీల పరిధిలో 1,114 మంది ఉద్యోగుల జీతాలు–వేతనాలు, రిటైర్మెంట్‌ ఇతర ప్రయోజనాలకు సంబంధించి రూ.40.20 కోట్ల బకాయిలున్నాయి. వీటితోపాటు కోవూరు, జంపని కర్మాగారాల పరిధిలో 840 మంది ఉద్యోగులకు రూ.26.37 కోట్ల బకాయిలున్నాయి. 

తొలుత ఈ మొత్తం 1,954 మంది ఉద్యోగులకు రూ.66.57 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ప్రాధాన్యతనిస్తూ ఈ మొత్తాన్ని ఏపీఐఐసీ నుంచి రుణం రూపంలో తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తర్వాత ఆయా కర్మాగారాల ఆస్తులను అమ్మగా వచ్చిన సొమ్ము నుంచి ఏపీఐఐసీకి తిరిగి చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఎనిమిది చక్కెర కర్మాగారాలు ప్రభుత్వం నుంచి, ఏపీ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఐడీసీ), ఆప్కాబ్, డీసీసీబీల నుంచి తీసుకున్న రుణాల మొత్తం రూ.1,300 కోట్లకుపైగా ఉంది. ఆయా కర్మాగారాల ఆస్తులను అమ్మగా వచ్చిన మొత్తం నుంచి ఈ రుణాలను చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ రైతు బకాయిలకు రూ.28.43 కోట్లు.. 
అనకాపల్లి జిల్లా చోడవరం కోఆపరేటివ్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ (గోవాడ) పరిధిలో 2024–25 సీజన్‌లో క్రషింగ్‌కు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రూ.28.43 కోట్ల బకాయిల కోసం ప్రభుత్వం రుణం మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా ఆమోదమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఈనెల 17న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో చోడవరం ఫ్యాక్టరీకి రూ.28.43 కోట్ల రుణ సాయం అందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సొసైటీ విక్రయాల ద్వారా వచ్చే మొత్తంతో ఈ రుణాన్ని తిరిగి వసూలుచేయాలని సూచించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement