ఉండ్రాజవరం సెంటర్‌లో కాపు యువత ఏర్పాటు చేసిన రంగా విగ్రహన్ని తొలగిస్తున్న పోలీసులు
ఉండ్రాజవరంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వని టీడీపీ నేతలు
ఓపిక నశించి విగ్రహం ఏర్పాటు చేసిన కాపు యువత
ఆ విగ్రహాన్ని అర్ధరాత్రి మాయం చేసిన పచ్చమూక
శుక్రవారం తిరిగి మరో విగ్రహం ఏర్పాటు.. దాన్నీ తొలగించిన పోలీసులు
పొక్లెయిన్‌తో దిమ్మె సైతం ధ్వంసం.. ధర్నాకు దిగిన కాపులు
నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం అయిన ఉండ్రాజవరంలో శుక్రవారం దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని తొలగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. మే నెలలో కాపు యువత రంగా విగ్రహం ఏర్పాటు చేయాలని ఉండ్రాజవరం గాందీబొమ్మ సెంటర్‌లో దిమ్మ నిర్మించారు. అనంతరం జనసేనకు చెందిన స్థానిక నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ అనుమతి కోసం ఎదురు చూశారు. అయితే గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలకు వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు ఇష్టం లేకపోవడంతో మంత్రి దుర్గేష్ సైతం అనుమతి ఇవ్వడానికి కాలయాపన చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి 12 గంటలకు కాపు యువత ఆ దిమ్మపై రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కాసేపటి తర్వాత.. అర్ధరాత్రి 1.30 సమయంలో ఆ సెంటర్‌లో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పక్కకు తప్పించి, టీడీపీకి చెందిన వారు ఆ విగ్రహాన్ని మాయం చేశారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న కాపు యువత వెంటనే రంగా మరో విగ్రహాన్ని తీసుకువచ్చి 10 గంటలకు అదే దిమ్మపై ఏర్పాటు చేశారు. మొదటిసారి ఏర్పాటు చేసిన విగ్రహం మాయం కావడంపై రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. ఓ దశలో పోలీసులు, యువత మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుని తోపులాట జరిగింది. టీడీపీ నేతలు తమను అణగదొక్కుతున్నారని కాపులు ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. అంతలో కొవ్వూరు డీఎస్పీ డి.దేవకుమార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. చర్చలు ఫలించలేదు. దీంతో పోలీసులు రంగా రెండో విగ్రహాన్ని సైతం ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేతల ఒత్తిడితో దిమ్మెను సైతం పొక్లెయినర్‌తో ధ్వంసం చేయించారు.
విగ్రహాన్నిఏర్పాటు చేసి తీరతాం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర
ఉండ్రాజవరంలో వంగవీటి మోహనరంగా విగ్రహం ఏర్పాటు చేసేంత వరకూ ఊరుకునేది లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. రంగా విగ్రహం ఏర్పాటుకు టీడీపీ నేతలు అడ్డుపడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విగ్రహం ఏర్పాటు విషయంపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కు పలుమార్లు చెప్పినా అనుమతి లేదంటూ కాలయాపన చేశారని, రాష్ట్రంలో ఏ విగ్రహానికి అనుమతులున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రంగా విగ్రహాలంటేనే మీకెందుకు అనుమతులు గుర్తుస్తున్నాయని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విగ్రహాలు రోడ్డుకు అడ్డంగా ఉన్నా ఫర్వాలేదా? అన్నారు. రెండు రోజుల్లో తప్పనిసరిగా ఉండ్రాజవరం వస్తామని, రంగా విగ్రహం పెట్టే వరకూ ఊరుకునేది లేదని వంగవీటి స్పష్టం చేశారు.


