ఆందోళనకు సిద్ధమవుతున్న అంగన్‌వాడీలు | Anganwadis preparing for agitation | Sakshi
Sakshi News home page

ఆందోళనకు సిద్ధమవుతున్న అంగన్‌వాడీలు

Sep 26 2026 4:41 AM | Updated on Sep 26 2026 4:41 AM

Anganwadis preparing for agitation

సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్టూ అనుబంధ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్ల వెల్లడి

గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్టూ అనుబంధ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్లు ప్రకటించాయి. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, రూరల్‌ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ అనుబంధ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, ఏఐటీయూసీ అనుబంధ సంఘం ప్రధాన కార్యదర్శి కె.లలితమ్మ, ఇఫ్టూ అనుబంధ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మావతి మాట్లాడారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు 2019 నుంచి వేతనాలు పెరగలేదని చెప్పారు. 

రకరకాల యాప్‌లు ప్రవేశపెట్టి పనిభారం పెంచారన్నారు. అనేక పోరాటాల ఫలితంగానే 2024 జూలైలో వేతనాలు పెంచుతామని మినిట్స్‌ కాపీ ఇచ్చారని, ఈ ఏడాది మార్చి 2న ఆందోళన చేసిన తరువాత అదేనెల 10న మంత్రి యూనియన్లతో మాట్లాడి త్వరలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నేటికీ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు అంగన్‌వాడీలకు కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలు చేయాలని కోరారు. అంగన్‌వాడీల కుటుంబాలకు వితంతు, వృద్ధాప్య పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు అమలుకావడంలేదని చెప్పారు. 

రేషన్‌ కార్డులు కూడా జారీచేయడం లేదన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. రూ.26 వేల కనీస వేతనం, సంక్షేమ పథకాలు ఇవ్వాలని, ప్రమోషన్‌ గైడ్‌లైన్స్‌ జీవో సవరించాలని డిమాండ్‌ చేశారు. నవచేతన యాప్, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ను రద్దుచేయాలన్నారు. మెనూ, మెనూ చార్జీలు పెంచాలని కోరారు. ఈ సమస్యలకు పరిష్కారం కోరుతూ అక్టోబర్‌ 2న గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు ఇస్తామని, అక్టోబర్‌ 6న ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులకు సామూహిక రాయబారాలు పంపుతామని వారు చెప్పారు.  అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో టి.గజలక్ష్మి, కె.ప్రేమ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement