ఇప్పుడున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొని, వాటిని దాటుకుంటూ వచ్చినవాళ్లే! వారిలో తమిళ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఒకరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన ఇతడు తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు.
సినిమాల్లోకి వస్తావా?
టీవీలో పనిచేసినప్పుడు ఓసారి దర్శకనిర్మాత కేఎస్.సినిశ్ ఆఫీస్‌కు వెళ్లాను. ఆయన నన్ను చూడగానే సినిమాల్లోకి వచ్చి ఏం చేస్తావ్? అన్నాడు. అప్పుడు నేను 'వేట్టయి మన్నన్' మూవీలో చిన్న కామెడీ రోల్ చేస్తున్నా.. హీరో అవ్వాలని నేనేమీ కలలు కనలేదు. కానీ, పైకి మాత్రం హీరో అవుతా అని చెప్పాను.
కామెడీ పాత్రలే సెట్టు!
ఇలాంటి పనికిమాలిన కలలు ఎందుకు కంటున్నావ్? అయినా నువ్వు కామెడీ బాగా చేస్తావ్.. అలాంటి పాత్రలు ట్రై చేయ్ అని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. ఏ.. నేను ఎందుకు హీరో కాకూడదు? అని అడిగాను. అందుకాయన ఓ డ్యాన్సర్‌ని చూపించి అతడు హీరో కాగలడేమోకానీ నేను కాదని కరాఖండిగా చెప్పాడు. తర్వాత అదంతా నేను మర్చిపోయాను కానీ, సినిశ్ మర్చిపోలేదు.
నేను మర్చిపోయా.. కానీ!
నేను హీరో అయ్యాక ఓసారి అతడు ఫోన్ చేసి.. నేనలా మాట్లాడినందుకు కోపంగా ఉందా? అని అడిగాడు. అప్పుడు నేను పనిలో బిజీగా ఉండటంతో సరిగా మాట్లాడలేకపోయాను. తర్వాత ఎప్పుడూ దానిగురించే మాట్లాడనేలేదు. బహుశా అతడిప్పటికీ అదే మాటపై నిలబడ్డాడేమో! అని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.


