బుల్లితెర జంట అశ్లేష సావంత్ (Ashlesha Savant)- సందీప్ బస్వాన (Sandeep Baswana) పెళ్లిపీటలెక్కారు. వీళ్లది రెండు మూడేళ్ల ప్రేమ కాదు.. ఏకంగా 23 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇన్నాళ్లకు తమ ప్రేమబంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఈమేరకు తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్ చంద్రోదయ ఆలయం ఈ పెళ్లికి వేదికగా మారింది.
ఆ గుడికెళ్లాకే..
నవంబర్ 16న ఈ పెళ్లి జరగ్గా ఆలస్యంగా బయటకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. అశ్లేష, నేను ఏప్రిల్‌లో బృందావనానికి వెళ్లాం. అక్కడి రాధాకృష్ణుడి గుడి మమ్మల్ని కట్టిపడేసింది. ఆ ట్రిప్ తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టింది. 23 ఏళ్లుగా జంటగా ఉన్న మేము అలా వైవాహిక జీవితంలో అడుగుపెట్టాం.
అలా మొదలైంది
మా పేరెంట్స్ ఈ శుభవార్త కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. సింపుల్‌గా మా పెళ్లి జరుపుకున్నాం. కృష్ణుడి గుడిలో వెడ్డింగ్ జరగడం కన్నా ఉత్తమమైనది ఇంకేముంటుంది? అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అశ్లేష వయసు 41 కాగా, సందీప్ వయసు 47. వీరిద్దరూ 2002లో వచ్చిన 'క్యూంకీ సాస్‌బీ కభీ బహుతీ' సీరియల్‌లో కలిసి నటించారు. కొన్నిసార్లు షూటింగ్ ఆలస్యమైనప్పుడు అశ్లేష తన ఇల్లు దూరంగా ఉండటంతో సందీప్ ఇంటికి వెళ్లి అక్కడే బస చేసేది.
సీరియల్స్
అలా వీరిమధ్య బంధం మొదలైంది. చాలా ఏళ్లుగా వీరు కలిసే జీవిస్తున్నారు. ప్రస్తుతం అశ్లేష.. జనక్ సీరియల్ చేస్తోంది. గతంలో అనుపమ సీరియల్‌లో నెగెటివ్ పాత్ర పోషించింది. సందీప్ చివరగా 'అపొల్లెనా- సప్నోకీ ఉంచి ఉడాన్' సీరియల్‌లో కనిపించాడు.


