
అక్టోబర్ 20న ముంబైలో కన్నుమూసిన సుప్రసిద్ధ నటుడు అస్రానీ (84)కి నివాళిగా...
50 ఏళ్ల పాటు వెండితెరపై నవ్వులు పూయించిన ప్రసిద్ధ హాస్యనటుడు అస్రానీ దీపావళి రోజున తారాజువ్వలా ఎగిసి తారల్లో కలిసిపోయారు. ‘గుడ్డీ’, ‘బావర్చీ’, ‘అభిమాన్ ’, ‘ఛోటీసీ బాత్’, ‘చుప్‌కే చుప్‌కే’... ఇలా అనేక సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులకు ప్రియమైనవి. ఇక ‘షోలే’లో వేసిన బ్రిటిష్ జమానేకే జైలర్ పాత్ర కోట్ల మందిని అలరిస్తూనే ఉంది. అస్రానీపై నివాళి కథనం.
అస్రానీ జైపూర్‌లో పుట్టాడు. హిట్లర్ జర్మనీలో పుట్టాడు.ఇద్దరికీ లంకె ఉంది. ఒకసారి అస్రానీకి రచయిత జావేద్ అఖ్తర్ నుంచి పిలుపు వచ్చింది. ‘మంచి రోల్ ఉంది. చేయాలి. దానికి ముందు ఈ ఫొటోలు చూడు’ అని ఫొటోలు చూపించాడాయన.ఆ ఫొటోలు హిట్లర్‌వి. ఆ తర్వాత హిట్లర్ ఉపన్యాసాలు ఎక్కడి నుంచో తెప్పించి ‘వాటిని విను’ అని ఇచ్చాడు. అస్రానీ హిట్లర్ ఉపన్యాసాలు విన్నాడు. ‘ఈ ఉపన్యాసాలతో హిట్లర్ నరరూప రాక్షసుడు కాగలిగాడు. నువ్వు నవ్వుల రాజు కావాలి. హిట్లర్‌లా కనిపించి, తెలివైన మూర్ఖుడిలా వ్యహరిస్తూ కామెడీ పండించాలి. చేస్తావా’ అన్నాడు జావేద్ అఖ్తర్. ‘చేస్తాను’ అన్నారు అస్రానీ.
ఆ వేషం జైలర్. ఆ సినిమా ‘షోలే’. ‘హమ్ బ్రిటిష్ జమానేకే జైలర్ హై’ (నేను బ్రిటిష్ కాలం నాటి జైలర్‌ను )... అనే ఈ డైలాగ్ 1975లో సినిమా రిలీజ్ అయితే 2025 వరకూ అస్రానీని బతికిస్తూనే ఉంది. ఆ రోల్ అంత హిట్. హిట్లర్‌లా కనిపిస్తూ, నిరంకుశుడైన జైలర్‌గా ఖైదీలను బెదిరిస్తూ, తానే పిరికిగా వణికిపోయే పాత్రలో అస్రానీ అద్భుతంగా జనానికి గుర్తుండిపోయాడు. నియంతలు పైకి భయానకంగా కనిపించే పిరికివారు.
అస్రానీ ఆ పిరికితనాన్ని, మేకపోతు గాంభీర్యాన్ని అద్భుతంగా పలికించగలిగాడు. జైలులో ఇతను ప్రతిదీ అనుమానించడం, దానికి విరుగుడుగా ధర్మేంద్ర, అమితాబ్ ఇతణ్ణి ఆటపట్టించడం, ఇతనికి గూఢచారిగా పని చేసే బార్బర్ కెస్టో ముఖర్జీ... ‘మైనే కహా అటెన్షన్’, ‘ఆధే ఉధర్ జావో.. ఆధే ఇధర్ జావో’.. అని అస్రానీ చెప్పే డైలాగులు సినిమాలో రిలీఫ్ ఇస్తూ జనాన్ని భారీగా ఎంటర్‌టైన్ చేశాయి. అస్రానీ డైలాగులు క్యాసెట్లుగా, రికార్డులుగా కూడా హిట్ అయ్యాయి.
⇒ అస్రానీ అసలు పేరు గోవర్థన్ అస్రానీ. వాళ్లు సింధీలు. స్వస్థలం కరాచీ అయినా దేశవిభజన సమయంలో తండ్రి జైపూర్‌కు వచ్చి కార్పెట్‌ల కార్ఖానాలో పని చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అస్రానీ అక్కడే పుట్టి పెరిగాడు. కాని చదువు అబ్బలేదు. సినిమాల మీద ధ్యాస ఉండేది. ఆ పిచ్చితో మెట్రిక్ తర్వాత చదువు మానేసి జైపూర్ ఆల్ ఇండియా రేడియోలో తాత్కాలికంగా పని చేయడం మొదలుపెట్టాడు. పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ మొదటి బ్యాచ్ విద్యార్థిగా 1964–66 మధ్య నటన నేర్చుకున్నాడు. ఆ సర్టిఫికెట్ పట్టుకుని ముంబై చేరి వేషాలు అడిగితే ‘సర్టిఫికెట్ చూపితే వేషాలు వస్తాయా’ అని అందరూ నవ్వేవారు.
బతుకు చాలా కష్టమైంది అస్రానీకి. కొన్నాళ్లు జైపూర్ వెళ్లిపోయాడు. కొన్నాళ్లు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయితే చదువుకున్నాడో ఆ ఇన్‌స్టిట్యూట్‌లోనే పార్ట్‌టైమ్ టీచర్‌గా పని చేశాడు. అతని కింద జయభాదురి, శతృఘ్నసిన్హా, నవీన్ నిశ్చల్, డానీ... వీరంతా పాఠాలు నేర్చుకున్నవారే. ‘గుడ్డీ’ సినిమాలో హీరోయిన్ వేషానికి జయభాదురిని సెలెక్ట్ చేసేందుకు పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చిన హృషికేశ్ ముఖర్జీని అస్రానీ గట్టిగా పట్టుకున్నాడు. అలా ‘గుడ్డీ’లో వేషం దొరికింది. రిలీజయ్యాక అస్రానీ దశ తిరిగింది.
⇒ 1970లు వచ్చేసరికి సీనియర్ కమెడియన్లు జానీ వాకర్, మహమూద్ మెల్లగా రిటైర్మెంట్‌కు చేరుకుంటున్నారు. కొత్త కమెడియన్లు కావాలి. ఆ సమయంలో అస్రానీ అందుకున్నాడు. అయితే వెకిలి హాస్యం, స్లాప్‌స్టిక్ కామెడీ చేయలేదు. తన గొంతు, ఎక్స్‌ప్రెషన్‌తోనే హాస్యం పండించగలిగాడు. హృషికేశ్ సినిమాల్లో అస్రానీ వేషాలు గట్టిగా పండాయి. ‘అభిమాన్’లో అమితాబ్ సెక్రట్రీగా పని చేస్తాడు అస్రానీ. ఒక దశలో గాయకుడైన అమితాబ్‌కు చాలా డబ్బు వచ్చేసరికి లెక్క చెబుతున్న అస్రానీకి ఒక కట్ట డబ్బు ఇచ్చి ‘నువ్వు ఉంచుకో’ అంటాడు అమితాబ్. అస్రానీకి ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ‘అభిమానంతో నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. బిచ్చగాణ్ణి కాను’ అంటాడు. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది ఆ సన్నివేశం.
‘చుప్కేచుప్కే’లో ధర్మంద్ర ఫ్రెండ్‌గా నటిస్తాడు అస్రానీ. తన బావగారిని ఆటపట్టించడానికి డ్రైవర్ వేషంలో వచ్చిన ధర్మేంద్రకు తనూ తోడు నిలిచి అల్లరి సృష్టిస్తాడు. చుప్కేచుప్కే సినిమాలో అస్రానీ పాత్రకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. బాసూ చటర్జీ తీసిన ‘ఛోటిసీ బాత్’ లో అస్రానీ పాత్ర అందరికీ గుర్తే. తన చొరవతో, తెలివితో హీరోయిన్ విద్యా సిన్హాను ఎగరేసుకుపోదామనుకుంటాడు. కాని అమాయకమైన హృదయమున్న అమోల్ పాలేకర్ వైపే విద్య మొగ్గుతుంది. ఆమె లాంటి యువతిని పొందాలంటే తనలో రావలసిన మార్పు పొందేందుకు ట్రయినింగ్ కోసం అశోక్ కుమార్ దగ్గరకు అస్రానీ బయలుదేరడంతో ఆ సినిమా గిలిగింతలు పెడుతూ ముగుస్తుంది.
⇒ అస్రానీ నటుడే కాదు రచయిత, దర్శకుడు కూడా. గుజరాతీలో, హిందీలో ఆయన అరడజనుకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఎప్పుడూ తనను తాను లైమ్‌లైట్‌లో ఉంచుకుంటూ నటిస్తూ వెళ్లాడాయన. కాంట్రవర్శీలకు దూరంగా ఉన్నాడు. మరణించే వరకూ నటించాలని కోరుకుని అలాగే వీడ్కోలు తీసుకున్నాడు. పెద్ద పెద్ద హీరోలకు స్నేహితుడిగా మసలిన అస్రానీ జనాన్ని 50 ఏళ్ల పాటు వారి నిత్య గొడవల నుంచి తప్పిస్తూ నవ్విస్తూ వచ్చాడు.ఇలాంటి నటుడు చనిపోతే పోయినందుకు బాధ పడాలో ఆ హాస్య సన్నివేశాలు గుర్తుకు తెచ్చుకోవాలో తెలియని సందిగ్ధత ప్రేక్షకులది. హాస్యనటులకు మాత్రమే సాధ్యమైన ఇరకాటం ఇది.
నిజమైన వికట నటులకు ఇదే కలికితురాయి.
తెలుగు అనుబంధం
అస్రానీ 1980–90ల మధ్య కొంత స్ట్రగుల్ అయ్యాడు. యాక్షన్ సినిమాల రోజుల్లో అలాంటి నటులకు తగిన పాత్రలు దొరకలేదు. ఆ సమయంలోనే మన దాసరి, రాఘవేంద్రరావు, తాతినేని రామారావుల సినిమాల్లో నటించా డాయన. మహేశ్‌బాబు హీరోగా తొలి సినిమా ‘రాజకుమారుడు’లో బ్రహ్మానందంతో పాటు కనిపిస్తాడు. ‘సిరిసిరిమువ్వ’ హిందీ రీమేక్ ‘సర్గమ్’లో, ‘మరో చరిత్ర’ రీమేక్ ‘ఏక్ దూజే కే లియే’లో, ‘ఊరికి మొనగాడు’ రీమేక్ ‘హిమ్మత్‌వాలా’లో ఇంకా చాలా సినిమాల్లో నటించాడు. అల్లు రామలింగయ్యకు అచ్చొచ్చిన చిత్రగుప్తుడి వేషాన్ని ‘యమలీల’ రీమేక్ ‘తక్‌దీర్‌వాలా’ లో ఆయన పోషించాడు. యముడిగా ఖాదర్ ఖాన్ నటించాడు. ఆ తర్వాత ప్రియదర్శన్ కామెడీలు హిందీలో మొదలయ్యాక అస్రానీ మరోమారు విజృభించారు. ‘అచ్ఛా హువా మై అంధా హూ’ అని ఆయన చెప్పే డైలాగ్ మీమ్స్‌లో కనిపిస్తూనే ఉంటుంది.