
ఆస్కార్ ఎంట్రీ
ఈ దేశవాసులకు ఈ దేశమే ఇల్లు. ఇక్కడే ఉండాలి. జీవించాలి. కాని ఈ నేల ప్రతి ఒక్కరికీ నివాసయోగ్యంగా ఉందా? ప్రతి ఒక్కరినీ సమానంగా, గౌరవంగా చూస్తోందా?
ఏ మహమ్మారో వస్తే వలస కూలీలను ‘మీ ఊరికి పోండి’ అని సాటి మనుషులే తరిమికొడితే ‘ఇంటి వైపు’ నడక సాగుతుందా? మన హైదరాబాదీ దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీసిన ‘హోమ్‌బౌండ్’ ఎన్నో సామాజిక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివక్షలను ప్రశ్నిస్తోంది. భారత దేశం నుంచి ఆస్కార్‌కు ఆఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన ఈ సినిమా వివరాలు.
మే 21, 2025. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కనీవినీ ఎరగనట్టుగా స్టాండింగ్ ఒవేషన్ ఇస్తున్నారు ప్రేక్షకులు. సినిమా అయ్యాక లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ఒక నిమిషం... రెండు నిమిషాలు... చప్పట్లు ఆగడం లేదు... 9 నిమిషాల పాటు చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. ఆ సినిమాలో నటించిన నటీనటులు, నిర్మాత, దర్శకుడు ఉద్వేగంతో కన్నీరు కారుస్తూ ఒకరిని ఒకరు హత్తుకున్నారు. బహుశా ఆ చప్పట్ల మోత ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ను తాకినట్టున్నాయి. 2026లో జరగనున్న 98వ ఆస్కార్ అవార్డ్స్ పోటీకి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరి కోసం ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆ సినిమాను ఎంపిక చేశారు. పేరు: హోమ్‌బౌండ్.
→ అదే దర్శకుడికి అదే గుర్తింపు
‘హోమ్‌బౌండ్’ (ఇంటి వైపు) దర్శకుడు నీరజ్ ఘేవాన్. ఇంతకు ముందు ఇతను తీసిన ‘మసాన్’ సినిమా మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా విపరీతమైన ప్రశంసలు పొందింది. దానికి కారణం ఆ సినిమాలో ఎత్తి చూపించిన వివక్ష, తాత్త్వికత. ఇప్పుడు కూడా అలాంటి వివక్షను, ఆధిపత్యాన్ని దర్శకుడు గొప్ప కళాత్మకంగా, సెన్సిబుల్‌గా చూపించడం వల్లే ‘హోమ్‌బౌండ్’కు ఘన జేజేలు దక్కుతున్నాయి. హాలీవుడ్ దిగ్గజం మార్టిన్ స్కోర్‌సెసి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉండటమే కాదు సినిమా విపరీతంగా నచ్చడంతో పొగడ్తలతో ప్రచారంలోకి తెచ్చాడు. ఆ తర్వాత ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో సినిమాకు ప్రశంసలు మొదలయ్యాయి. కాన్స్ తర్వాత టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘హోమ్‌బౌండ్’ రెండవ స్థానంలో నిలిచింది. ‘మసాన్’ సినిమా సమయంలో కేన్స్‌లో పాల్గొన్న నీరజ్ తిరిగి ఈ సినిమాతో అదే కేన్స్‌లో సగర్వంగా నిలిచాడు.
→ ఇద్దరు స్నేహితుల కథ
‘హోమ్‌బౌండ్’ షోయెబ్, చందన్ కుమార్ అనే ఇద్దరు మిత్రుల కథ. వీరిద్దరూ అట్టడుగు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న యువకులు. చిన్నప్పటి నుంచి వీరు పోలీస్ కానిస్టేబుళ్లు అవ్వాలనుకుంటారు. అందుకై ప్రయత్నిస్తూ నగరంలో అంత వరకూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కాని ఒకసారి ఊరు విడిచి నగరానికి చేరుకున్నాక ప్రపంచపు పోకడ, మన దేశంలో వేళ్లూనుకుని ఉన్న వివక్ష వారికి అనుభవంలోకి వస్తుంది. చందన్ దళితుడైన కారణంగా అవమానాలు ఎదుర్కొంటుంటే, షోయెబ్ ముస్లిం కావడం వల్ల వివక్షను ఎదుర్కొంటూ ఉంటాడు.
ఈ ‘దేశం’ అనే ‘ఇల్లు’ వీరికి ‘కొందరికి’ ఇస్తున్నట్టుగా మర్యాద, గౌరవం ఇవ్వడం లేదు. ‘కానిస్టేబుల్ ఉద్యోగం’ వస్తే అన్ని వివక్షలు పోతాయని వీరు అనుకుంటారుగాని అదంతా ఉత్తమాట... కొందరు ఎంత ఎదిగినా కిందకే చూస్తారని కూడా అర్థమవుతుంది. వీరికి పరిచయమైన అమ్మాయి సుధా భారతి అంబేద్కరైట్‌గా సమాజంలో రావలసిన చైతన్యం గురించి మాట్లాడుతుంటుంది.
ఈలోపు పులి మీద పిడుగులా లాక్‌డౌన్ వస్తుంది. అక్కడి నుంచి ఆ స్నేహితులిద్దరూ సొంత ఊరికి బయలుదేరడంతో ఆ ప్రయాణం వారిని ఎక్కడికి చేర్చిందనేది కథ. ఇందులో ఇద్దరు స్నేహితులుగా విశాల్ జేత్వా, ఇషాన్ ఖట్టర్ నటించారు. సుధా భారతిగా జాన్హి్వ కపూర్ నటించింది. కరణ్ జొహర్, అదర్ పూనావాలా (కోవీషీల్డ్ తయారీదారు) నిర్మాతలు. సహజమైన పాత్రలు, గాఢమైన సన్నివేశాలు, దర్శకుడు సంధించే ప్రశ్నలు ఈ సినిమా చూశాక ప్రేక్షకులను వెంటాడుతాయని ఇప్పటి వరకూ వస్తున్న రివ్యూలు చెబుతున్నాయి. ఆస్కార్ నామినేషన్స్‌ను జనవరి 22, 2026న ప్రకటిస్తారు. హోమ్‌బౌండ్ నామినేట్ అవుతుందని ఆశిద్దాం. మరో ఆస్కార్ ఈ సినిమా వల్ల వస్తే అదీ ఘనతే కదా.
నిజ సంఘటన ఆధారంగా...
ఈ సినిమాను నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీశాడు. 2020లో న్యూయార్క్ టైమ్స్‌లో కశ్మీర్ జర్నలిస్ట్ బషారత్ పీర్ ఒక ఆర్టికల్ రాశాడు. ఒక మిత్రుడి సమాధి పక్కన కూచుని ఉన్న మరో మిత్రుడి ఫొటో వేసి. ‘టేకింగ్ అమృత్ హోమ్’ అనే ఆ ఆర్టికల్ కోవిడ్ కాలంలో సూరత్ ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఇద్దరు మిత్రులు ఉత్తర్ ప్రదేశ్‌లోని తమ సొంత ఊరుకు బయలుదేరి ఎలా సర్వం కోల్పోయారో, వారిలో ఒక మిత్రుడు చనిపోతే మరో మిత్రుడు కోవిడ్‌కు భయపడకుండా ఆ శవాన్ని ఎలా ఇంటికి చేర్చాడో బషారత్ ఆ ఆర్టికల్‌లో రాశాడు. అది చదివిన నీరజ్ కోవిడ్ సమయాన్ని నేపథ్యంగా ఉంచుతూనే ఈ దేశంలో వ్యాపించిన సామాజిక దుర్నీతులను ముందు వరుసలో పెట్టి ‘హోమ్‌బౌండ్’ను తీశాడు.