పాలిటిక్స్ ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయ అరంగేట్రానికి ముందు ఇదే నా చివరి సినిమా అవుతుందని ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా పొంగల్ బరిలో నిలిచింది.
ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే గ్రాండ్ ఆడియా లాంఛ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. తమిళులు ఎక్కువగా ఉండే మలేసియాలో ఈ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమందికి పైగా ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 27న జరగనున్న ఈవెంట్ ద్వారా గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే ఈ భారీ ఈవెంట్ నేపథ్యంలో మలేసియా పోలీసులు అలర్ట్ అయ్యారు. కౌలాలంపూర్‌లో జరగనున్న ఈ బిగ్ ఈవెంట్‌పై ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయవద్దని ముందస్తుగానే హెచ్చరించారు. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రసంగాలు చేయవద్దని మలేసియా పోలీసులు సూచించారు. రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయడం, బ్యానర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ బుకిట్ జలీల్ స్టేడియంలో జరగనుంది.
కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.


