హెచ్‌ఎండీఏ కార్యాచరణ ప్రణాళిక
పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానం
మౌలిక సదుపాయాలు, టౌన్‌షిప్‌ల అభివృద్ధి
రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు త్వరలో డీపీఆర్ రూపకల్పన
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళిక(కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా ఔటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్) నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) వరకు రహదారుల విస్తరణకు హెచ్‌ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఓఆర్‌ఆర్–ఆర్‌ఆర్‌ఆర్ మధ్యన వివిధ ప్రాంతాల్లో మొత్తం 16 గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు 41 కి.మీ. మేర నిర్మించనున్న మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుతోపాటు బుద్వేల్ నుంచి కోస్గి వరకు సుమారు 81 కి.మీ. మేర నిర్మించనున్న రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు డీపీఆర్ కోసం అధికారులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే ఈ మార్గాల్లో భూసేకరణకు హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ రెండింటితోపాటు మరో 14 చోట్ల ఈ తరహా రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ మీదుగా నేరుగా ట్రిపుల్ ఆర్ వరకు చేరుకొనే విధంగా ఈ రహదారుల నిర్మాణం ఉంటుందని అధికారులు అంటున్నారు. మహానగరం అభివృద్ధి, విస్తరణకు అనుగుణంగా దశలవారీగా రోడ్ల నిర్మాణంపై హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది. ఈ మేరకు తెలంగాణ రైజింగ్–47 నివేదికలోనూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు భారీ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు కూడా హెచ్‌ఎండీఏ యోచిస్తోంది. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టౌన్‌షిప్‌లను నిర్మించనుంది. 2047 నాటికి రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ సుమారు 3.5 లక్షల ఇళ్లను నిర్మించి ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగానే రహదారుల విస్తరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.
రెండో రోడ్డుకు త్వరలో డీపీఆర్...
ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుద్వేల్ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వెలుపల ఉన్న కోస్గి వరకు నిరి్మంచనున్న రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు త్వరలోనే డీపీఆర్ తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. టీజీఐఐసీ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ దీన్ని 167వ జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని 7,250 చ.కి.మీ. నుంచి సుమారు 10,050 చ.కి.మీ. వరకు ప్రభుత్వం ఇప్పటికే విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో 11 జిల్లాలకు హెచ్‌ఎండీఏ కార్యకలాపాలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగానే పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ముందుకు సాగుతోంది. సమగ్ర మాస్టర్‌ప్లాన్–2050లో భాంగా ఆర్థికాభివృద్ధి, సమగ్ర పట్టణ ప్రజారవాణా వ్యవస్థ, జలవనరులు, అడవుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది.
ఈ మూడు ప్రణాళికలు తుదిదశకు చేరుకున్నాయి. పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్ హబ్స్ నెలకొల్పే ప్రాంతాలకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల మీదుగా తేలిగ్గా రాకపోకలు సాగించడానికి వీలవుతుంది. టీజీఐఐసీకి చెందిన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ మేరకు బుద్వేల్ నుంచి చందన్‌వెల్లి, పేరారం, గూడూరు, దోర్నాలపల్లి, దోమ తదితర ప్రాంతాల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం వరకు దీన్ని నిర్మించనున్నారు. సుమారు 81 కి.మీ. మేర ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో హెచ్‌ఎండీఏ పరిధి 52 కి.మీ.వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా మరికొందరు రైతులు పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని డీపీఆర్‌పై ముందుకు వెళ్లనున్నట్లు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.


