
నివాళి
‘ఆ తోటలోనొకటి ఆరాధనాలయము’ అని గానం చేసి తెలుగువారి అపురూప గాయనిగా నిలిచిన రావు బాలసరస్వతి దివిలోని దివ్య పాటల లోగిలికి తరలి వెళ్లారు.
‘మల్లెపూలు మొల్లపూలు కల్వపూలు కావాలా’... అని సుమగీతాలనిచ్చిన రావు బాలసరస్వతి వాడని పూలుండే లోకానికి బయలుదేరారు. గాయనిగా సవాళ్లు ఎదుర్కొన్నా గొంతు ఖైదు చేయబడినా నిలిచిన నాలుగు నిక్కమైన నీలాలతోనే నేటికీ మిలమిలలాడిన ఆమె వజ్రాల నదులు పారే అంబరాల బాట పట్టారు. ఆమెకు తెలుగువారి నివాళి. లలిత సంగీత ప్రపంచపు సురాగమయ జోహారు.
ఈ వేళ పొద్దున్నే ఫేస్‌బుక్‌లో, ఇతర గ్రూపుల్లో రావు బాలసరస్వతి గారి ఫొటో చూడగానే మనసు కీడు శంకించింది. చాలా రోజులు నుంచి ఆమె ఆరోగ్యం బాగా లేదని తెలుసు. అయినా వున్నారనే ఆలోచన తృప్తినిస్తుంది. ఇంక ఈ రోజు తో ఆ ఆశ లేదు. ఆమె తెలుగువారి తొలి నేపథ్యగాయని అవునో కాదో ఆ చర్చ వేరేగాని తొలి ప్రముఖ నేపథ్య గాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సి.ఆర్.సుబ్బరామన్, ఎస్.రాజేశ్వరరావుల సంగీతంలో ఎన్ని గొప్ప పాటలు. ‘దేవదాసు’లో ఆమె పాడిన ‘తానే మారెనా... గుణమ్మే మారెనా’ పాట ఎంతమందికో ఇష్టం. ఆమె పాడిన ’ఆ తోటలో నొకటి ఆరాధనాలయము’ విని ‘అందులో ఆమె అందగాడెవరే అని గొంతెత్తి పాడుతూ వుంటే మనసు ఎటో వెళ్లిపోతుంది’ అన్నారు మహా రచయిత చలం. అంత మధురమైన స్వరం బాలసరస్వతిది.
చాలా ఏళ్ల క్రితం గుంటూరులో ప్రోగ్రాం. కారణం ‘అజో విభో అవార్డు’ ఆమెను వరించింది. ఆ సభకు హాలులో జనం పోటెత్తారు. ఎన్ని రోజులు అయింది! ఆమెని చూడాలి. ఆమె పాట వినాలి. అప్పటికే భర్త ఆంక్షలతో ఆంధ్రదేశం ఆమె పాటకి దూరమై దాదాపు అర్ధ శతాబ్దం అయింది. అందుకే అదో అపురూప అవకాశం అని విజయవాడ నుంచి మేమూ వెళ్ళాం. ఎప్పటిలా నేను పాడనని నిర్వాహకులకి చె΄్పారుట. అవార్డు ఇచ్చాక ‘అమ్మా... ఒక ముక్క పాడండి’ అని ప్రేక్షకులు ఒక్క గొంతుతో అడిగితే సరేనని –
చలి గాలి వీచింది – తెరవారబోతోంది
ఇకనైన ఇలు చేరవా – ఓ ప్రియా ఇకనైన ఇలు చేరవా...
పాట వింటూ అందరూ చప్పట్లు కొట్టారు. ఆ ఉద్వేగాన్ని మర్చిపోలేను. అందరి కళ్లలో నీళ్ళు! లేచి నిల్చుని చప్పట్లు. మారుమోగిన హాలు. ఆ తర్వాత ఆమెతో చనువు ఏర్పడ్డాక అడిగాను ’ఎందుకలా పాడనంటారు’ అని . ‘చాలా రోజులుగా పాడలేదు గదా... అప్పటి పాటలా రాకపోతే నాకు బాగుండదు’ అన్నారు. ’ఎవరన్నారు మీ పాట అప్పటి పాటలా లేదని.? వయసుతో మరింత అందం వచ్చింది’ అన్నాను. నిజమే! ఆ గొంతులో మధురిమ ఏ మాత్రం తగ్గలేదు.
‘బెజవాడ వచ్చి నాలుగు రోజులు మీ ఇంట్లో వుంటా, నన్ను పాడమని అడగద్దు’ అన్నారొకసారి. అలాగేనని తీసుకుని వచ్చాను. మహీధర రామ్మోహనరావు గారు, నండూరి రామ్మోహనరావు గారు... ఇలా అందరూ వచ్చారు ఆమెను చూడటానికి. ఆమెకీ వారందరంటే అభిమానమే. అందరూ ఇంట్లో కూర్చుని కబుర్లు మొదలు పెట్టాక పాట ఎలా ఆగుతుంది? రామ్మోహనరావు గారి కోరిక పై ‘ఆ తోటలో నొకటి ఆరాధనాలయం’ పాడారు. ‘రెల్లు పూల పానుపు పైన ఎవరో వెన్నెల జల్లినారమ్మా!’ అని ఆమె పాడుతూ ఉంటే నిజంగానే వెన్నెల మా అందరి మనసుల్లో. ఆ స్వరం జల్లుజల్లుగా కురిపించింది. అంత మంది పండితులు, కవులు మధ్య కూర్చునే సరికి ఆ కోయిల అలా నాలుగు గంటలసేపు పాడింది! ఎంత భాగ్యం కదా!
అదే మొదలు. ఎప్పుడు రావాలి అని అనిపిస్తే అపుడు విజయవాడ రావడం నాలుగు రోజులు వుండడం. మా ఇంట్లో కుదరని పరిస్థితి వచ్చినప్పుడు హేమ పరిమిగారిని అడిగాను. ఆమె ఎంతో సంతోషించి వారి పొదరింట్లో రెండు మూడుసార్లు ఆతిథ్యం యిచ్చారు. బాలసరస్వతి గారి పాట ఎంత మధురమో మనసు అంత సున్నితం. ఒకసారి స్నేహం చేస్తే మర్చిపోరు. ఆత్మీయతను పదిసార్లు గుర్తు తెచ్చుకుంటారు. మనకి ఆమె చిన్నప్పటి నుంచి తెలిసిన చుట్టం అవుతారు. రాగానే ముందు పాత పరిచయాలు గుర్తుకు తెచ్చుకుని వారిని ఒకసారి కలవాలి అని అనుకుంటారు. ‘అమ్మాయి’ అంటూ స్వంత కూతురులా చూసుకుంటారు. అలా వారి పెద్దబ్బాయి, చిన్నబ్బాయి మా వారిని అన్నయ్య అని, నన్ను వదినా అని కలిపేసుకున్నారు.
మామయ్య గారి (బాలాంత్రపు రజనీకాంతరావు) పై అభిమానం. వి.ఏ.కే రంగారావు గారి దృష్టిలో ఆమె పాడిన అన్ని పాటలలోకి గొప్పది రజనీ గారు స్వరపరిచిన ‘తన పంతమే తా విడువడు’.
ఆమెకు లలితమైన సంగీతం మాత్రమే యిష్టం. సుబ్బరామన్ సంగీతం ఆమెకు యిష్టం. హాయిగా పాడుకోవచ్చు అంటారు. తన గొంతుకు సరిపోయే పాట, సంగీతం అయితేనే పాడతారు. పాట పాడితే అది పదికాలాలు వుండాలి అంటారు. ‘పాట నాకు నచ్చకపోతే ఎంత పెద్దవాళ్ళైనా లేచి వెళ్లి పోతాను’ అంటారామె. అందుకే సంగీత దర్శకులు ‘బాలమ్మా సరేనా?’అని అడిగి ట్యూన్ చేసేవారట. మీరా భజనలు ఎంత గొప్పగా పాడేవారని. వసంతదేశాయి దగ్గర వాటిని నేర్చుకున్నారు. ‘మీరా భజన్ కర్ణాటక పద్ధతిలో పాడితే బాగుండదు’ అని ఆమె స్ధిర అభిప్రాయం. అందుకే హిందీ మాటలు పలికే పద్ధతిని నేర్చుకుని అదే విధంగా పాడేవారు. హిందీ చిత్ర పరిశ్రమలోకి వెళ్ళ లేకపోవడం ఆమెకు కొంచెం అసంతృప్తి. మనసులో కొంచెం ఆ బాధ మిగిలిపోయింది. హిందీ సినీ సంగీతం గురించి ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఈల వినపడితే ఎవరా అని ఇటు అటు చూస్తే ‘నేనే’ అని చిలిపిగా నవ్వేవారు. ‘అమ్మకి అల్లరి ఎక్కువ’ అని ఆమె పిల్లలు కూడా గారాబం చేసేవారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు ‘వైఎస్‌ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్’ యిస్తే వచ్చేందుకు ఆరోగ్యం సహకరించలేదు. ఆ పురస్కారంతో పొటో దిగి పంపారు.
ఇక మళ్ళీ ఆమెను చూడలేము. కాని పాట వున్నంత వరకూ ఆమె చిరస్థాయిగా వుండి పోతారు.
– ప్రసూన బాలాంత్రపు