‘‘అఖండ 2: తాండవం’ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి భారతదేశం అంతా విడుదల చేయాలని భావించాం. అయితే పాన్ ఇండియా కోసం ప్రత్యేకంగా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది పాన్ ఇండియా కంటెంట్ అయినప్పటికీ సినిమా మాత్రం గ్లోబల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. బాలయ్య, బోయపాటిగారి నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అంతకుమించి ‘అఖండ 2’ ఉంటుంది’’ అని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట తెలిపారు. బాలకృష్ణ, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.
ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణగారితో మేము చేసిన ‘లెజెండ్’ పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వేరే కథ అనుకున్నప్పటికీ ‘అఖండ 2’ని ముందుకు తీసుకెళ్లాం. బాలయ్యగారితో పనిచేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. బోయపాటిగారు అహర్నిశలు కష్టపడి కుంభమేళా సన్నివేశాలని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా క్లైమాక్స్‌ని కాశ్మీర్లో చేయాల్సింది.
ఆ సమయంలో పెహెల్గాం దాడి జరగడంతో షూటింగ్ అనుమతి రాలేదు. ఈ కారణంగా జార్జియాలో మైనస్ డిగ్రీ చలిలో చిత్రీకరించాం. మా సినిమా 2డీ, 3 డీలో ఒకేసారి రిలీజ్ అవుతోంది. మా సినిమాకి ప్రజెంటర్ తేజస్విని ప్రమోషన్‌కి సంబంధించి మంచి సజెషన్స్ ఇచ్చారు. సంయుక్తది హీరోయిన్ క్యారెక్టర్‌లా కాకుండా ఈ కథలో ఒక ముఖ్యమైన పాత్రలానే ఉంటుంది. ‘అఖండ’లో ఉన్న పూర్ణగారి పాత్ర ‘అఖండ 2’లోనూ కంటిన్యూ అవుతుంది.
తమన్‌గారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. ‘అఖండ 3’ చేసే అవకాశం ఉంది. ఆది పినిశెట్టిగారు అద్భుతమైన పెర్ఫార్మర్. ఇందులో ఆయన పాత్ర చాలా చక్కగా వచ్చింది. తన పాత్రకి 200శాతం న్యాయం చేశారాయన. ‘టైసన్ నాయుడు’ సినిమాని ఒకటి రెండు నెలల్లో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులతో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అలాగే ఒక పెద్ద సినిమా చర్చల్లో ఉంది’’ అని చెప్పారు.


