breaking news
Rao Bala Saraswati
-
ఆ దివ్య తోటలోనికి ఆమె తరలి వెళ్లింది
‘ఆ తోటలోనొకటి ఆరాధనాలయము’ అని గానం చేసి తెలుగువారి అపురూప గాయనిగా నిలిచిన రావు బాలసరస్వతి దివిలోని దివ్య పాటల లోగిలికి తరలి వెళ్లారు.‘మల్లెపూలు మొల్లపూలు కల్వపూలు కావాలా’... అని సుమగీతాలనిచ్చిన రావు బాలసరస్వతి వాడని పూలుండే లోకానికి బయలుదేరారు. గాయనిగా సవాళ్లు ఎదుర్కొన్నా గొంతు ఖైదు చేయబడినా నిలిచిన నాలుగు నిక్కమైన నీలాలతోనే నేటికీ మిలమిలలాడిన ఆమె వజ్రాల నదులు పారే అంబరాల బాట పట్టారు. ఆమెకు తెలుగువారి నివాళి. లలిత సంగీత ప్రపంచపు సురాగమయ జోహారు.ఈ వేళ పొద్దున్నే ఫేస్బుక్లో, ఇతర గ్రూపుల్లో రావు బాలసరస్వతి గారి ఫొటో చూడగానే మనసు కీడు శంకించింది. చాలా రోజులు నుంచి ఆమె ఆరోగ్యం బాగా లేదని తెలుసు. అయినా వున్నారనే ఆలోచన తృప్తినిస్తుంది. ఇంక ఈ రోజు తో ఆ ఆశ లేదు. ఆమె తెలుగువారి తొలి నేపథ్యగాయని అవునో కాదో ఆ చర్చ వేరేగాని తొలి ప్రముఖ నేపథ్య గాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సి.ఆర్.సుబ్బరామన్, ఎస్.రాజేశ్వరరావుల సంగీతంలో ఎన్ని గొప్ప పాటలు. ‘దేవదాసు’లో ఆమె పాడిన ‘తానే మారెనా... గుణమ్మే మారెనా’ పాట ఎంతమందికో ఇష్టం. ఆమె పాడిన ’ఆ తోటలో నొకటి ఆరాధనాలయము’ విని ‘అందులో ఆమె అందగాడెవరే అని గొంతెత్తి పాడుతూ వుంటే మనసు ఎటో వెళ్లిపోతుంది’ అన్నారు మహా రచయిత చలం. అంత మధురమైన స్వరం బాలసరస్వతిది. చాలా ఏళ్ల క్రితం గుంటూరులో ప్రోగ్రాం. కారణం ‘అజో విభో అవార్డు’ ఆమెను వరించింది. ఆ సభకు హాలులో జనం పోటెత్తారు. ఎన్ని రోజులు అయింది! ఆమెని చూడాలి. ఆమె పాట వినాలి. అప్పటికే భర్త ఆంక్షలతో ఆంధ్రదేశం ఆమె పాటకి దూరమై దాదాపు అర్ధ శతాబ్దం అయింది. అందుకే అదో అపురూప అవకాశం అని విజయవాడ నుంచి మేమూ వెళ్ళాం. ఎప్పటిలా నేను పాడనని నిర్వాహకులకి చె΄్పారుట. అవార్డు ఇచ్చాక ‘అమ్మా... ఒక ముక్క పాడండి’ అని ప్రేక్షకులు ఒక్క గొంతుతో అడిగితే సరేనని –చలి గాలి వీచింది – తెరవారబోతోందిఇకనైన ఇలు చేరవా – ఓ ప్రియా ఇకనైన ఇలు చేరవా...పాట వింటూ అందరూ చప్పట్లు కొట్టారు. ఆ ఉద్వేగాన్ని మర్చిపోలేను. అందరి కళ్లలో నీళ్ళు! లేచి నిల్చుని చప్పట్లు. మారుమోగిన హాలు. ఆ తర్వాత ఆమెతో చనువు ఏర్పడ్డాక అడిగాను ’ఎందుకలా పాడనంటారు’ అని . ‘చాలా రోజులుగా పాడలేదు గదా... అప్పటి పాటలా రాకపోతే నాకు బాగుండదు’ అన్నారు. ’ఎవరన్నారు మీ పాట అప్పటి పాటలా లేదని.? వయసుతో మరింత అందం వచ్చింది’ అన్నాను. నిజమే! ఆ గొంతులో మధురిమ ఏ మాత్రం తగ్గలేదు. ‘బెజవాడ వచ్చి నాలుగు రోజులు మీ ఇంట్లో వుంటా, నన్ను పాడమని అడగద్దు’ అన్నారొకసారి. అలాగేనని తీసుకుని వచ్చాను. మహీధర రామ్మోహనరావు గారు, నండూరి రామ్మోహనరావు గారు... ఇలా అందరూ వచ్చారు ఆమెను చూడటానికి. ఆమెకీ వారందరంటే అభిమానమే. అందరూ ఇంట్లో కూర్చుని కబుర్లు మొదలు పెట్టాక పాట ఎలా ఆగుతుంది? రామ్మోహనరావు గారి కోరిక పై ‘ఆ తోటలో నొకటి ఆరాధనాలయం’ పాడారు. ‘రెల్లు పూల పానుపు పైన ఎవరో వెన్నెల జల్లినారమ్మా!’ అని ఆమె పాడుతూ ఉంటే నిజంగానే వెన్నెల మా అందరి మనసుల్లో. ఆ స్వరం జల్లుజల్లుగా కురిపించింది. అంత మంది పండితులు, కవులు మధ్య కూర్చునే సరికి ఆ కోయిల అలా నాలుగు గంటలసేపు పాడింది! ఎంత భాగ్యం కదా!అదే మొదలు. ఎప్పుడు రావాలి అని అనిపిస్తే అపుడు విజయవాడ రావడం నాలుగు రోజులు వుండడం. మా ఇంట్లో కుదరని పరిస్థితి వచ్చినప్పుడు హేమ పరిమిగారిని అడిగాను. ఆమె ఎంతో సంతోషించి వారి పొదరింట్లో రెండు మూడుసార్లు ఆతిథ్యం యిచ్చారు. బాలసరస్వతి గారి పాట ఎంత మధురమో మనసు అంత సున్నితం. ఒకసారి స్నేహం చేస్తే మర్చిపోరు. ఆత్మీయతను పదిసార్లు గుర్తు తెచ్చుకుంటారు. మనకి ఆమె చిన్నప్పటి నుంచి తెలిసిన చుట్టం అవుతారు. రాగానే ముందు పాత పరిచయాలు గుర్తుకు తెచ్చుకుని వారిని ఒకసారి కలవాలి అని అనుకుంటారు. ‘అమ్మాయి’ అంటూ స్వంత కూతురులా చూసుకుంటారు. అలా వారి పెద్దబ్బాయి, చిన్నబ్బాయి మా వారిని అన్నయ్య అని, నన్ను వదినా అని కలిపేసుకున్నారు. మామయ్య గారి (బాలాంత్రపు రజనీకాంతరావు) పై అభిమానం. వి.ఏ.కే రంగారావు గారి దృష్టిలో ఆమె పాడిన అన్ని పాటలలోకి గొప్పది రజనీ గారు స్వరపరిచిన ‘తన పంతమే తా విడువడు’. ఆమెకు లలితమైన సంగీతం మాత్రమే యిష్టం. సుబ్బరామన్ సంగీతం ఆమెకు యిష్టం. హాయిగా పాడుకోవచ్చు అంటారు. తన గొంతుకు సరిపోయే పాట, సంగీతం అయితేనే పాడతారు. పాట పాడితే అది పదికాలాలు వుండాలి అంటారు. ‘పాట నాకు నచ్చకపోతే ఎంత పెద్దవాళ్ళైనా లేచి వెళ్లి పోతాను’ అంటారామె. అందుకే సంగీత దర్శకులు ‘బాలమ్మా సరేనా?’అని అడిగి ట్యూన్ చేసేవారట. మీరా భజనలు ఎంత గొప్పగా పాడేవారని. వసంతదేశాయి దగ్గర వాటిని నేర్చుకున్నారు. ‘మీరా భజన్ కర్ణాటక పద్ధతిలో పాడితే బాగుండదు’ అని ఆమె స్ధిర అభిప్రాయం. అందుకే హిందీ మాటలు పలికే పద్ధతిని నేర్చుకుని అదే విధంగా పాడేవారు. హిందీ చిత్ర పరిశ్రమలోకి వెళ్ళ లేకపోవడం ఆమెకు కొంచెం అసంతృప్తి. మనసులో కొంచెం ఆ బాధ మిగిలిపోయింది. హిందీ సినీ సంగీతం గురించి ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఈల వినపడితే ఎవరా అని ఇటు అటు చూస్తే ‘నేనే’ అని చిలిపిగా నవ్వేవారు. ‘అమ్మకి అల్లరి ఎక్కువ’ అని ఆమె పిల్లలు కూడా గారాబం చేసేవారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు ‘వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్’ యిస్తే వచ్చేందుకు ఆరోగ్యం సహకరించలేదు. ఆ పురస్కారంతో పొటో దిగి పంపారు. ఇక మళ్ళీ ఆమెను చూడలేము. కాని పాట వున్నంత వరకూ ఆమె చిరస్థాయిగా వుండి పోతారు.– ప్రసూన బాలాంత్రపు -
నలుగురు ప్రపూర్ణులు!
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఈసారి నలుగురికి కళా ప్రపూర్ణ, క్రీడా ప్రపూర్ణలతో గౌరవించాలని ఆంధ్రి విశ్వవిద్యాలయం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 31న జరగనున్న వర్సిటీ 85వ స్నాతకోత్సవ నిర్వహణపై శుక్రవారం సాయంత్రం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చించారు. కళాప్రపూర్ణకు ముగ్గురి పేర్లు, క్రీడా ప్రపూర్ణకు ఒకరి పేరును సభ్యులు ప్రతిపాదించారు. వీటిని గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు. కళాప్రపూర్ణకు మ్యాజిక్ మాయిస్ట్రో ఇళయరాజా, ప్రఖ్యాత గాయని రావు బాలసరస్వతి, సినీ గేయ రచయిత చంద్రబోస్.. క్రీడా ప్రపూర్ణకు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ల పేర్లను ఖరారుచేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు సాహిత్యంలోనూ ఈసారి కళాప్రపూర్ణ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కన్వెన్షన్ సెంటర్లో నిర్వహణపైఅభ్యంతరాలు కొత్తగా నిర్మంచిన కన్వెన్షన్ సెంటర్లో స్నాతకోత్సవం నిర్వహించాలనే నిర్ణయాన్ని పలువురు సభ్యులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన పాత భవనంలో నిర్వహిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత భవనానికి మరమ్మతులు అవసరమని, వర్షం వస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు వర్సిటీ అధికారులు పాలక మండలి సభ్యులకు సర్దిచెప్పారని తెలిసింది. స్నాతకోత్సవ మందిరం మరమ్మతులు నెల రోజుల్లో పూర్తిచేయించాలని సభ్యులు సూచించారు. ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రవేశాలు, త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పరిశోధన ప్రవేశాల సెట్(ఏపిఆర్‌సెట్)పై చర్చ జరిగింది.. గతంలో తాత్కాలికంగా నిలిపివేసిన ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీలలో అర్హత కలిగిన వారిని కొనసాగించాలని, అర్హత లేకుండా ప్రవేశం పొందిన వారిని తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన జివోను వర్సిటీ ఆమోదించినట్లు సమాచారం. వీటితో పాటు వర్సిటీలో జరిగిన ధర్మపోరాట దీక్షకు ఏయూ మైదానం కేటాయించడం తదనంతర అంశాలపై సైతం పాలక మండలి సభ్యులు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్పష్టత లేని గవర్నర్ పర్యటన స్నాతకోత్సవానికి గవర్నర్ రాక ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 29 నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. గవర్నర్ వచ్చి.. అన్నీ సజావుగా సాగితే సుదీర్ఘ కాలం తర్వాత పూర్తిస్థాయి స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ స్నాతకోత్సవంలో 318 మందికి పీహెచ్‌డీలు, అవార్డులు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, రెక్టార్ ఆచార్య కె.గాయత్రీదేవి, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వర రావు, సభ్యులు ఆచార్య ఎం.ప్రసాద రావు, జి.శశి భూషణ రావు, సురేష్ చిట్టినేని, డాక్టర్ ఎస్.విజయ రవీంద్ర, డాక్టర్ పి.సోమనాధ రావు, ఆచార్య ఎన్.బాబయ్య, ఆచార్య కె.రామమోహన రావు తదితరులు పాల్గొన్నారు. -
సంగీతం... ఎప్పుడూ... చెవులకు ఇంపుగా ఉండాలి!
రావు బాల సరస్వతి... తొలి తరం సినీ నేపథ్య గాయని. పాట అంటే చెవులకు ఇంపుగా ఉండాలంటారామె. గాయకులు ప్రతి ఒక్కరూ తాము పాడే పాటలో సాహిత్యపు విలువలను గమనించుకోవాలని చెప్తున్నారు. విలువలు లోపించిన పాట గానం చేయకూడదనే నిబంధనను పాటించాలంటారు. మీరు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు ? 1928వ సంవత్సరం ఆగస్టు 28న మద్రాసులో పుట్టాను. తొలి పాట... నా ఆరవ యేట. ఏ సినిమాకి ?... సినిమాకి కాదు, ప్రైవేట్ ఆల్బమ్ కోసం ‘పరమ పురుషా పరంధామా...’ అనే పాట పాడాను. గాయని కావడానికి ప్రోత్సహించింది ఎవరు ? మా నాన్నగారు పార్థసారథి రావు. ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం. గుంటూరులో మా థియేటర్లో డ్రామాలు వేయించేవారు. నేను మూడేళ్ల వయసులోనే స్థానం నరసింహరావు లాంటి ప్రముఖుల పాటలు విన్నాను. అలా ఆసక్తి పెరిగింది. అప్పట్లో సంగీత సాధన ఎలా చేసేవారు ? గ్రామఫోన్ రికార్డుల్లో విని అలాగే పాడేదాన్ని. అలా నాకిది స్వతహాగా అబ్బిన కళ. బాంబేలో హిందూస్తానీ సంగీతం నేర్చుకున్నాను. సాటి గాయకుల్లో ఎవరి గొంతు ఇష్టం ? ... సుశీల గొంతు ఇష్టం. మీరు ఏయే భాషల్లో పాడారు? ... మళయాళం, కన్నడం, తమిళం, తెలుగు, సింహళీ భాషల్లో పాడాను. మీరు పాటించిన నియమాలేమైనా ఉన్నాయా? డబ్బు కోసమే అన్నట్లు పాడలేదు. పాట నచ్చితేనే పాడేదాన్ని. సాహిత్యపు విలువల్లో అప్పుడు - ఇప్పుడు తేడా? కొన్ని పాటలనైతే వినలేక పోతున్నాను. అప్పట్లో శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి లాంటి వాళ్లు స్వయంగా రికార్డింగుకు వచ్చే వాళ్లు. ఎవరైనా ఒక పదం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తే వారు ఆ పదాన్ని అక్కడే మార్చేసేవారు. నాటి గాయకులకు - నేటి గాయకులకు మధ్య మీరు గమనించిన తేడా? ఘంటసాలలో తొలిపాట సమయంలో ఉన్న వినయం ఆయన చచ్చిపోయే వరకు అలాగే ఉండింది. ఇప్పుడు కొందరిని చూస్తే వారిలో వినయం సహజం అనిపించకపోగా, వినయాన్ని నటిస్తున్నట్లు ఉంటోంది. బాల గాయకులకు సూచన? ఏం పాడుతున్నామో తెలుసుకుని హాయిగా పాడాలి. కష్టపడుతూ కాదు. గాయకుల తల్లిదండ్రులకు... పిల్లలు బాగా పాడితే మెచ్చుకోండి. అతిగా పొగడకండి. ప్రశంస మితిమీరిన ఆత్మవిశ్వాసానికి కారణం కాకూడదు. మీరు పాడడం ఎందుకు మానేశారు? మా వారు ‘రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు’ అభిప్రాయం మేరకు 1958 నుంచి మానేశాను. పరిశ్రమను చూస్తే ఏమనిపిస్తుంది? బాగా పాడే పిల్లల్ని పాడనివ్వకపోతే వారిలో ఆ కళ అంతరిస్తుంది. సంగీత జ్ఞానం తెలిసిన వారు ఆ పాపం చేయకూడదు. అత్యంత సంతృప్తినిచ్చిన పాట? ... ప్రతిదీ నచ్చిన తర్వాతనే పాడాను. కుటుంబం, పిల్లలు... ఇద్దరు కొడుకులు. రావు వెంకట రాజగోపాల కృష్ణ సూర్యారావు, రావు వెంకట కుమార కృష్ణ మహీపతి సూర్యారావు. రాజా గారి శ్రీమతి అంటే రాణిగారి హోదా ఉండేదా? మా ఎస్టేట్‌లో ఉండేది. ‘రాణీ రావు బాల సరస్వతీదేవి’ అని రాసేవారు. ఒక సినిమాకి కూడా పేరు అలాగే వేస్తే నేను తీయించేశాను. ఎందుకలా? సినిమాలో పాట పాడినందుకు డబ్బు తీసుకుంటున్నప్పుడు అక్కడ నా రాణి హోదా ప్రదర్శించకూడదు. అక్కడ నేను నేపథ్యగాయనిని మాత్రమే. మిమ్మల్ని నొప్పించే విషయం? నాకు మనుమళ్లు, మనుమరాళ్లు, ముని మనుమళ్లు, ముని మనుమరాళ్లు ఉన్నారు. వారికెవరికీ సంగీత జ్ఞానం అబ్బలేదు. మీకు సంతోషం కలిగించే విషయం... నన్నింకా కొంతమంది జ్ఞాపకం ఉంచుకున్నారు. దేవుడు వరమిస్తానంటే... సంగీత కుటుంబంలో పుట్టించమని అడుగుతాను. జగ్జీత్సింగ్ వంటి వారింట్లో పుట్టాలని కోరిక. - వాకా మంజులారెడ్డి