బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ గతేడాది అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆరు పదుల వయస్సులోనూ తనకు గర్ల్‌ఫ్రెండ్ ఉందంటూ బర్త్ డే రోజే పెద్ద షాకిచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ను తన ప్రియురాలిగా ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లిపై నెట్టింట చర్చ నడుస్తోంది. అమిర్ ఖాన్- గౌరీ వివాహ బంధంతో ఒక్కటవుతున్నారా? అనే టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడారు. గౌరీని వెంటనే పెళ్లి చేసుకోవాలనే ప్రణాళిక ఏదీ లేదని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నేను, గౌరీ ఒకరి పట్ల ఒకరం చాలా చాలా నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. మీ అందరికీ తెలుసు.. ప్రస్తుతం మేము భాగస్వాములం.. మేమిద్దరం కలిసే ఉన్నామని వెల్లడించారు. ఇక పెళ్లి విషయానికొస్తే ఆమెను నా మనసుతో ఇప్పటికే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతానికి పెళ్లిని అధికారికంగా చేసుకోకపోయినా.. అలా చేసుకోవాలా? వద్దా? అనేది భవిష్యత్తులో ఇద్దరం నిర్ణయించుకుంటామని అమిర్ ఖాన్ అన్నారు.
కాగా.. ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. గతేడాది పుట్టినరోజు ఆమిర్ తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. తాము ముంబైలో ఒక విలాసవంతమైన కొత్త ఇంటికి మారుతున్నట్లు ఆమిర్ ఇటీవలే తెలిపారు. కాగా.. మొదట ఆమిర్ మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఐరా ఖాన్, కుమారుడు జునైద్ ఖాన్ జన్మించారు. దాదాపు 16 సంవత్సరాల వివాహం తర్వాత 2002లో వారు విడిపోయారు. ఆ తర్వాత అమిర్ 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు సరోగసీ ద్వారా ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. ఆమిర్ కిరణ్ రావుతో 2021లో విడిపోయారు. ఇద్దరితో విడాకులు తీసుకున్నప్పటికీ కుటుంబంలో జరిగే ఈవెంట్లకు అమిర్ ఖాన్ హాజరవుతున్నారు. విడిపోయిన ఇద్దరు భార్యలతో స్నేహపూర్వక రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు.


