
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దురంధర్ మూవీ చేస్తోన్న బాలీవుడ్ స్టార్.. డాన్-3 మూవీ కూడా చేయనున్నారు. ఈ చిత్రంలో మొదటి కియారా అద్వానీని హీరోయిన్‌గా ప్రకటించారు. అయితే అంతలోనే ఏమైందో తెలియదు కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కియారా ప్లేస్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే హీరోయిన్‌ను మార్చేసిన మేకర్స్.. విలన్ విషయంలో అదే జరుగుతోందని టాక్. డాన్-3లో మొదట 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేను అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ రోల్‌కు విక్రాంత్ మాస్సే నో చెప్పినట్లు తెలుస్తోంది. పాత్రలో లోతు లేకపోవడం వల్ల అతను వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విలన్ రోల్‌కు ఊహించని పేరు తెరపైకి వచ్చింది.
ఈ ఏడాది అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో తన విలనిజంతో మెప్పించిన అర్జున్ దాస్‌ను విలన్‌గా ఎంపిక చేయనున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ దాస్ ఇప్పటికే మాస్టర్, గుడ్ బ్యాడ్ అగ్లీ, కైతి లాంటి హిట్ సినిమాలతో తన విలనిజాన్ని చూపించాడు. ప్రస్తుతం అర్జున్ దాస్‌తో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా.. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సన్నివేశాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది.
