చేతిలో మొబైల్ ఉంటే చాలు. ఠక్కున క్లిక్ క్లిక్‌మనిపించడమే. అదొక గ్రేట్ అచీవ్‌మెంట్‌లా ఫీలవ్వడమే. సమయం సందర్భంతో అవసరం లేదు మనకు. అంతలా అడిక్ట్ అయిపోయారు జనాలిప్పుడు. ఎలాంటి సందర్భమైనా సరే అదే ముఖ్యమంటున్నారు. అదేనండి సెల్ఫీ మోజు. ఈ చరవాణి ప్రపంచంలో దానికున్న క్రేజ్ ఇంకా దేనికైనా ఉందా? సందర్భంతో పనిలేకుండా ఎగబడి మరీ సెల్ఫీలు తీసుకుంటారు.
ఇక ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే చాలు.. ఒక్క క్షణం కూడా ఆగలేం కదా. మరి ఈ పిచ్చి ముదిరితే ఎలా ఉంటుంది. అదే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో పీక్స్‌కు చేరింది. వచ్చిన సందర్భం కూడా ఆలోచించకుండా సెల్ఫీలకు ఎగబడ్డారు. ఇదే ఆ స్టార్ హీరో భార్యకు చిరాకు తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. కొచ్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మలయాళ సినీతారలు పాల్గొన్నారు. అదే సమయంలో కొందరు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ కనిపించారు. దీంతో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీనివాసన్ ఫ్యామిలీకి బాధలో ఉంటే మీలాంటి వారి పైత్యం ఏంటని నిలదీసింది. శ్రీనివాసన్ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషాదంలో ఉన్న కుటుంబం బాధ మీకు అర్థం కాదా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించింది.

సుప్రియా మీనన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది వారి కుటుంబానికి భావోద్వేగ క్షణం. ఇలాంటి సమయంలో బాధలో ఉన్నవారిని పరామర్శించడానికి కూడా అక్కడ చోటు లేకపోవడం చాలా విషాదకరం. ప్రతిచోటా మొబైల్ ఫోన్ల కెమెరాలతో లోపలికి వస్తున్న నటులతో సెల్ఫీలకు ఎగబడ్డారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం బాధను ఆ సమయంలో మనం ఊహించలేం. అసలు అంత్యక్రియల జరిగే చోట సెల్ఫీల కోసం గుమిగూడాల్సిన అవసరం ఉందా? బాధలో ఉన్న వారి కుటుంబం ఆ వ్యక్తికి వీడ్కోలు పలికే సందర్భంలో ఇలా చేస్తారా? ఆ ఫ్యామిలీ గోప్యతను గౌరవించరా?..' అంటూ ఆమె నిలదీసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. మలయాళ నటుడు శ్రీనివాసన్(69) కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు.


