
బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఎప్పుడూ వరుస సినిమాలతో, క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉండే ఆయన కూడా సెలవులు తీసుకుంటారట. అది కూడా ఏడాదిలో 125 రోజులట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ‘‘మనందరికీ రోజుకి 24 గంటలుంటాయి. ఏడాదికి 365 రోజులే. అందరిలానే నేను కూడా సెలవులు తీసుకుంటా. అది కూడా దాదాపు 125 రోజులు.
ఏడాదిలో 52 ఆదివారాలు, 40 రోజుల వేసవి విహారయాత్ర, క్రిస్మస్‌కు 12 రోజులు, దీపావళికి 3 రోజులు. ఇవి కాకుండా ప్రతి మూడు నెలలకు కుదిరితే ఓ వారం పాటు విశ్రాంతి తీసుకుంటాను. నేనయినా.. ఇతరులైనా సమయాన్ని సరిగ్గా నిర్వహణ చేసుకోవడమే జీవితమంటే. సంతోషంగా ఉండమని దేవుడు మనల్ని భూమ్మీదకు పంపించారు. ఎందుకంటే ఈ భూమి కూడా స్వర్గానికి ప్రతిరూపం. ఎలాంటి ఒత్తిడి జోలికి పోకుండా సంతోషంగా ఉండాలి’’ అని అక్షయ్ చెప్పారు.