డిసెంబర్‌లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా కేవలం హిందీలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదుర్స్ అనిపిస్తోంది. కేవలం 18 రోజుల్లోనే రూ.872 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. కేవలం నార్త్ ఆడియన్స్‌కే పరిమితమైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వీక్షించాలని సౌత్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. కానీ దురంధర్ డబ్బింగ్ వర్షన్ రిలీజ్‌పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అసలు దురంధర్‌ను సౌత్ భాషల్లో విడుదల చేస్తారా? లేదా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరీ ముఖ్యంగా తెలుగు భాషలోనైనా ఈ మూవీని చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ దురంధర్ తెలుగు వర్షన్ రిలీజవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఓటీటీలో మాత్రమే అన్ని భాషల్లో తీసుకొస్తారా? థియేటర్లలో రిలీజ్ చేస్తారా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
అదే కారణమా?
అయితే తెలుగులో దురంధర్ రిలీజ్ చేయకపోవడానికి ఓ కారణముందని సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 19న ఈ మూవీని తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే తెలుగులో విడుదలపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఎందుకంటే హైదరాబాద్‌లోని తెలుగు ప్రేక్షకులు హిందీలోనే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారని టాక్. అందుకే డబ్బింగ్ వర్షన్‌తో ఈ మూవీ ఒరిజినాలిటీ మిస్సవుతుందని మేకర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఓటీటీలో చూడాల్సిందేనా..?
ఇక సౌత్ భాషల్లో దురంధర్‌ను థియేటర్లలో చూసే అవకాశం కనిపించట్లేదు. కేవలం ఓటీటీ రిలీజ్ అయిన తర్వాతే తెలుగుతో పాటు ఇతర భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దురంధర్ రిలీజై మూడోవారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్‌మస్, సంక్రాంతి సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. అందువల్ల దురంధర్ డబ్బింగ్ వర్షన్ ఇక రిలీజయ్యేలా కనిపించడం లేదు. దీంతో తెలుగులో దురంధర్ వీక్షించాలనుకున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే.


