కొంతమంది హీరోలు పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సాహసాలు చేయడానికైనా రెడీ అవుతుంటారు. రిస్కీ షాట్స్ సైతం డూప్ లేకుండా ట్రై చేస్తుంటారు. స్టంట్స్ విషయంలోనూ వెనకడుగు వేయరు. ప్రేక్షకులను అలరించడానికి ఎంత కష్టమైన భరిస్తారు. అలాంటి హీరోల్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా జీవించే గొప్ప నటుడు ఆయన. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికైనా రెడీ అవుతుంటాడు.
ఓ సినిమాలోని పాట కోసం ఏకంగా 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నాడట. దుర్వాసనతో పాటు నొప్పి కలిగినా..ఒక్కమాట కూడా అనకుండా షూట్ అయ్యేవరకు అలాగే ఉండిపోయాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ చిన్నిప్రకాశ్ చెప్పారు.
‘అంకితభావంతో పనిచేసే అతికొద్ది మంది హీరోల్లో అక్షయ్ ఒకరు. పాత్ర కోసం వందశాతం కష్టపడతాడు. ఆయనతో నేను దాదాపు 50 పాటల వరకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాను. ఎలాంటి కష్టమైన స్టెప్పులు ఇచ్చినా..ట్రై చేసేవాడు. స్టెప్స్ మార్చమని ఎప్పుడూ అడగలేదు. ‘ఖిలాడి’ చిత్రంలో ఓ పాట కోసం అక్షయ్ 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నాడు.
ఆ సీన్‌లో ఆయన చుట్టూ అమ్మాయిలు చేరి కోడిగుడ్లతో కొట్టాలి. ఈ విషయం చెప్పగానే వెంటనే చేసేద్దాం అని చెప్పాడు. అమ్మాయిలంతా కోడిగుడ్లని ఆయనపై విసిరేశారు. నొప్పి కలిగినా ఒక్క మాట కూడా అనలేదు. దుర్వాసన పోవడం కోసం చాలా కష్టపడ్డాడు. ఒక్కరిని కూడా కోపగించుకోలేదు. స్టార్ హీరో అయినప్పటికీ.. చాలా సింపుల్‌గా ఉంటాడు. అక్షయ్‌లా కష్టపడే నటీనటులను నేను ఇప్పటివరకు చూడలేదు’ అని చిన్ని ప్రకాశ్ చెప్పకొచ్చాడు. అబ్బాస్, మస్తాన్ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఖిలాడి’ చిత్రం 1992లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.


