ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి ఆమెకు మగబిడ్డ పుట్టినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ రోజు ఆమె లాఫ్టర్ చెఫ్ షూటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ, సడన్‌గా నొప్పులు రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మరోసారి కొడుకు పుట్టాడు.
2017లో పెళ్లి
కాగా భారతి సింగ్.. యాంకర్, నిర్మాత, రచయిత హార్ష్ లింబాచియాను 2017లో పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమానురాగాలకు గుర్తుగా 2022లో కుమారుడు లక్ష్య జన్మించాడు. ఇతడిని ముద్దుగా గోల అని పిలుచుకుంటారు. గోలతో ఆడుకునేందుకు మరో బుజ్జాయి రాబోతోందన్న విషయాన్ని దంపతులిద్దరూ అక్టోబర్‌లో వెల్లడించారు.
ప్రెగ్నెంట్ అని తెలియక..
స్విట్జర్లాండ్‌లో ట్రిప్‌లో ఉన్న సమయంలో భారతికి తాను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది. అప్పటికి ఆమెకు ఏడు వారాలు. ఈ విషయం గురించి భారతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ప్రెగ్నెంట్ అని తెలియక నచ్చింది తింటూ, తాగుతూ ఎంజాయ్ చేశా.. మందు కూడా తాగాను. ఓసారి అనుకోకుండా ప్రెగ్నెన్సీ కిట్ కనిపించేసరికి ట్రై చేశా.. ఆశ్చర్యంగా అది పాజిటివ్ వచ్చింది.
ఇటీవలే సీమంతం
నా భర్తకు చెప్తే అసలు నమ్మలేదు. ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే గర్భం దాల్చానని నిర్ధారణ అయింది అని చెప్పుకొచ్చింది. ప్రెగ్నెంట్ అని తెలియగానే ఉన్నపళంగా ఇండియా వచ్చేశారు. కానీ బేబీ పుట్టాక మిగిలిన ట్రిప్ కచ్చితంగా పూర్తి చేస్తానంది. నవంబర్‌లో తను బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. వారం రోజుల క్రితమే తన సీమంతం జరిగింది.
కమెడియన్‌గా, యాంకర్‌గా..
భారతీ సింగ్.. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షోలో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. కామెడీ సర్కస్ షోలలోనూ పాల్గొంది. ఇండియాట్ గాట్ టాలెంట్ 5, 7, 8వ సీజన్స్, కామెడీ నైట్స్‌బ చావో, ద ఖాత్ర షో,డ్యాన్స్ దీవానే మూడో సీజన్, సరిగమప లిటిల్ చాంప్స్ 2022, లాఫ్టర్ చెఫ్స్ వంటి పలు షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది.


