బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నటీనటులు అత్యంత విలాసవంతమైన జీవనశైలిని గడుపుతూ ఉంటారని తెలిసిదే.. వారు "రాజులా జీవించడం" అనే పదబంధానికి నిజంగా ప్రాణం పోసుకుంటారు. వారికి సంబంధించిన ఖరీదైన ఆస్తులు తరచుగా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కనీసం ఒక్కసారైనా సరే విమానంలో ప్రయాణించాలనే కోరిక ప్రతి సామాన్యుడిలో ఉంటుంది. కానీ, సినిమా నటీనటులకు సొంతంగానే కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌లు కూడా ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, ప్రభాస్, నయనతార వంటి వారికి లగ్జరీ జెట్‌లు ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వీరందరూ ఒక్కోసారి పబ్లిక్ విమానంలోనే ప్రయాణం చేస్తుంటారు. కానీ, ప్రభాస్ మాత్రం ఎప్పుడు కూడా ప్రైవేట్ జెట్లలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అందుకు సంబంధించి కారణాలు కూడా ఉన్నాయి.
ప్రభాస్ వాణిజ్య విమానాల్లో కాకుండా ప్రైవేట్ జెట్లలో మాత్రమే ప్రయాణించడానికి ఇష్టపడతారని సోషల్‌మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అంశంలో కొందరు తనని తప్పుగా కూడా అనుకుంటూ ఉంటారు. ఇటీవల, ఒక నిర్మాతను ప్రభాస్ తన టీమ్ కోసం USAకి ప్రైవేట్ జెట్ బుక్ చేయమని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అనేక కారణాలు ఊహాగానాలు వచ్చినప్పటికీ, మరికొందరు కొన్ని ప్రధాన అంశాలను తెలిపారు. ప్రభాస్ ఎప్పుడు కూడా ఇతరుల నుంచి ఏదీ ఆశించరు. తన వ్యక్తిగత ప్రయాణాలు ఉంటే అందుకు కావాల్సిన డబ్బు తనే సమకూర్చుకుంటారు. సినిమాకు సంబంధించి ఏదైనా షెడ్యూల్ ఉంటే ఆయా నిర్మాతలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేకానీ నిర్మాతల చేత అవసరం లేని ఖర్చులు పెట్టించరు అనే మంచి పేరు తనకు ఉంది.
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం స్పిరిట్, రాజాసాబ్, సలార్2, కల్కి2 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. అయితే, ఒక్కో చిత్రంలో ఒక్కో గెటప్‌లో ఆయన కనిపించనున్నారు. ఈ కారణం వల్లే తన లుక్‌ను బహిరంగంగా వెల్లడించకూడదని మేకర్స్ సూచిస్తారు. యాదృచ్ఛికంగా పబ్లిక్‌లో ఆయన కనిపిస్తే అతని లుక్‌ను లీక్ చేసి వైరల్ చేస్తారు. గతంలో ఆది పురుష్ విడుదలకు ముందు ప్రభాస్ బహిరంగ ప్రదేశంలో కనిపించగానే కొందరు ఫోటోలు తీసి వైరల్ చేశారు. దీంతో జాతీయ స్థాయి ట్రోలింగ్‌కు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని నివారించడానికి, వాణిజ్య విమానాల్లో ప్రయాణం చేసేందుకు ఆయన ఇష్టపడరని సమాచారం.
వాస్తవంగా ప్రభాస్ జీవనశైలి ఇతర హీరోలకు భిన్నంగా ఉంటుంది. ఉదార స్వభావంతో పలు సందర్భాల్లో భారీగా విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలాంటి విషయంలోనైనా సరే పూర్తిగా రాజీ పడకుండా జీవిస్తారు. స్నేహితులతో కలిసి ప్రైవేట్ జెట్‌లలో ప్రయాణించడానికే ఎక్కువగా ఇష్టపడతారు. సినిమా సెట్స్‌లో అందరికీ భోజనాలు తెప్పించి వారితో కలిసి సంతోషంగా గడిపేందుకు ఆసక్తి చూపుతారు. ఎప్పుడు కూడా ఒక రాజులాగే ఉండాలని తన జీవనశైలిని ఆస్వాదిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన పేరులోనే రాజు ఉంది.. ప్రభాస్ జీవితం కూడా రాజులాగే ఉంటుందని తన సన్నిహితులు కూడా చెబుతుంటారు.


