ప్రపంచ సినీ చరిత్రలో ఓ సంచలనం ‘అవతార్’. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ఇది. 2009లో రిలీజైన ఈ చిత్రం.. అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు వెండితెరపై చూడని విజువల్స్‌ని చూపించి..సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లాడు కామెరూన్. ఈ సినిమాకు కొనసాగింపుగా నాలుగు సీక్వెల్స్ ఉంటాయని అప్పుడే ప్రకటించిన కామెరూన్.. పార్ట్ 2 అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ని 2022లో రిలీజ్ చేశాడు. ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు అవతార్‌కి రెండో సీక్వెల్‌గా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’(Fire And Ash Movie Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
పెద్ద కొడుకు నితాయాం చనిపోయిన తర్వాత జేక్ సల్లీ(శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి(జో సల్డానా) జంట తీవ్రమైన విషాదంలో కూరుకొనిపోతుంది. మిగిలిన పిల్లలు లోక్(బ్రిటన్ డాల్టన్), టూక్(ట్రినిటీ జో-లి బ్లిస్), కిరి (సిగౌర్నీ వీవర్)తో పాటు దత్తపుత్రుడు స్పైడర్(జాక్ ఛాంపియన్)ని కాపాడుకుంటూనే.. కొడుకు చావుకు కారణమైన మానవ సైన్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం అవుతారు.
అదే సమయంలో అవతార్ 2లో చనిపోయిన కల్నల్ క్వారిచ్(స్టీఫెన్ లాంగ్).. నావి తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ జీవం పోసుకొని వస్తాడు. అతనికి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్(ఊనా చాప్లిన్) సహాయం చేసేందుకు ముందుకు వస్తుంది. వరంగ్‌కి జేక్ సల్లీ ప్యామిలీ కొలిచే ఈవా దేవత అంటే నచ్చదు. అదే కోపంతో కల్నల్ క్వారిచ్‌తో చేతులు కలుపుతుంది. మరోవైపు పండోరా గ్రహాన్ని నాశనం చేయాలనుకున్న ఆర్డీఏ బృందం కూడా వీరికి తోడుగా నిలుస్తుంది. బలమైన ఈ ముగ్గురు శత్రువుల నుంచి జేక్ సల్లీ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అనేదే అవతార్ 3(Avatar 3 Review) కథ.
ఎలా ఉందంటే..
‘అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను చూపించిన జేమ్స్ కామెరూన్.. పార్ట్ 2 సముద్ర గర్భంలోని సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. అయితే అవతార్ 2 సమయంలోనే కథ-కథనంపై విమర్శలు వచ్చాయి. కానీ విజువల్స్ అద్భుతంగా ఉండడంతో సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మూడో భాగంగా వచ్చిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’లోనూ కథ- కథనమే మైనస్ అయింది. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ కథ-కథనంలో మాత్రం కొత్తదనం లేదు. విజువల్స్ చూడడానికి బాగున్నా.. వావ్ ఫ్యాక్టర్ మాత్రం మిస్ అయింది.
అవతార్, అవతార్ 2లో చూసిన సన్నివేశాలే.. పార్ట్ 3లోనూ కనిపిస్తాయి. అగ్నితెగ ఒక్కటి ఇందులో యాడ్ చేశారు. అంతకు మించి పార్ట్ 2కి, పార్ట్ 3కి పెద్ద తేడా లేదు. పైగా నిడివి చాలా ఎక్కువగా (దాదాపు 3 గంటల 17 నిమిషాలు) ఉండడంతో .. చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ ప్రేక్షుకుడి సహనానికి పరీక్షలా మారుతుంది. చూసిన సన్నివేశలే మళ్లీ మళ్లీ రావడం.. కథ అక్కడక్కడే తిరగడంతో ‘విరామం’ పడితే బాగుండేది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఉన్నంతలో సెకండాఫ్‌లో కథ కాస్త పరుగులు పెడుతుంది. వరంగ్, కిరి మధ్య వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. అలాగే స్పైడర్ పాత్ర నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లు హృదయాలను హత్తుకుంటాయి. బంధీ అయిన జేక్ సల్లీని విడిపించేందుకు నేతిరి రావడం..ఈ క్రమంలో వచ్చే పోరాట ఘట్టాలు బాగుంటాయి. క్లైమాక్స్ విజువల్స్ పరంగా బాగున్నా.. అవతార్ 2లోని క్లైమాక్స్‌ని గుర్తు చేస్తుంది. మొత్తంగా జేమ్స్ కామెరూన్ మార్క్ ఎమోషన్, స్క్రీన్‌ప్లే ఈ చిత్రంలో మిస్ అయింది. వీఎఫెక్స్ పనితీరు మాత్రం ఇంతకు ముందు వచ్చిన రెండు పార్టుల కంటే బాగుంటుంది. కథ పరంగా చూస్తే.. అవతార్ 3 రొటీన్ చిత్రమే కానీ.. సాంకేతికంగా మాత్రం అవతార్ 3 ఓ అద్భుతమే. విజువల్ గ్రాండియర్ కోసమే అయినా ఈ సినిమాను తెరపై ఒక్కసారి చూడొచ్చు.
ఎవరెలా చేశారంటే..
జేక్ సెల్లీ పాత్రకు సామ్ వర్తింగ్టన్ పూర్తి న్యాయం చేశాడు. ఓ తెగ నాయకుడిగా, పిల్లలకు మంచి తండ్రిగా చక్కని నటన కనబరిచాడు. యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేతిరి పాత్రలో జో సల్డానా ఒదిగిపోయింది. పార్ట్ 2తో పోలిస్తే..ఇందులోనే ఆమెకు ఎక్కువ యాక్షన్ సీన్స్ పడ్డాయి. ఇక ఈ సినిమాకు కొత్తతనం తెచ్చిన పాత్ర వరంగ్. ఆ పాత్రలో ఊనా చాప్లిన్ జీవించేసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో ఆమె నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సిగర్నీ వీవర్, బ్రిటన్ డాల్టన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. , రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. సైమన్ ఫ్రాంగ్లెన్ నేపథ్య సంగీతం ఓకే. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. కొన్ని సన్నివేశాలను తొలగించినా.. అసలు కథకు ఇబ్బందేమి లేదు. అలాంటి సీన్లను తొలగించి నిడివి తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


