కొన్ని సినిమాలు సౌండ్ చేయకుండా వస్తాయి. థియేటర్లలో నెవ్వర్ బిఫోర్ అనేలా రీసౌండ్ చేస్తాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రకంపనలు ఆ రేంజులో ఉంటాయి. సెలబ్రిటీల నుంచి అవసరం లేని విమర్శలూ వినిపిస్తాయి. చాలామందికి నిద్రలేని రాత్రులే మిగులుతాయి. అవును ఇదంతా చెబుతున్నది 'ధురంధర్' కోసమే. ఇంతకీ ఈ సినిమా గురించి బాలీవుడ్‌లో ఏం మాట్లాడుకుంటున్నారు?
'ధురంధర్'.. పదిహేను రోజుల క్రితం రిలీజైన హిందీ సినిమా. థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో మూవీ ఉందని కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే రెగ్యులర్ బాలీవుడ్ స్టార్స్ చేసే పీఆర్ షో దీనికి చేయలేదు. కట్ చేస్తే రిలీజైన రెండు వారాల్లో సీన్ మారిపోయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. అదే టైంలో హిందీ చిత్రసీమలో ప్రకంపనలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలోనూ మంచి రెస్పాన్స్, వసూళ్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా చూసి చాలామంది బాలీవుడ్ స్టార్స్ తట్టుకోలేకపోయారు. హీరో హృతిక్ రోషన్ మాట్లాడుతూ సినిమా అంతా బాగానే ఉంది గానీ పాలిటిక్స్ చూపించకపోయింటే బాగుండేదని అన్నాడు. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయి, జనాలకు ఇది నచ్చేస్తే ఇతడు హీరోగా ఉన్న స్పై యూనివర్స్‌ని ఇక జనాలు చూడరేమో అని భయం కావొచ్చు?
హీరోయిన్ రాధిక ఆప్టే.. ఈ మూవీలో వయలెన్స్ దారుణంగా ఉందని చెప్పింది. ఇలాంటి చిత్రాలు తన పిల్లలకు ఎలా చూపించాలి అన్నట్లు మాట్లాడింది. మరి ఈమె గతంలో పలు చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లోనూ నటించింది. మరి వాటి సంగతేంటని నెటిజన్లు ఈమెని విమర్శిస్తున్నారు. పలువురు పేరు మోసిన హిందీ రివ్యూయర్లు కూడా ఇదేం మూవీ అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు.
ఇన్నాళ్లు హిందీ సినిమాల్లో పాకిస్థాన్‌ని చాలా పవర్‌ఫుల్‌గా, భాయ్ భాయ్ దోస్తానా అన్నట్లు చూపించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ తీసిన స్పై యూనివర్స్‌లోని 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'పఠాన్', 'వార్', 'వార్ 2' సినిమాల్లో పాకిస్థాన్‌ని ఒకలా ప్రెజెంట్ చేశారు. ఉగ్రవాదులని ఒకలా చూపించారు. కానీ 'ధురంధర్' చూసిన తర్వాత జనాలకు కొన్ని విషయాలు క్లియర్‌గా అర్థమయ్యాయని చెప్పొచ్చు. దీని దెబ్బకు ఇకపై యష్ రాజ్ స్పై యూనివర్స్‌ని జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే రాబోయే రోజుల్లో 'ధురంధర్' ఆ రేంజ్ ఎఫెక్ట్ చూపించబోతుంది.

బాలీవుడ్‌లో గతంలోనూ నెపోటిజం ఉన్నప్పటికీ.. గత కొన్నేళ్లలో మాత్రం అది పీక్స్‌కి చేరింది. సదరు స్టార్ హీరో లేదా హీరోయిన్స్ ఉన్న సినిమాలు ఏ మేరకు ఆడుతున్నాయనేది అందరికీ తెలుసు. అయినా సరే వీళ్లు మాత్రమే స్టార్స్ అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 'ధురంధర్' సినిమాతో వాటికి చెక్ పడటం గ్యారంటీలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్‌తో పాటు చాలామంది చిన్న పెద్ద యాక్టర్స్ మెరిశారు. ఇందులో యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బాలీవుడ్ స్టార్స్ చేస్తున్నది కూడా యాక్టింగేనా అనిపించక మానదు.
'ధురంధర్' సినిమాలో ఒక్కసారి కూడా మతం గురించి ప్రస్తావించలేదు. సామాన్య ప్రజలను రాక్షసులుగా చూపించలేదు. కేవలం దాయాది దేశంలోని ఓ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది అని మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. అలా అని దర్శకుడు ఆదిత్య ధర్ ఏదో పెద్ద పెద్ద మెసేజులు ఇవ్వలేదు. ఇది పరిస్థితి అని చూపించాడు. అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత అన్నట్లు వదిలేశాడు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా 'ధురంధర్'ని ప్రశంసిస్తూ చాలా పెద్ద ట్వీట్ చేశాడు. ప్రస్తుత దర్శకులు ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని అన్నాడు. కొన్నాళ్ల ముందు కూడా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్‌లో 'కబీర్ సింగ్' తీసినప్పుడు ఇలానే చాలామంది చాలా విమర్శలు చేశారు. 'యానిమల్' రిలీజ్ టైంలోనూ ఇదే రిపీటైంది. కానీ వాళ్లందరికీ సందీప్.. తన సినిమాతో సమాధానమిచ్చాడు. ఇప్పుడు కూడా ఆదిత్య అలాంటి పంచ్ ఇచ్చాడు. బాలీవుడ్ పునాదులు కదిలించే ప్రయత్నం చేశాడు. చెప్పాలంటే బాలీవుడ్‌కి ఇదో ప్రమాద హెచ్చరిక లాంటిది!


