రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ నటించిన తాజా చిత్రం ‘ఓహ్!’. జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్ పతాకంపై సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా కృష్ణ, రాజు, కావ్య, దృశ్య నలుగురు ఫ్రెండ్స్ మధ్య కథ సాగుతుంది. కృష్ణ (రఘురామ్)కి క్రోమోఫోబియో అనే వింత వ్యాధి ఉంది. దాని వల్ల దృశ్య(నైనా) అనే అమ్మాయితో ఉన్న సంబంధం గుర్తించుకోలేకపోతాడు. అంతేకాదు కొత్తగా కావ్య(శృతి శెట్టి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒకవైపు జ్ఞాపకాలు లేని గతం, మరోవైపు ప్రాణప్రదమైన ప్రస్తుత ప్రేమ - ఈ రెండింటి మధ్య కృష్ణ పడే సంఘర్షణే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. మన భారతీయ గ్రంథాలలోని అంశాలను ఉపయోగించి అతను ఈ సమస్యను ఎలా అధిగమించాడు అనేది సినిమాలో ఆసక్తికరమైన అంశం.
ఎలా ఉందంటే..
ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. పురాతన శాస్త్రాలకు, ఆధునిక ప్రేమకు మధ్య ఒక అద్భుత ప్రయాణంలా ఈ సినిమా కథనం సాగుతుంది. చక్కటి ప్రేమకథతో పాటు భారతీయ గ్రంథాలలోని గొప్పతనాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. క్రోమోఫోబియా వంటి కొత్త పాయింట్ కూడా టచ్ చేశారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం.. పొంతనలేని సన్నివేశాలు వచ్చి వెల్లడంతో ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినట్లుగా అనిపిస్తుంది. పైగా అసలు కథ ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ద్వితియార్థంలోనే మెయిన్ స్టోరీ ఉంటుంది. ప్రేమ, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తూ సన్నివేశాలను రాసుకున్నాడు.మనదేశ సంస్కృతిని చిత్రంలో గొప్పగా చూపించారు. సైన్స్‌ను - మన ప్రాచీన విజ్ఞానాన్ని మేళవించి కథను నడిపించిన తీరు బాగుంది. కథ బ్యాక్ గ్రౌండ్ మనాలిలో జరగడం సినిమాకు మారింతా అందాన్ని తెచ్చింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు, నదులు, దట్టమైన అడవుల దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే..
కృష్ణ పాత్రలో రఘు రామ్ బాగా నటించాడు. గందరగోళానికి గురయ్యే యువకుడిగా, ప్రేమికుడిగా తన నటనతో మెప్పించాడు.శృతి శెట్టి & నైనా పాఠక్ ఇద్దరూ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ముఖ్యంగా సెంటిమెంట్, రొమాంటిక్ సన్నివేశాల్లో వీరి నటన ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నవనీత్ చారి అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తాజ్ మహల్ నేపథ్యంలో వచ్చే సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


