పెళ్లి చేసుకునే వయసొచ్చినా సరే అమ్మానాన్నను వదిలేసి ఉండాలంటేనే ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. కానీ సంజనా మాత్రం గుండె రాయి చేసుకుని పిల్లాడిని, చంటిబిడ్డను వదిలేసి వచ్చింది. తన గుండె ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీరాల్సిందే! ఏ రోజు కూడా పిల్లల పేర్లు ఎత్తి సింపతీ కోసం ప్రయత్నించలేదు. ఈ విషయంలో ఆమెను కచ్చితంగా ప్రశంసించాల్సిందే! నేడు ఆమె జర్నీ వీడియో చూపించనున్నాడు బిగ్‌బాస్.
అరగంటలో వస్తానని..
ఈ మేరకు ఓ ప్రోమో వదిలాడు. అందులో సంజనా.. తన కొడుకు ఫోటో చూసి ఏడ్చేసింది. మమ్మీ ఇంట్లో లేనందుకు సారీ.. అరగంటలో వస్తానని చెప్పి 100 రోజులైనా ఇంటికి రాలేదు.. సారీ అని కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్‌బాస్ మాట్లాడుతూ.. టాప్ గేర్‌లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన ప్రయాణంలో.. మీలో ఉన్నంత డ్రామా ఉంది. సీజన్ 9 మొదటి కెప్టెన్‌గా గెలిచి ప్రారంభం నుంచే ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు.
తనకంటూ ఓ మార్క్
ఇంట్లో ఏది జరిగినా అది మీవల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు (ఇమ్మాన్యుయేల్)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? టాస్కుల్లో మీరు పోటీపడినా.. సంచాలకులుగా ఉన్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు.
మొండిధైర్యం
ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని చూసి ఏదో ఒకరోజు మీ బాబు ఎంతో గర్వపడతాడు అని చెప్పాడు. సీజన్‌పై ఆసక్తి క్రియేట్ చేసిందే సంజనా మరి! తనకు ఆ మాత్రం ఎలివేషన్ ఇవ్వాల్సిందే!


