డిమాన్ పవన్‌ను అగ్నిపరీక్షలో చూసినవారంతా ఇతడు బిగ్‌బాస్‌కు సెలక్ట్ కాకపోయినా ఏం పర్లేదనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్‌లో అడుగుపెట్టాడు. అసలు ఇతడేం చేస్తాడనుకునేవారికి తన కండబలం, బుద్ధిబలం కలగలిపిన వీరుడినని నిరూపించాడు. వరుసగా రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. అయితే రీతూతో లవ్ ట్రాక్ వల్ల కాస్త నెగెటివ్ అయ్యాడు.
ఓటింగ్‌లో దుమ్ము రేపుతున్న పవన్
ఎప్పుడూ గొడవపడటం, కలిసిపోవడం.. ఇదంతా చూసేవారికి చాలా చిరాకు పుట్టించింది. కానీ రీతూ ఎలిమినేట్ అయిన వెంటనే తనలో మరో యాంగిల్ చూపించాడు. పంచ్‌లు వేస్తూ కామెడీ చేస్తున్నాడు. టాస్కుల్లో బాహుబలిలా ఆడుతున్నాడు. ఫైనల్‌లో నాలుగో స్థానంలో ఉంటాడనుకున్న పవన్ ఇప్పుడేకంగా ఓటింగ్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ ఫైర్ ముందు నుంచి ఉండుంటే ఏకంగా విన్నర్ అయ్యేవాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బిగ్‌బాస్ అతడి గురించి ఏమన్నాడో చూద్దాం..
నిజమైన యోధుడివి
"మీ విల్‌పవర్, ఫిట్‌నెస్.. మీ వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమో.. అలాగే ఒక బలమైన పోరాటానికి ఎంత అవసరమనేది మీ ప్రయాణామే నిరూపిస్తోంది. ఎవరితో తలపడ్డా, ఏ పోటీలో నిలబడ్డా.. గెలుపు గురించి మాత్రమే తపించే తత్వం ఒక నిజమైన యోధుడి గుణం. కామనర్‌గా అడుగుపెట్టిన ఈ పవన్ అమాయకమైన చిరునవ్వు వెనక ఉన్న డిమాన్ చేసే విధ్వంసం ఏంటో వాళ్లు దగ్గరుండి చూశారు. నామినేషన్‌లో మీపై ఎంతమంది మాటలతో దాడి చేసినా మీరు మౌనంగానే నిల్చున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు.
చెమటోడ్చి గెలిచారు
ఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకున్నవాడు తన జీవితాన్ని అదుపులో పెట్టుకోగలడని మీకు తెలుసు. పవన్ మీరెవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం. మాటల కన్నా చేతలు బలమైనవని నమ్మిన మీరు మీ చేతుల్లోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయం వైపు నడవడానికే ఉపయోగించి సఫలమయ్యారు. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. ప్రతి ఒక్కటి మీరు మీ చెమటోడ్చి చివరి వరకు పోరాడి గెలిచినదే!
మనసు మాత్రం..
మీకోసం ఎవరూ నిలబడకపోయినా మీకోసం మీరు వన్ మ్యాన్ ఆర్మీలా నిలబడ్డారు. అయితే మీ మనసు మాత్రం మీకోసం తపించే మరొకరి (రీతూ) వెంట చక్కర్లు కొట్టింది. ఈ ఇంట్లో మీ గెలుపును పంచుకోవడానికి, ఓటమి నుంచి బయటకు రావడానికి ఆ బంధం తోడ్పడింది. మీలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకే గాక, మీక్కూడా పరిచయం చేసింది. కానీ, టాస్కుల్లో అయినా, తన మనుషుల్ని ప్రేమించడంలో అయినా పవన్ తీరు ఒక్కటే అనే మాట మీ ప్రయాణాన్ని బరువుగా మార్చింది. మిమ్మల్ని అమాంతం మోకాళ్లపై కూర్చోబెట్టింది.
పట్టువదలని పవన్
ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు మీ మనసు ఎంత నొచ్చుకుందో నాక్కూడా తెలుసు. కానీ, తన కోరిక కూడా మీ గెలుపే అనే విషయం మీలోని యోధుడిని తట్టిలేపింది. కర్తవ్యం వైపు నడిపించింది. సంచాలకుల తప్పు వల్ల కెప్టెన్సీ కోల్పోయినా రెట్టింపు ఉత్సాహంతో దాన్ని తిరిగి సంపాదించిన పట్టువదలని పవన్ సత్తాను మరోసారి అందరికీ గుర్తు చేశారు.
పోతారు.. మొత్తం పోతారు
స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ కామనర్‌గా మదలై టఫెస్ట్ కాంపిటీటర్‌గా తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోదుడిగా టాప్ 5లో ఒకరిగా నిలిచారు" అని చెప్పాడు. అయితే మీ మనసంతా రీతూనే అని చెప్తుంటే పవన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. జర్నీ వీడియో అంతా కూడా రీతూతో కలిసున్న క్షణాలే ఉన్నాయి. తను ఎదుర్కొన్న అవమానాలు, ఆడిన ఆటలు, అమ్మ వచ్చిన జ్ఞాపకాలను చూసి ఎమోషనలయ్యాడు. చివర్లో 'పోతారు.. మొత్తం పోతారు' అనే నాని డైలాగ్‌తో పవన్ రేంజ్ పెంచేశాడు బిగ్‌బాస్.
చదవండి: సీజన్ అంతా మీ చుట్టూనే.. తనూజపై బిగ్‌బాస్ ప్రశంసలు


