
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ప్రతి రంగంలోనూ ఏఐని వాడేస్తున్నారు. అయితే కొంతమంది ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ఫేక్ వీడియో, ఫోటోలను సృష్టించి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినీ తారల విషయంలో ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ.. అవే నిజం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు సంబంధించి ఓ ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన వాల్మీకి మహార్షి పాత్రలో నటిస్తూన్నారంటూ.. ఐఏ సహాయంతో ఓ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ట్రైలర్‌గా రిలీజ్ చేశారు. దీంతో చాలా మంది ఇది నిజమనే నమ్మారు. ఈ వీడియో వైరల్ కావడంతో... చివరకు అక్షయ్ కుమారే స్పదించాల్సి వచ్చింది. ఆ ట్రైలర్ ఫేక్ అని.. ఎవరూ నమ్మొద్దు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
‘నేను మహర్షి వాల్మీకి పాత్రలో ఓ సినిమా చేస్తున్నానంటూ ఏఐతో చేసిన ఫేక్ వీడియో ఒకటి వైరల్ చేశారు. అలాంటి వాటిని నమ్మకండి. దారుణమైన విషయం ఏంటంటే.. కొన్ని వార్తా ఛానల్స్ కూడా ఆ వీడియోలు నిజం అనుకొని ఆ ప్రాజెక్ట్ గురించి వార్తలు రాసేశారు. కనీసం రాసేముందు అవి నిజమా, మార్ఫింగ్ చేసినవా అని చూసుకోలేదు.
ప్రస్తుతం ఏఐ వీడియోలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. నిజమైన వాటికంటే అవే ఎక్కువ వేగంగా వైరల్ అవుతున్నాయి. దీన్ని అందరూ గమనించాలని అభ్యర్థిస్తున్నాను. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాన్ని పరిశీలించాలని కోరుతున్నా. వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు అందించాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నా’అని అక్షయ్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.