అరియానా గ్లోరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆర్జీవీని ఇంటర్వ్యూలో చేసి బోల్డ్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా, ఆ క్రేజ్‌తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఎంపికైంది. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొని..తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చన తర్వాత పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బీజీ అయిపోయింది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌తో పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
అందుకే పేరు మార్చుకున్నా
నా అసలు పేరు అరియానా(Ariyana Glory) కాదు. మా అమ్మనాన్నలు నాకు అర్చన అని పేరు పెట్టారు. అయితే కష్టాలు ఎక్కువ అవ్వడంతో నేనే పేరు మార్చుకున్నా. అరియానా పేరుతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను.
అనుకోకుండా అవకాశం..
మన జీవితంలో ఏం జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నేను అనుకోకుండా యాంకర్ అయ్యాను. ఒక రోజు నేను, మా చెల్లి టీవీ చూస్తుంటే.. యాంకర్స్ కావలెనన్న ప్రకటన వచ్చింది. అది చూసి నేను ఆడిషన్స్‌కి వెళ్లాను. అదృష్టం కొద్ది సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి చిన్న చిన్న అవకాశాలతో ఈ స్థాయికి చేరుకున్నాను.
ఒకేసారి ఐదారు జాబులు చేశా
డబ్బుల కోసం నేను రకరకాల జాబులు చేశా. లైన్‌లో నిలబడి పన్నీరు చల్లేందుకు కూడా వెళ్లాను. అప్పుడు నాకొచ్చే జీతం రూ. 1800 మాత్రమే. రూమ్ రెంట్ రూ. 3000. ఒకసారి అద్దె కట్టేందుకు డబ్బులు జమ చేయగా.. ఓ అమ్మాయి దొంగతనం చేసింది. దీంతో చాలా ఇబ్బంది పడ్డా. డబ్బులు సరిపోకపోవడంతో ఒకేసారి ఐదారు జాబులు చేశా. ఇప్పుడు నేను బెటర్ పొషిషన్‌లో ఉన్నాను.
ఈ క్షణమైనా చనిపోవడానికి రెడీ
ఇక నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘మా అమ్మ నన్ను క్రిస్టియన్‌లా పెంచింది. కానీ ఈ మధ్య నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం పెరిగింది. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే.. నన్ను తీసుకెళ్లిపో అని చెబుతా. దేవుడే వచ్చి అడిగాక ఇంకేముంది?. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికిప్పుడు చనిపోయినా నాకు ఓకే’ అని అరియానా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది.


