'ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు' ఈ సామెత శివాజీకి సరిగ్గా సెట్టవుతుంది. పురుషాహంకారంతో విర్రవీగే శివాజీ బిగ్‌బాస్ హౌస్‌లోనూ లేడీ కంటెస్టెంట్లపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా.. అంటూ దారుణంగా మాట్లాడాడు. ఇప్పుడు దండోరా ఈవెంట్‌లోనూ హీరోయిన్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెబుతూ రాయడానికి వీల్లేని బూతు పదాలు ఉపయోగించాడు.
ఎండగట్టిన అనసూయ
ఆయన వైఖరిని ఎంతోమంది హీరోయిన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. యాంకర్ అనసూయ అయితే.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో మా ఇష్టం.. మీరెవరు చెప్పడానికి అని తిరిగి ప్రశ్నించింది. అసలే మదమెక్కిన ఏనుగులా ప్రవర్తిస్తున్న శివాజీ అందరినీ వదిలేసి అనసూయను మాత్రం టార్గెట్ చేశాడు. కొందరు ఈ విషయంలో శివాజీకి వకాల్తా పుచ్చుకుని అనసూయపై మండిపడుతున్నారు.
ట్రోలర్స్‌పై ఫైర్
అలాంటివారికోసం తాజాగా అనసూయ ఓ పోస్ట్ పెట్టింది. కొందరు పనిగట్టుకుని నా మాటలను కావాలనే వక్రీకరించి, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వెస్ట్రన్ దుస్తులు వేసుకోమని సూచించలేదు. నేను వేసుకునేలాంటి దుస్తులే ధరించాలని చెప్పలేదు. నా ఇష్టాయిష్టాలను ఎవరిపైనా రుద్దలేదు. నేను చెప్పిందల్లా ఒక్కటే.. ప్రతి మహిళకు తనకు నచ్చిన డ్రెస్‌లు వేసుకునే స్వేచ్ఛ ఉందన్నాను. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటాను.

నా భర్తను ఎందుకు లాగుతున్నారు?
నా మాటల్ని వక్రీకరించి నాపై విషప్రచారం చేస్తున్నారు. నా భర్తను, పిల్లల్ని ఇందులోకి లాగుతున్నారు. మగవాళ్లే కాదు, కొందరు ఆడవాళ్లు కూడా ఒక మహిళగా, తల్లిగా నా క్యారెక్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. కేవలం నేను వేసుకునే బట్టల్ని బట్టి నన్ను తప్పుపడుతున్నారు. మీరెంత విమర్శించినా నేను మరింత బలంగా నిలబడతాను. ఇప్పటికైనా మేల్కొనండి.. ఇకనైనా మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి.
హేటర్స్.. మీరు కూడా నా ఫ్యాన్సే!
ఎవరి చేతిలోనో కీలుబొమ్మగా మారకుండా సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి. మీ మైండ్‌లోకి ఎలాంటివి ఎక్కిస్తున్నారో చెక్ చేసుకోండి. ఇది కేవలం బట్టలకు సంబంధించిన విషయం కాదు. స్వతంత్రంగా ఆలోచించే మహిళలను కంట్రోల్ చేయాలనుకుంటున్న పితృస్వామ్య భావజాలం గురించి! చివరగా.. నేను నచ్చకపోయినా నిరంతరం నన్ను గమనిస్తూ ఉన్నారంటే మీరు నా అభిమానుల కిందే లెక్క అని ట్రోలర్స్‌కు చురకలంటించింది.
చదవండి: కూలీ మూవీపై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: దర్శకుడు


