ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు క్రేజెక్కువ. అలాంటి ఓ థ్రిల్లర్ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకుందాం. హాలీవుడ్ స్టార్ లినార్డో డికాప్రియో ప్రధాన పాత్ర పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ షట్టర్ ఐల్యాండ్. మార్టిన్ స్కోర్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు,మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులో ఉంది.. ఆ సినిమా రివ్యూ చూసేద్దాం..
కథ
షట్టర్ ఐలాండ్ ద్వీపంలో ఓ పిచ్చి ఆసుపత్రి ఉంటుంది. క్రూరమైన హింసలు చేసిన ఖైదీలకు ఆ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుంటారు. అక్కడ ఓ ఖైదీ/రోగి తప్పించుకుందన్న విషయం తెలిసి హీరో టెడ్డీ ఒక మార్షల్‌గా (పోలీస్‌గా) తన పార్ట్‌నర్‌తో కలిసి ఆ హాస్పిటల్‌కు వెళ్తాడు. ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు విచారణ మొదలు పెడతారు. అయితే అక్కడ అందరి ప్రవర్తన కాస్త వింతగా ఉంటుంది.
హీరో కేవలం ఖైదీని కనిపెట్టడం కోసమే రాడు.. ఆస్పత్రిలో కొన్ని అసాధారణమైనవి జరుగుతున్నాయని అతడి అనుమానం. మానసికంగా జబ్బుపడినవారి మెదడుపై అక్కడ ప్రయోగాలను చేస్తున్నారని దాన్ని ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటాడు. తుపానును సైతం లెక్క చేయకుండా విచారణ కొనసాగిస్తాడు. ఈ క్రమంలో తన పార్ట్‌నర్‌ను కోల్పోతాడు. అక్కడి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అసలు ఆస్పత్రిలో ఏం జరుగుతోంది? ఆ మిస్టరీని హీరో చేధించాడా? లేదా? అతడి సహచరుడు ఏమయ్యాడు? అన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే?
సినిమా ప్రారంభంలో మనం కూడా మిస్టరీ కోసం కళ్లు పెద్దవి చేసుకుని చూస్తాం. కానీ మూవీ ఎంత ముందుకు కదిలినా ఒక్క మిస్టరీ కూడా బయటపడదు. మరోవైపు హీరో అనారోగ్యానికి గురవుతుంటాడు. అతడి గతం తాలూకు ఊహలు, పీడకలలు ఆయన్ని వెంబడిస్తుంటాయి. దీనికి తోడు మైగ్రేన్.. ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగేందుకు వైద్యుడు టెడ్డీకి మందులిస్తాడు.
ఈ మందులవల్ల తనను మానసిక రోగిని చేస్తున్నారేమోనన్న భయంతో హీరో వాటిని వేసుకునేందుకు నిరాకరిస్తాడు. ఇదంతా బాగానే ఉంటుంది.. కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్‌లో రివీల్ చేస్తారు. అప్పుడు హీరోలాగే మనక్కూడా ఏది నిజం? ఏది అబద్ధం? అని కొంతసేపు అయోమయానికి గురవుతాం. చివరకు హీరో పరిస్థితి చూసి జాలిపడకుండా ఉండలేం.
క్లైమాక్స్ కాస్త నిరుత్సాహానికి గురిచేసినా సినిమా మాత్రం ఆసక్తికరంగా కొనసాగుతుంది. హీరో యాక్టింగ్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వర్కవుట్ అయింది. వీలున్నప్పుడు కచ్చితంగా ఓసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.


