యంగ్ హీరోలను సైతం అబ్బురపరిచేలా వరుస విజయాలు అందుకున్నాడు సీనియర్ హీరో మోహన్‌లాల్. ఒకటా రెండా.. ఈ ఏడాది ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ హిట్లే! కానీ చివరగా ఓ డిజాస్టర్ సినిమాతో 2025కి ముగింపు పలుకుతున్నాడు. అదే విషాదకరం! మరో విషయమేంటంటే.. డిసెంబర్‌లో రిలీజైన సినిమాలు ఆయనకు అస్సలు అచ్చిరావడం లేదు! అదెలాగో ఓసారి చూసేద్దాం...
అన్నీ హిట్లే..
తెలుగులో హీరోలు ఏడాదికో, రెండేళ్లకోసారో సినిమా చేస్తారు. కానీ, మలయాళంలో అలా కాదు.. వాళ్లు ఏడాదికి నాలుగైదు సినిమాలైనా ఫటాఫట్ షూట్ చేస్తుంటారు, ఆ వెంటనే రిలీజ్ చేస్తారు. అలా 2025లో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎల్ 2: ఎంపురాన్, తుడరుమ్, హృదయపూర్వం.. బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి హిట్లుగా నిలిచాయి. కానీ రూ.70 కోట్లు పెట్టి తీసిన వృషభ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా చతికిలపడింది. మొదటిరోజు కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది.
లుక్‌పై విమర్శలు
అదేంటో కానీ డిసెంబర్ నెల మోహన్‌లాల్‌కు ఇటీవలి కాలంలో పెద్దగా కలిసిరావడం లేదు. 2018 డిసెంబర్ ఓడియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్‌లాల్. కలెక్షన్స్‌పరంగా సినిమా మంచి హిట్టయినప్పటికీ మోహన్‌లాల్ లుక్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. 2021 డిసెంబర్‌లో రూ.100 కోట్ల బడ్జెట్ మూవీ మరక్కర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్‌లాల్.
సగం కూడా రాలే!
ఈ సినిమా రిలీజ్‌కు ముందే మూడు జాతీయ అవార్డులు అందుకుంది. భారీ ఓటీటీ డీల్స్ వచ్చినా కూడా థియేటర్‌లోనే ముందుగా రిలీజ్ చేయాలని సినిమాటీమ్ పట్టుబట్టింది. వారి అంచనాలను తలకిందులు చేస్తూ మరక్కర్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే బడ్జెట్‌లో సగం కూడా తిరిగి రాలేదు.
దర్శకుడిగా డిజాస్టర్
వందలాది సినిమాల్లో తన సత్తా ఏంటో చూపించిన మోహన్‌లాల్ బరోజ్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. 2024 డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీ ఘోరంగా చతికిలపడింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.15 కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది.
ఈసారి కూడా పరాజయమే!
సరిగ్గా ఏడాది తర్వాత అదే తేదీ (డిసెంబర్ 25న) వృషభతో పలకరించాడు ఈ స్టార్ హీరో. కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. బుకింగ్స్ పేలవంగా ఉన్నాయి. దీంతో ఈసారి కూడా మళ్లీ ఘోర పరాజయం తప్పేలా కనిపించడం లేదు. మరి మోహన్‌లాల్ ఈ డిసెంబర్ సెంటిమెంట్ ఎప్పుడు బ్రేక్ చేస్తాడో చూడాలి!


