అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస
సంతాపం ప్రకటించిన సినీ ప్రముఖులు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. చాలారోజులుగా మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. ముంబై బాంద్రా ఈస్ట్‌లోని స్వగృహంలో ఉండగా హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో హిందూజా ఆసుపత్రికి తరలించామని సతీశ్ షా మిత్రుడు అశోక్ పండిట్ చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం సతీశ్ షా తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు.
సతీశ్ షాను బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని హిందూజా హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. ఆయనను మూడు నెలల క్రితం మూత్ర పిండాల మారి్పడి శస్త్రచికిత్స జరిగినట్లు మిత్రుడొకరు చెప్పారు. ఆదివారం సతీశ్ షా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాజోల్, ఫరా ఖాన్, కరణ్ జోహార్, ఆర్.మాధవన్ తదితరులు సతీశ్ షాతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
హాస్యనటుడిగా విశేషమైన గుర్తింపు
సతీశ్ షా 1951 జూన్ 25న జని్మంచారు. డిజైనర్ మధు షాను వివాహం చేసుకున్నారు. నటనపై ఆసక్తితో ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1978లో అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, 1979లో గామన్, 1981లో ఉమ్రావ్ జాన్ చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించారు. 1983లో విడుదలైన జానే భీ దో యారో చిత్రంతో ఆయన పేరు అందరికీ తెలిసింది. అవినీతిపరుడైన మున్సిపల్ కమిషనర్‌గా ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. టీవీ సీరియళ్లలోనూ సత్తా చాటారు. 1984లో ప్రసారమైన యే జో హై జిందగీలో 55 ఎపిసోడ్లలో 55 భిన్నమైన పాత్రలు పోషించారు.
2000 సంవత్సరంలో ప్రసారమైన సారాభాయ్ వర్సెస్ సారాభాయి సీరియల్ సతీశ్ షాకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు తెచి్చపెట్టింది. ఇదే సీరియల్ 2017లో పునఃప్రసారమైంది. పలు బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో సతీశ్ షా నటించారు. కబీ హా కబీ న, దిల్వాలే దుల్హానియా లే జాయేంగే, మై హూ నా, కల్ హో న హో, ఓం శాంతి ఓం, ఫనా, అఖేలే హమ్ అఖేలే తుమ్, హమ్ ఆప్కే హై కౌన్, ముజ్‌సే షాదీ కరోగీ, సాతియా, కహో నా ప్యార్ హై, జుడ్వా వంటి చిత్రాల్లో హాస్యరసం పండించి ప్రేక్షకులను అలరించారు.


