breaking news
Hinduja hospital
-
అంతిమ క్షణాల్లో.. 'విల్' పవర్!
మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు? ఏమిటి పిచ్చి ప్రశ్న అంటూ ఫైర్ అవకండి. మనం ఎలా చనిపోవాలో ఎంచుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. నమ్మలేకపోతున్నారా! దీనికి మనం చేయాల్సిందల్లా వీలునామా రాయడమే. చివరి మజిలీని ఎలా ముగించాలనుకుంటున్నామో తెలుపుతూ ముందుగానే వీలునామా రాసిపెట్టుకుంటే చాలు. అయితే ఇది ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, దీనికి ఏమేం కావాలనే వివరాలు తెలుసుకోవాలంటే ముంబైలోని పీడీ హిందుజా నేషనల్ ఆస్పత్రికి వెళ్లాల్సిందే. దాని కంటే ముందు 'లివింగ్ విల్' అంటే ఏంటో చూద్దాం.'లివింగ్ విల్' అంటే?మనిషి ఎంత హాయిగా బతికాడన్నది కాదు, ఎంత సుఖంగా కన్నుమూశాడన్నది ముఖ్యం అంటారు మన పెద్దలు. ఇలాంటి ఆలోచన నుంచే లివింగ్ విల్ (living will) కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. నయం కాని రోగాలతో మంచాన పడి మరణం ముంగిట నిలుచున్నప్పుడు లివింగ్ విల్ క్లారిటీ ఇస్తుంది. చివరి క్షణాల్లో వైద్య సహాయం కావాలా, వద్దా అనేది ఎవరి వారే నిర్ణయించుకోవచ్చు. అఖరి గడియల్లో వెంటిలేటర్ సపోర్ట్ తీసుకోవాలా, వద్దా అనేది కూడా ఎంచుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే రాసే వీలునామానే లివింగ్ విల్ లేదా అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్గా పిలుస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. మన చావు ఎలా ఉండాలో నిర్ణయించుకోవడం. చివరి రోజుల్లో మంచాన పడి జీవచ్ఛవంగా నరకయాతన అనుభవించకుండా సునాయాస మరణం పొందేందుకు ముందుగానే మనం చేసుకునే ఏర్పాటుగా దీన్ని భావించొచ్చు.సుప్రీం తీర్పు ఆధారంగా..మనిషి ఎలా చనిపోవాలనుకుంటున్నాడో తెలుపుతూ ముందుగానే రాసే వీలునామా (లివింగ్ విల్)ను సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా 2018లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. లివింగ్ విల్ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో 2023లో సర్వోన్నత న్యాయస్థానం మరోసారి జోక్యం చేసుకుంది. లివింగ్ విల్ నమోదు విధానాన్ని సులభతరం చేస్తూ కొన్ని సడలింపులు ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా కొన్ని విషయాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వీలునామాలను ఎక్కడ భద్రపరుస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి బాంబే హైకోర్టు (Bombay High Court) పరిష్కారం చూపించింది. వీలునామాలను భద్రపరచడానికి, సులువుగా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేయాలని బాంబే హైకోర్టు 2024లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఇప్పటివరకు 40 మంది..న్యాయస్థానాల ఆదేశాల మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఈ వీలునామాల నమోదు ప్రారంభించింది. 24 వార్డుల్లో ఇప్పటివరకు 40 మంది లివింగ్ విల్ సమర్పించారు. ఇందులో 10 మంది మహిళలు ఉండడం గమనార్హం. 50, 60, 70 ఏళ్ల వారి నుంచి ఈ వీలునామాలు వచ్చాయి. 83 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారు. ఈ పత్రాలకు నగరంలోని 24 వార్డుల్లో మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్లు సంరక్షకులుగా ఉంటారు. వీరి వివరాలు బీఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని బీఎంసీ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూపేంద్ర పాటిల్ తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ వీలునామాలు సమర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.లివింగ్ విల్ క్లినిక్మహిమ్ ప్రాంతంలోని హిందుజా ఆస్పత్రి.. లివింగ్ విల్ క్లినిక్‌ను జూన్ నెలలో ప్రారంభించింది. గౌరవంగా చనిపోవడం (డైయింగ్ విత్ డిగ్నిటీ) పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రూప్ గుర్సహాని చొరవతో లివింగ్ విల్ వీక్లీ క్లినిక్ ప్రారంభమైంది. పాలియేటివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ స్మృతి ఖన్నా దీన్ని నిర్వహిస్తున్నారు. లివింగ్ విల్పై ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు వీలునామా (veelunama) రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను తమ క్లినిక్ చేస్తుందని డాక్టర్ స్మృతి ఖన్నా తెలిపారు. భవిష్యత్తులో ఊహించని ఉత్పాలను తాము ఎలా ఎదుర్కొవాలనే దాని గురించి వీలునామాలో ప్రస్తావించొచ్చని తెలిపారు. ఆకస్మిక ప్రమాదాలు, నయం కాని వ్యాధులు బారిన పడి చివరి గడియల్లో ఉన్నప్పుడు తాము ఏం కోరుకుంటామో.. ముందుగానే లివింగ్ విల్లో రాసుకోవచ్చు.'లివింగ్ విల్ క్లినిక్ (Living Will Clinic) ప్రారంభమైప్పటి నుంచి ఇక్కడి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో 40 నుంచి 80 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారు. చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. కొంత మంది మాత్రం ఒంటరిగా వస్తున్నారు. నయం కాని దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్నవారికి అన్ని సందర్భాల్లో ఐసీయూ ఆధారిత వైద్యసేవలు సహాయకపడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో జీవితాన్ని పొడిగించడం కంటే కూడా బాధల నుంచి విముక్తి కల్పించడం అవసరమన్పిస్తుంద'ని డాక్టర్ స్మృతి ఖన్నా పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండినవారు ఎవరైనా.. ఆరోగ్యంగా ఉన్నా, లేకున్నా లివింగ్ విల్ రాయొచ్చన్నారు. 'జీవితం అనూహ్యమైనది, కానీ మీ వైద్య ఎంపికలు అలా ఉండనవసరం లేదు. మీరు వాటిని స్వయంగా వ్యక్తపరచలేకపోయినా, మీ చికిత్సా ప్రాధాన్యతలను తెలుసుకుని, వాటిని అనుసరించేలా లివింగ్ విల్ సహాయపడుతుంది. మీ ఉద్దేశాలను స్పష్టంగా తెలియజేయడానికి, మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇది సరళమైన, అర్థవంతమైన మార్గం' అంటూ అవగాహన కల్పిస్తోంది హిందుజా ఆస్పత్రి.లివింగ్ విల్ క్లినిక్ ఏం చేస్తుంది?వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్, సీపీఆర్ వంటి అత్యవసర చికిత్స తీసుకుంటున్న సందర్భాల్లో మెడికల్ కౌన్సిలింగ్ ఇస్తుంది.సుప్రీంకోర్టు ఆమోదించిన పార్మాట్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో లీగల్ డాక్యుమెంటేషన్ చేస్తుంది.లివింగ్ విల్ అమలు చేయడానికి అవసరమైన పత్రాలు తయారు చేస్తుంది. (నఖలు పత్రాలను కుటుంబ సభ్యులు, డాక్టర్లతో పాటు పేషంట్ల చిరునామా ఆధారంగా సంబంధిత ప్రభుత్వ అధికారులకు పంపిస్తారు)లివింగ్ విల్ సేవలకు అవుట్ పేషంట్స్ డిపార్ట్మెంట్(ఓపీడీ) ధరల ప్రకారం ఫీజు తీసుకుంటారు. అవసరమైన వారికి ఉచితంగా కూడా పని చేసి పెడతారు.లివింగ్ విల్ ఎప్పుడు అమలు చేస్తారు?బతికుండగానే రాసిన వీలునామాను ఎప్పుడు అమలు చేస్తారనే సందేహం చాలా మందికి కలుగుతుంది. నిబంధనల మేరకు ఈ వీలునామాను వైద్యులు, ప్రభుత్వ అధికారుల బృందం పర్యవేక్షణలో అమలు చేస్తారు. ఆఖరి రోజుల్లో రోగి తనకు తానుగా నిర్ణయం తీసుకోలేనప్పుడు లివింగ్ విల్ ఆధారంగా ముందుకెళతారు. రోగి ఆరోగ్య పరిస్థితి విషమం అని లేదా ఇక కోలుకోలేరని కనీసం 2 మెడికల్ బోర్డులు ధృవీకరించిన తర్వాతే లివింగ్ విల్ ప్రకారం చర్యలు చేపడతారు.ఎవరెవరు రాశారు?ముంబైకి చెందిన పలువురు లివింగ్ విల్ రాసిపెట్టుకున్నారు. డాక్టర్ నిఖిల్ దాతర్(55), చార్టెడ్ అకౌంటెంట్ ప్రఫుల్ పురాణిక్ (60), డాక్టర్ లోపా మెహతా(78), యశ్వంత్ కజ్రోల్కర్ (83) తదితరులు లివింగ్ విల్ రాసిన వారిలో ఉన్నారు. గైనకాలిస్ట్గా పనిచేస్తున్న నిఖిల్ దాతర్.. లివింగ్ విల్ మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సులభతరం చేసిన వెంటనే.. 2023, ఫిబ్రవరిలో వీలునామా రాశారు. అయితే ఈ వీలునామాను ఎవరికి ఇవ్వాలనే సమస్య ఆయనకు ఎదురైంది. దీంతో ఆయన బాంబే హైకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలతో చివరకు మహారాష్ట్ర ప్రభుత్వం వైద్య అధికారులకు ఈ వీలునామా సంరక్షణ బాధ్యతలు అప్పగించింది. వీలునామా రాయడం పెద్ద విషయం కాదు. సమయం వచ్చినప్పడు మనం రాసిన వీలునామాను ఎంత వరకు అమలు చేస్తారనేదే ముఖ్యమని డాక్టర్ నిఖిల్ దాతర్ అన్నారు.సహజ మరణం కోరుకుంటున్నాఅఖరి గడియల్లో తనకు వైద్య సహాయం అవసరం లేదని శివాజీ పార్క్ ప్రాంత నివాసి డాక్టర్ లోపా మెహతా అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించినప్పుడు వెంటిలేటర్లు, ఫీడింగ్ ట్యూబ్స్‌తో అందించే చికిత్స తనకు వద్దని ఆమె స్పష్టం చేశారు. చివరి క్షణాల్లో తమ వారికి కాపాడుకునేందుకు ప్రయత్నించి ఆర్థికంగా, మానసికంగా నలిగిపోయిన ఎన్నో కుటుంబాలను చూసిన తర్వాత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. ''చివరి రోజుల్లో నన్ను ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వస్తే.. నేను పనిచేసిన కింగ్ ఎడ్వార్డ్ మెమోరియల్ ఆస్పత్రికి తీసుకెళ్లండి. అక్కడ అనవసరమైన జోక్యం ఉండదని నేను నమ్ముతున్నాను" అని ఆమె పేర్కొన్నారు.అమ్మ బాధ చూసిన తర్వాత..మనం చనిపోతామని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు ఆలస్యం చేయాలని ప్రశ్నిస్తున్నారు ఎయిరిండియా మాజీ ఉద్యోగి యశ్వంత్ కజ్రోల్కర్. పార్కిస్సన్ వ్యాధితో తన తల్లి అనుభవించిన నరకయాతన చూశాక, అలాంటి అవస్థ తనకు రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని ప్రఫుల్ పురాణిక్ వ్యక్తం చేశారు. బ్లడ్ క్యాన్సర్‌తో తన వదిన ఎంతో వేదన పడ్డారని, ఆమె బాధ చూసిన తర్వాత అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. 'మనవాళ్లను కాపాడుకోవడానికి చేయాల్సిందంతా చేస్తాం. పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిసినప్పుడు మనం ఏమీ చేయలేం. నా పిల్లలు నన్ను.. వెంటిలేటర్‌పై ఉన్న వ్యాధిగ్రస్తులా కాకుండా, నేనున్నట్టుగానే గుర్తుపెట్టుకోవాల'ని కోరుకుంటానని ప్రఫుల్ పేర్కొన్నారు. -
కరోనా పేషెంట్లకు బోన్ డెత్ ముప్పు?
ముంబై: కరోనా నుంచి కోలుకున్న రోగులకు బోన్ డెత్ రూపంలో కొత్త ప్రమాదం తలెత్తడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాస్కులార్ నెక్రోసిస్(ఏవీఎన్)లేదా బోన్ టిష్యూ డెత్‌గా పిలిచే ఈ వ్యాధిని ఇప్పటివరకు ముగ్గురు కరోనా వచ్చి తగ్గినవారిలో కనుగొన్నట్లు హిందూజా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా రోగులకు బ్లాక్ ఫంగస్ రూపంలో ముప్పు ఎదురై అందరినీ ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే! తాజాగా కరోనా అనంతరం ఏవీఎన్ ముప్పు పెరగవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్రోగులకు వాడే స్టిరాయిడ్లే ఈ ఏవీఎన్ వచ్చేందుకు ప్రాథమికంగా కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫీమర్ ఎముక వద్ద మొదలైన నొప్పితో ముగ్గురు ఆస్పత్రికి వచ్చారని, కోవిడ్ వచ్చిన తగ్గిన రెండు నెలలకు వీరిలో ఈ సమస్య బయటపడిందని డా. సంజయ్ అగర్వాల్ చెప్పారు. కోవిడ్ ట్రీట్మెంట్లో దీర్ఘకాలం పాటు కార్టికోస్టిరాయిడ్లు వాడడంతో ఏవీఎన్ కేసులు పెరుగుతున్నాయని బీఎంజే కేస్ స్టడీస్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌లో సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం కోవిడ్‌తో పోరాటం చేసినవారిలో ఈ బోన్‌డెత్ లక్షణాలు గమనించామని మరికొందరు డాక్టర్లు సైతం చెబుతున్నారు. వచ్చే ఒకటి రెండు నెలల్లో ఇలాంటి కేసులు పెరగవచ్చని, స్టిరాయిడ్ల వాడకమైన 5–6 నెలలకు ఈ వ్యాధి బయటపడుతుంటుందని డా. రాహుల్ పండిట్ చెప్పారు. సెకండ్ వేవ్ ఏప్రిల్‌లో గరిష్ఠాలకు చేరిందని, అప్పుడు వైద్యం చేయించుకున్నవారిలో బోన్‌డెత్ లక్షణాలు బయటపడేందుకు కొంత సమయం పట్టవచ్చని అంచనా వేశారు. అయితే సంజయ్ అభిప్రాయం ప్రకారం త్వరలోనే ఏవీఎన్ కేసులు పెరుగుతాయి. సాధారణంగా ఏవీఎన్ లక్షణాలు బయటపడేందుకు చాలా నెలలు పడుతుందని, కానీ ఇప్పుడు ట్రెండ్‌లో స్వల్పకాలంలోనే ఈ లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ వ్యాధి సోకినవాళ్లను తొలినాళ్లలో గుర్తిస్తే మంచి వైద్యం అందించవచ్చన్నారు. తొలిదశలో ఎలాంటి ఆపరేషన్లు అవసరం ఉండదన్నారు. కోవిడ్ వచ్చి తగ్గినవాళ్లు తొడలు, హిప్ జాయింట్ వద్ద నొప్పి కొనసాగుతుంటే ఎంఆర్ఐ స్కానింగ్‌కు వెళ్లాలని, అనంతరం ఏవీఎన్ వ్యాధి సోకిందేమో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తొలిదశలో బిస్ఫాస్ఫోనేట్ థెరపీ ద్వారా దీన్ని తగ్గించవచ్చన్నారు. -
హాస్పటల్లో చేరిన విద్యాబాలన్
ముంబయి: బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఆస్పత్రిలో చేరింది. కిడ్నీ సంబంధింత సమస్యతో ఆమె ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చేరగా, పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు వైద్యులు నిర్దారించారు. ఈ విషయంపై ఆమె సన్నిహితులు స్పందిస్తూ... 'విద్యాబాలన్ కోలుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. బహుశా విద్యాని శనివారం డిశ్చార్జ్ చేయవచ్చు' అని తెలిపారు. కాగా విద్యాబాలన్ న్యూ ఇయర్ వేడుకలతో పాటు, తన పుట్టినరోజును భర్త సిద్ధార్థ రాయ్ కపూర్‌తో కలిసి అబ్రాడ్‌లో జరుపుకునేందుకు ప్లాన్ చేసింది. అయితే విద్యాబాలన్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ టూర్‌ను అర్థాంతరంగా క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.