కరోనా పేషెంట్లకు బోన్‌ డెత్‌ ముప్పు?

Bone death cases detected among COVID-19 survivors in - Sakshi

ముంబైలో బయటపడుతున్న కేసులు

ముంబై: కరోనా నుంచి కోలుకున్న రోగులకు బోన్‌ డెత్‌ రూపంలో కొత్త ప్రమాదం తలెత్తడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాస్కులార్‌ నెక్రోసిస్‌(ఏవీఎన్‌)లేదా బోన్‌ టిష్యూ డెత్‌గా పిలిచే ఈ వ్యాధిని ఇప్పటివరకు ముగ్గురు కరోనా వచ్చి తగ్గినవారిలో కనుగొన్నట్లు హిందూజా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా రోగులకు బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో ముప్పు ఎదురై అందరినీ ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే! తాజాగా కరోనా అనంతరం ఏవీఎన్‌ ముప్పు పెరగవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్‌రోగులకు వాడే స్టిరాయిడ్లే ఈ ఏవీఎన్‌ వచ్చేందుకు ప్రాథమికంగా కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఫీమర్‌ ఎముక వద్ద మొదలైన నొప్పితో ముగ్గురు ఆస్పత్రికి వచ్చారని, కోవిడ్‌ వచ్చిన తగ్గిన రెండు నెలలకు వీరిలో ఈ సమస్య బయటపడిందని డా. సంజయ్‌ అగర్వాల్‌  చెప్పారు. కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌లో దీర్ఘకాలం పాటు కార్టికోస్టిరాయిడ్లు వాడడంతో ఏవీఎన్‌ కేసులు పెరుగుతున్నాయని బీఎంజే కేస్‌ స్టడీస్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌లో సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం కోవిడ్‌తో పోరాటం చేసినవారిలో ఈ బోన్‌డెత్‌ లక్షణాలు గమనించామని మరికొందరు డాక్టర్లు సైతం చెబుతున్నారు. వచ్చే ఒకటి రెండు నెలల్లో ఇలాంటి కేసులు పెరగవచ్చని, స్టిరాయిడ్ల వాడకమైన 5–6 నెలలకు ఈ వ్యాధి బయటపడుతుంటుందని డా. రాహుల్‌ పండిట్‌ చెప్పారు.

సెకండ్‌ వేవ్‌ ఏప్రిల్‌లో గరిష్ఠాలకు చేరిందని, అప్పుడు వైద్యం చేయించుకున్నవారిలో బోన్‌డెత్‌ లక్షణాలు బయటపడేందుకు కొంత సమయం పట్టవచ్చని అంచనా వేశారు. అయితే సంజయ్‌ అభిప్రాయం ప్రకారం త్వరలోనే ఏవీఎన్‌ కేసులు పెరుగుతాయి. సాధారణంగా ఏవీఎన్‌ లక్షణాలు బయటపడేందుకు చాలా నెలలు పడుతుందని, కానీ ఇప్పుడు ట్రెండ్‌లో స్వల్పకాలంలోనే ఈ లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ వ్యాధి సోకినవాళ్లను తొలినాళ్లలో గుర్తిస్తే మంచి వైద్యం అందించవచ్చన్నారు. తొలిదశలో ఎలాంటి ఆపరేషన్లు అవసరం ఉండదన్నారు. కోవిడ్‌ వచ్చి తగ్గినవాళ్లు తొడలు, హిప్‌ జాయింట్‌ వద్ద నొప్పి కొనసాగుతుంటే ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు వెళ్లాలని, అనంతరం ఏవీఎన్‌ వ్యాధి సోకిందేమో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తొలిదశలో బిస్‌ఫాస్ఫోనేట్‌ థెరపీ ద్వారా దీన్ని తగ్గించవచ్చన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top