జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలగడానికి అమెరికా చెప్పిన కారణాలు అసత్యమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ స్పష్టం చేశారు. ఆమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క ఆదేశానికి కాకుండే ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు.
టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ మాట్లాడుతూ..అమెరికా డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగడానికి చూపిన కారణాల్లో ఎలాంటి వాస్తవం లేదు. డబ్ల్యూహెచ్‌ఓ అమెరికాతో పాటు అన్ని సభ్య దేశాలతో వారి సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ పనిచేస్తుంది’ అని సూచించారు.
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగిందని ప్రకటించారు. కోవిడ్-19 సమయంలో డబ్ల్యూహెచ్‌వో పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. డబ్ల్యూహెచ్‌వో అమెరికాను తక్కువ చేసి, స్వతంత్రతను దెబ్బతీసింది. అలాగే,కోవిడ్ సమయంలో కీలక సమాచారం అందించకుండా కాలయాపన చేసింది. ఫలితంగా దేశంలో భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగిందన్నారు.
అమెరికా చేస్తున్న ఈ ఆరోపణల్ని డబ్ల్యూహెచ్‌ఎవో ఖండించింది.అమెరికాతో నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాము. కోవిడ్ సమయంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని వెంటనే ప్రపంచానికి తెలియజేశాం. మాస్క్‌లు, టీకాలు, భౌతిక దూరం పాటించమని సూచించాము. కానీ ఎప్పుడూ మాస్క్ మాండేట్లు, టీకా మాండేట్లు లేదా లాక్‌డౌన్‌లు విధించమని చెప్పలేదు. అవి ప్రతి దేశం స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు’ అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.


