బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ శకం ముగిసింది. దిగ్గజ నటుడు, 300లకి పైగా చిత్రాల్లో నటించిన తన పేరు చిరస్థాయిగా లిఖించుకున్న ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. చివరిశ్వాస వరకు సినిమాల్లో నటించిన ఆయన.. అనారోగ్యంతో కన్నుమూశారు. ధర్మేంద్ర మృతితో బాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ లోకానికి తీవ్ర విషాదం మిగిల్చింది. షోలే మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న ధర్మేంద్ర ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు.
ఈ నేపథ్యంలో ధర్మేంద్ర తొలి సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఆయన నటించిన మొదటి చిత్రమేది? అప్పట్లో ఎంత పారితోషికం అందుకున్నారని నెటిజన్స్తో పాటు అభిమానులు ఆరా తీస్తున్నారు. దీనిపై ఆసక్తకరి విషయం బయటకొచ్చింది. ఆయన 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అర్జున్ హింగోరానీ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌లో బల్రాజ్ సాహ్ని, కుంకుమ్ సినీతారలు కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఆయీ మిలన్ కీ బేలా, ఆయే దిన్ బహార్ కే లాంటి చిత్రాల్లో కనిపించారు. ఫూల్ ఔర్ పత్తర్ అనే మూవీ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. షోలే మూవీతో స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు.
అయితే ఆయన తన తొలి సినిమాకు తీసుకున్న వేతనం(పారితోషికం) కేవలం జీతం రూ.51 లేనని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సల్మాన్ ఖాన్ గేమ్ షో దస్ కా దమ్‌కు హాజరైనప్పుడు ఈ విషయాన్ని పంచుకున్నారు. తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్‌తో ఈ షోలో కనిపించారు. ఈ గేమ్ షోలో రూ.లక్ష గెలుచుకున్న తర్వాత.. సల్మాన్ ఖాన్ ఆయన మొదటి రెమ్యునరేషన్ గురించి ప్రశ్న అడిగాడు. నాకు కెరీర్ మొదట్లో రూ.3500 నుంచి రూ.7 వేల వరకు వచ్చేదని అన్నారు. కానీ నా ఫస్ట్ సినిమాకు రూ.5 వేల పారితోషికం ఇస్తారని అనుకున్నానని తెలిపారు. తీరా సంతకం చేసేటప్పుడు చూస్తే కేవలం రూ.51 మాత్రమే ఉందని ధర్మేంద్ర వెల్లడించారు. ఆ డబ్బులతో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి మద్యం కొనుగోలు చేశానన్నారు. పోలీసులు పట్టుకుంటే నా కెరీర్ ముగిసిపోతుందని.. మందు తాగేటప్పుడు నా వేలిముద్రలు గ్లాస్పై పడకుండా రుమాలు పట్టుకుని తాగానని ధర్మేంద్ర పంచుకున్నారు.
కాగా.. ధర్మేంద్ర తన కెరీర్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సీతా ఔర్ గీతా, షోలే, యాదోం కి బారాత్ వంటి చిత్రాల్లో ఆయన నటనను మరోస్థాయికి తీసుకెళ్లాయి. కొద్ది సమయంలోనే అత్యంత ధనిక నటులలో ఒకరిగా మారిపోయారు. 1970ల వరకు తన స్టార్‌డమ్తో పాటు యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనతో హీ-మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఐకానిక్ బిరుదును సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరీర్లో 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు.


