
బాలీవుడ్ హీరో, బిగ్‌బీ తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో తొలిసారి ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన 'ఐ వాంట్ టు టాక్' చిత్రానికి గానూ ఈ అవార్డ్ సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో అవార్డ్ అందుకున్నారు. చందు ఛాంపియన్ సినిమాకు గాను కార్తీక్ ఆర్యన్ సైతం అవార్డ్ అందుకున్నారు. తొలిసారి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకున్న సందర్భంగా అభిషేక్ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ 83వ పుట్టినరోజు కావడం మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
అభిషేక్ మాట్లాడుతూ.. "ఈ ఏడాదితో సినిమా ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. నాకు అవకాశాలు ఇచ్చిన అందరు దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. ఈ ఘనత రావడం అంత సులభం కాదు. నా లైఫ్‌లో విలువైంది. ఈ అవార్డు కోసం నేను ఎన్నిసార్లు స్పీచ్ ఇచ్చేందుకు ప్రాక్టీస్ చేశానో గుర్తులేదు. ఇది ఒక కల. ఈ అవార్డ్ వచ్చినందుకు చాలా వినయంగా ఉన్నా. నా కుటుంబం ముందు అవార్డ్ అందుకోవడం మరింత ప్రత్యేకం. ఇక్కడ నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కార్తీక్ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. తమ డ్రీమ్ కోసం ప్రతి ఒక్కరూ నమ్మకంతో పనిచేయండి. నిరంతరం కృషి చేయండి' అని పంచుకున్నారు.
(ఇది చదవండి: సతీమణి బాటలో అభిషేక్ బచ్చన్.. 24 గంటల్లోనే కోర్టుకు!)
సతీమణి ఐశ్వర్య గురించి అభిషేక్ మాట్లాడుతూ.."ఐశ్వర్య, ఆరాధ్యలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నన్ను బయటకు వెళ్లి నా కల నిజం చేసుకునే అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ అవార్డు రావడానికి వారి త్యాగాలే కారణం. ఈ అవార్డును ఇద్దరు చాలా ప్రత్యేకమైన వ్యక్తులకు అంకితం చేయాలనుకుంటున్నా. నా తండ్రితో పాటు కుమార్తెకు అంకితం చేయాలనుకుంటున్నా." అని అన్నారు.
ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ గైర్హాజరు..
అయితే అభిషేక్ బచ్చన్ ఈ అవార్డ్‌ను తల్లి జయ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్, మేనకోడలు నవ్య నవేలి నందా సమక్షంలో అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు భార్య ఐశ్వర్య రాయ్ , కుమార్తె ఆరాధ్య హాజరు కాలేదు. కాగా.. గతంలో ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు పలుసార్లు జంటగా కనిపించడంతో విడాకుల వార్తలకు చెక్ పడింది.