
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) గురించి ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. ఒకట్రెండు చిత్రాల్లో కనిపించినా అవీ కూడా ఓటీటీల్లోనే నేరుగా రిలీజయ్యాయి. ఈ ఏడాది హౌస్ఫుల్ -5, కాళీధర్ లపత్తా లాంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఇటీవలే అభిషేక్ సతీమణి ఐశ్వర్య రాయ్ తన అనుమతి లేకుండా ఫోటోలు, పేరును వినియోగించకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్న వాటిని తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండానే అనేక వెబ్‌సైట్‌లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. ఏఐ- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య ప్రస్తావించారు.
అదే బాటలో అభిషేక్ బచ్చన్..
అయితే తన భార్య పిటిషన్ వేసిన 24 గంటల్లోనే అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కొన్ని వెబ్‌సైట్‌లు తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నాయని పిటిషన్లో ప్రస్తావించారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానెల్స్ అనధికారికంగా ఫోటోలను ఉపయోగించడంపై నిషేధం విధించాలని ఆయన అభ్యర్థించారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దయచేసి ఆ వెబ్సైట్ల వివరాలు సమర్పిస్తే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని అభిషేక్ తరఫు న్యాయవాదికి సూచించారు. ఒక రోజు సమయం ఇస్తే పూర్తి వివరాలు అందజేస్తామని న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ కోర్టుకు తెలిపారు. కొందరు వ్యక్తులు ఏఐతో అభిషేక్ ఫొటోలు క్రియేట్ చేసి అశ్లీల కంటెంట్‌కు ఉపయోగించుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు.