హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ షోలో నటుడు గౌరవ్ ఖన్నా విజేతగా నిలవగా, నటి ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచింది. ఫర్హానా అభిమానులు మాత్రం తమ కంటెస్టెంటే అసలైన విన్నర్ అని, గౌరవ్ కాదని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు గౌరవ్ భార్య, నటి ఆకాంక్ష చమోలాను ట్రోల్ చేస్తున్నారు.
డ్యాన్స్ వీడియోలపై ట్రోలింగ్
ఆకాంక్ష ఇటీవలే తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా కున్వర్ అమర్, అలీ హసన్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. మరో వీడియోలో అవీజ్ దర్బార్‌తో కలిసి స్టెప్పులేసింది. ఇది చూసిన జనాలు.. తన వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినట్లున్నాయి, అందుకే ఎప్పుడు చూసినా వేరేవాళ్లతోనే కనిపిస్తుందని విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్‌పై ఇన్‌ఫ్లుయెన్సర్ జయతి ఘాటుగా స్పందించింది. ప్రజలు తమ పనులన్నీ వదిలేసి ఆకాంక్షపై పడ్డారని మండిపడింది.
ఆకాంక్షపై ఇంత ద్వేషం ఎందుకు?
గౌరవ్ గెలుపు ఆకాంక్షకు ఎందుకు సమస్యగా మారిందో అర్థం కావడం లేదంది. తను ఏం చేసినా జడ్జ్ చేస్తున్నారని, సహనటులతో డ్యాన్స్ చేస్తుంటే కూడా తప్పుపడుతున్నారంది. అనుపమ సీరియల్‌లో గౌరవ్ సహనటులతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినప్పటికీ అతడినెవరూ ప్రశ్నించలేదని, కానీ ఆకాంక్ష తన పని తాను చేసుకుపోతుంటే కూడా వేలెత్తి చూపిస్తున్నారని మండిపడింది. వాళ్లు యాక్టర్స్ అని.. ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిదని అభిప్రాయపడింది.
నిజాయితీగా ఉన్నా..
ఈ వీడియోను ఆకాంక్ష తిరిగి షేర్ చేస్తూ తనకు సపోర్ట్ చేసిన యువతిని మెచ్చుకుంది. అలాగే తన వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ ఒకరినొకరు మోసం చేసుకోకుండా నిజాయితీగా ఉండటం అవసరం. అది చాలా సర్వసాధారణమైన విషయం. మంచి భార్యగా ఉంటూనే వృత్తిపరంగా నా పని నేను చేసుకుంటున్నాను అని పేర్కొంది. ఆకాంక్ష నటించిన దిల్ ఢోకా ఔర్ డిజైర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 12న షెమారోమి ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతోంది.


