ఒకప్పుడు హీరోయిన్‌గా చేసినవాళ్లు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోవడం సహజం. కథానాయికగా అలరించినవారే తర్వాత అమ్మ, అత్త, వదిన పాత్రల్లో అలరిస్తుంటారు. మరికొందరు మాత్రం ఇండస్ట్రీని వదిలేసి వెండితెరకు దూరంగా ప్రశాంతంగా బతుకుతుంటారు. నటి డాలీ మిన్హాస్ మొదటి కోవకు చెందినది. నేడు (ఫిబ్రవరి 8న) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తనపై ఈ ప్రత్యేక కథనం..
మోడలింగ్ నుంచి సినిమాలవైపు
డాలీ మిన్హాస్ అసలు పేరు డాలీ మాట్యూ. తనొక మోడల్. 1988లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకుంది. 1989లో మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున పోటీ చేసింది. అలా మోడలింగ్ నుంచి సినిమాల్లో వచ్చింది. డాలీ కథానాయికగా నటించిన మొదటి మూవీ దస్తూర్ (1991).
సినిమాలు
మిస్టర్ బాండ్, క్షత్రియ, గేమ్, ప్యార్ మే ట్విస్ట్, గుడ్ లక్, దిల్ దడక్కనే దో వంటి పలు సినిమాలు చేసింది. హిందీతో పాటు పంజాబీ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో శ్రీమాన్ బ్రహ్మచారి అని ఒకే ఒక్క సినిమా చేసింది. 1992లో వచ్చిన ఈ సినిమాలో సురేశ్ హీరోగా నటించాడు. చివరగా కబీర్ సింగ్ (2019) మూవీలో హీరో తల్లి పాత్రలో కనిపించింది.
సీరియల్స్‌కు షిఫ్ట్
తొలి సినిమా దర్శకుడు అనిల్ మాట్యూతో ప్రేమలో పడిన డాలీ అతడినే పెళ్లి చేసుకుంది. రానురానూ సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయింది. ఇస్ ప్యార్‌కో క్యా నామ్ ధూ?, ఏక్ బార్ ఫిర్, చోటీ సర్దామి వంటి పలు సీరియల్స్‌లో నటించింది. మహాయోధ, శక్తిమాన్ సీరియల్స్‌లో నెగెటివ్ పాత్ర పోషించింది. ప్రస్తుతం ప్రేమ్ లీలా సీరియల్ చేస్తోంది. అలా ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన డాలీ ఇప్పుడు బుల్లితెరపై నటిగా రాణిస్తోంది.


