
- హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ ఈనెలలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తనను వేధించిన కస్టమ్స్, అధికారులు పేర్లు 8-పేజీల సూయిసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
- ముంబయిలో టీసీఎస్ మేనేజర్ మానవ్ శర్మ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య వేధింపులతో ఆత్మాహుతి పాలయ్యాడు. ‘‘ఆడవాళ్ల బాధపై అందరూ ఉద్యమిస్తారు. పురుషుల కష్టం ఎవ్వరు చూడరు’’ అని తన చివరి వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
- మరొక స్టార్టప్ టెకీ ఈ ఏడాది మార్చిలో మెంటల్ డిస్ట్రెస్ కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, స్టార్ట్-అప్ బిజినెస్‌లో నష్టాలతో బెంగళూరులో 12వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు
ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. వాస్తవాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. దేశంలో ప్రతి ఏడాది వేలాదిమంది పురుషులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. 2004లో 51,623 మంది వివాహిత పురుషులు ఆత్మహత్య చేసుకోగా, 2021 నాటికి ఈ సంఖ్య 81,063కి పెరిగింది.
అదే సమయంలో వివాహిత మహిళల సంఖ్య మాత్రం 28,045 నుండి 28,680 వరకు మాత్రమే ఉంది. అంటే వివాహిత మహిళల సంఖ్య అలాగే ఉండగా, పురుషుల సంఖ్య 50శాతం పెరిగింది. ఇవి కేవలం గణాంకాలు కాదు, మన సమాజంలో పురుషుల మానసిక ఆరోగ్యం కూలిపోతుందనడానికి సంకేతం. దీనికి కారణాలు తెలుసుకుని, పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదట కారణాలు తెలుసుకుందాం.
1. కుటుంబ సంబంధాల ఒత్తిడి
ఈ మధ్య మా క్లినిక్ కు కౌన్సెలింగ్ కు వచ్చిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘‘సర్, నా జీతం సరిపోవడంలేదని నా భార్య తిట్టింది. మరోవైపు అమ్మ, తన మాట వినడంలేదని ఎత్తిపొడుస్తోంది. ఇద్దరినీ సంతోషపెట్టాలనుకున్నా, కానీ ఎవ్వరూ సంతోషంగా లేరు. చచ్చిపోవాలనిపిస్తుంది” అని వాపోయాడు.
మగాడు కుటుంబానికి ‘రక్షకుడు’ అనే భావన బలంగా ఉంది. దీంతో పిల్లల భవిష్యత్తు, ఇంటి భారం, తల్లిదండ్రుల బాధ్యతలన్నీ పురుషులు మోస్తారు. వీటిలో విఫలమైనప్పుడు తీవ్రమైన అపరాధభావనకు, నిస్సహాయతకు, ఆత్మన్యూనతకు లోనవుతారు. ఇంటి సమస్యలు, భార్యతో విభేదాలు, వృత్తి ఒత్తిడి... ఇవన్నీ బయటకు చెప్పుకోలేని స్థితిలో, ఆ ఒత్తిడి ఆత్మహత్యవైపు నడిపించే ప్రమాదం ఉంది.
2. మానసిక సమస్యలపై మౌనం
మగాళ్లు ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి, సమస్యలను తనలోనే దాచుకోవాలనే సామాజిక కట్టుబాట్లు పురుషులకు అతిపెద్ద శత్రువులు. ఈ భావనను టాక్సిక్ మాస్క్యులినిటీ అంటారు. దీనివల్ల పురుషుడు తమ ఎమోషన్స్, బాధ, భయం, ఆందోళన వంటి వాటిని మనసులోనే తొక్కిపెడతాడు. డిప్రెషన్, యాంగ్జయిటీలాంటి సమస్యలున్నా సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లడాన్ని బలహీనతగా భావిస్తారు. ‘నేను బలహీనుడిని కాను’ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ అణచివేత చివరకు మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసి తీవ్ర నిర్ణయాలవైపుకు నెడుతుంది.
3. ఆర్థిక ఒత్తిళ్లు...
కరోనా తర్వాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది అప్పుల్లో కూరుకుపోయారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వారి గుర్తింపు ఉద్యోగం, సంపాదనతో ముడిపడి ఉండటమే దీనికి కారణం. అందరిముందూ తల దించుకోవాల్సిన పరిస్థితి, అవమాన భారం, భవిష్యత్తుపై అభద్రతాభావం వారిని నిరాశలోకి నెట్టేస్తాయి. ఇటీవల బెంగళూరులో ఒక టెకీ ఉద్యోగం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్త దీనికి నిదర్శనం.
4. చట్టపరమైన ఒత్తిళ్లు...
మరికొంతమంది పురుషులు వివాహ సంబంధిత చట్టాలు, కుటుంబ వివాదాలు, లేదా తప్పు ఆరోపణలు వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. “నేను తప్పు చేయలేదు, కానీ ఎవరూ నమ్మలేదు” అని కొద్ది నెలల క్రితం బెంగళూరులో ఒక టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు మన సమాజంలో మగాళ్ల బాధను ఎవరూ వినడం లేదనే భావనను పెంచుతున్నాయి.
5. మత్తు పదార్థాలు...
చాలామంది పురుషులు మద్యం లేదా డ్రగ్స్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తారు. కానీ అది ఒక్కరోజు సాంత్వన మాత్రమే. మరుసటి రోజు మళ్లీ అదే బాధ, అదే శూన్యత, మళ్లీ మద్యం. అలా అలా దానికి బానిసలవుతారు. ఈ విషవలయం చివరకు స్వీయ విధ్వంసానికి దారి తీస్తుంది.
6. ఒంటరితనం...
మహిళలకు కష్టమొస్తే వెంటనే ఎవరో ఒకరితో పంచుకుంటారు. కానీ పురుషులు మాత్రం మౌనంగా భరిస్తారు. కాఫీ లేదా స్క్రీన్‌తో మాట్లాడతారు. ఓసారి ఒక 42 ఏళ్ల వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ‘‘నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్లు అడిగేది... జీతం ఎంత? కారు కొత్తదా? అని. నిజంగా నా మనసులో ఏముందో విన్నవాడు లేడు’’ అని చెప్పాడు. అదీ పరిస్థితి.
గణాంకాలు చెబుతున్నది ఏమిటి?
• భారతదేశంలో మొత్తం ఆత్మహత్యలలో 70% కంటే ఎక్కువ పురుషులవి.
• 18–45 ఏళ్ల మధ్య వయసు గలవారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
• వివాహిత మహిళల కంటే వివాహిత పురుషులు 1.8 రెట్లు ఎక్కువగా ప్రాణాలు తీసుకున్నారు.
• కుటుంబ సమస్యలు పురుషుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా ఉంది.
పరిష్కార దిశలు
1. మానసిక సమస్యల గురించి మాట్లాడాలి. పురుషుడికి కూడా సహాయం అవసరం అవుతుందని అంగీకరించాలి.
2. కౌన్సెలింగ్‌ను మొదటి అడుగుగా చూడాలి, చివరి ప్రయత్నంగా కాదు.
3. ‘మగాడు ఏడవకూడదు’ అన్న మాట మార్చాలి. ఎమోషన్స్ కు జెండర్ తో సంబంధం లేదని గుర్తించాలి.
4. తండ్రులు, భర్తలు, సోదరులు మాట్లాడుకునే సపోర్ట్ గ్రూపులు ఏర్పాటు చేయాలి.
5. మీడియా పురుషుల బాధను నాటకీయంగా కాకుండా, అవగాహనతో చూపించాలి.
ఒక పురుషుడు చనిపోవడమంటే, ఒక తండ్రి, ఒక కుమారుడు నిశ్శబ్దంగా మాయమవ్వడం. ఒక కుటుంబం కష్టాల్లో, దు:ఖంలో పడటం. ఆత్మహత్యలు కేవలం వ్యక్తిగత వైఫల్యాలు కాదు, అవి సామాజిక వైఫల్యాలు. పురుషులు కూడా మనుషులే, వాళ్లకు కూడా అర్థం చేసుకునే హృదయం అవసరం.
-సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్-జీనియస్ మ్యాట్రిక్స్ హబ్, 8019 000066, www.psyvisesh.com