ఇటీవలి కాలంలో గృహప్రవేశాలు, తదితర శుభ కార్యాల సమయంలో కొందరు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు వచ్చి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక మాధ్య మాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. దౌర్జన్యంగా డబ్బు వసూలు చేయడాన్ని ఎవరూ సమర్థించరు. అయితే, శతాబ్దాలుగా సమాజం వారిని ఎంతలా అట్టడుగుకు నెట్టేసిందో, వ్యవస్థాపరంగా వారు ఎంతటి దోపిడీకి గురయ్యారో కూడా మనం అర్థం చేసుకోవాలి.
ఒక మనిషి ట్రాన్స్‌జెండర్ అని బయటపెట్టిన మరుక్షణం నుంచే అన్ని అవకాశాలు మూసేసి సమాజం వారిని చీదరించుకోవడం పెద్ద విషాదం. ఆశ్రయం కోల్పోయిన వారి కోసం భారత ప్రభుత్వ ‘స్మైల్’ పథకం కింద ‘గరిమా గృహ్’ ఆశ్రమాలు అరకొరగా పని చేస్తున్నాయి. విద్య, ఉద్యోగం, ఆరోగ్య సంరక్షణ, నివాసం వంటి విషయాల్లో వారిపై ఎలాంటి వివక్ష చూపకూడదని ‘ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం–2019’ స్పష్టంగా చెబుతోంది. ఎవరైనా వారిని ఇంటి నుంచి గెంటేసినా, బహిరంగ ప్రదే శాల్లోకి రాకుండా అడ్డుకున్నా... చట్టం ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
ట్రాన్స్‌జెండర్స్ జీవితాల్లో అత్యంత దయనీయమైన అంశం వైద్య సదుపాయాల కొరత. హార్మోన్ థెరపీ, లింగ మార్పిడి శస్త్రచికిత్సల కోసం వారు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేక, ప్రైవేట్ ఆసు పత్రుల్లో ఖర్చులు భరించలేక, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దేశంలోనే తొలి సారిగా 2008లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిన ఘనత తమిళనాడుది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లింగ మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా, సురక్షితంగా అందిస్తూ వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వ విద్యా లయాల్లో చదివే ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఫీజు మాఫీ చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ‘పృత్తికా యాషిని’ దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కాగలిగారు.
మరోవైపు, దేశంలోనే తొలిసారిగా ఒక సమగ్రమైన రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ పాలసీని తీసు కువచ్చిన కేరళ ‘సమన్వయ’ పథకంతో నిరంతర విద్య, ‘సాకల్యం’ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ, ఉచిత లింగ మార్పిడి శస్త్రచికిత్సలకు ఆర్థిక సాయం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. కర్ణాటక... ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని సామాజిక వర్గాల్లోనూ ట్రాన్స్‌జెండర్స్‌కు 1 శాతం రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణలో కొందరిని ట్రాఫిక్ సిబ్బందిగా నియమించడం, జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇవ్వడం వంటి సాను కూల అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్... పెన్షన్ పథకం కూడా అమలు చేస్తోంది. అయితే ఇతర దక్షిణ భారత రాష్ట్రాలతో పోలిస్తే మరింత ప్రగతి సాధించాల్సి ఉంది.
పిలుపులోనే గౌరవం ఉంటుంది కాబట్టి, తమిళనాడులో ట్రాన్స్‌జెండర్‌ను ‘తిరునర్’ అనీ, ట్రాన్స్ స్త్రీని ‘తిరునంగై’ అనీ, ట్రాన్స్ పురుషులను ‘తిరునంబి’ అనీ అంటున్నారు. తెలుగులోనూ అలాంటి గౌరవ సంబోధనలను వాడుకలోకి తేవాల్సిన అవసరం ఉంది.
– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకుడు


