breaking news
University of Pennsylvania
-
ఏనుగు చర్మం టైల్తో కూల్ కూల్ కూల్!
ఏసీల్లాంటివి లేకుండానే ఇల్లు చల్లగా ఉంటే భలే బాగుంటుంది కదా? కొంచెం ఖర్చు, శ్రమకోరిస్తే ఇందుకు ఎన్నో మార్గాలు న్నాయి కానీ... పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్ర వేత్తలు తాజాగా ఇంకో సరికొత్త మార్గాన్ని ఆవిష్క రించారు. అడవి ఏనుగుల ను స్ఫూర్తిగా తీసుకుని వాటి చర్మాలను పోలిన సిమెంట్ టైల్స్ తయారు చేశారు వీరు. బయటి గోడలకు వీటిని వాడితే ఇంటిలోపల ఉష్ణోగ్రతలు 6 నుంచి 11 డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గుతాయని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది కూడా. ఆసక్తికరమైన ఈ పరిశోధన వివరాలు... ఆఫ్రికాలోని ఏనుగులు మటమటలాడే ఎండల్లోనూ భేషుగ్గా బతికేయగలవు. ఏనుగు చర్మం మందంగా ఉండటం ఒక్కటే కారణం కాదు. చర్మం పైభాగంలో ఉండే పగుళ్లలో నీరు చేరిపోయి... నెమ్మదిగా ఆవిరవుతూ చల్లదనం అందిస్తుంది. ఇదే విషయాన్ని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు భవన నిర్మాణ సామగిర తయారీకి వాడారు. సిమెంట్, డైఆటమేషియస్ మట్టి (కీటకనాశినులుగా చల్లే తెల్లటి పొడిలాంటి మట్టి) సాయంతో పలకల్లాంటివి తయారు చేశారు. వీటిలోనూ పగుళ్లు ఉంటాయి. కాకపోతే అవి ఎలా ఉండాలన్నది మనం నిర్ణయించవచ్చు. ఇలా చేయడం వల్ల వాటిల్లోకి నీరు చేరడమే కాకుండా... ఉపరితలం మొత్తమ్మీద నెమ్మదిగా వ్యాపిస్తుంది కూడా. ఎండ వేడికి ఈ నీరు నెమ్మదిగా ఆవిరవుతూ వేడిని విడుదల చేస్తుంది. తద్వారా లోపలి ప్రాంతం చల్లగా మారుతుంది. శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల్లో ఈ టైల్స్ దిగువన ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటే, పగుళ్లు ఉన్న టైల్స్‌లో ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగానూ, పగుళ్లు లేని టైల్స్ ఉపరితలంపై ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్‌గానూ ఉన్నట్లు తెలిసింది. పగుళ్లు లేని టైల్స్‌లో ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే.. ఉన్నదాంట్లోని నీరు కారణంగా ఉష్ణోగ్రత పది డిగ్రీ సెల్సియస్ తక్కువగా ఉందన్నమాట. పైగా ఈ చల్లదనం దాదాపు 20 గంటలపాటు అలాగే ఉండటం విశేషం. ఈ రకమైన టైల్స్ వాడితే ఇంటి లోపలి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి ఏసీ, కూలర్ల వంటివాటి వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడల్లా ఈ టైల్స్పైకి ఆటోమెటిక్‌గా నీరు చిమ్మేలా ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయోగం ప్రాముఖ్యత ఏమిటంటే...భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎండాకాలం వేడి ఏటికేడు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతోపాటే ఏసీల వాడకం.. ఫలితంగా విద్యుత్తు వినియోగం కూడా కొండెక్కుతోంది. ఈ ఏడాది మే నెల వరకూ భారత్‌లో సుమారు కోటీ యాభై లక్షల ఏసీలు అమ్ముడుపోయినట్లు సమాచారం. వడగాడ్పులు, రుతుపవనాల ఆలస్యం వంటి కారణాలతో ఏసీలు ఎక్కువగా వాడటం వల్ల మే నెలలోనే దేశ గరిష్ట విద్యుత్తు వినియోగం 22 గిగావాట్లకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌక పద్ధతుల్లో ఇళ్లలో చల్లదనాన్ని అందించే ఏర్పాట్లు ఎంతైనా ఆహ్వానించదగ్గవి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాను నిలబెట్టిన 'విలువలు ఏమిటి'?
ఒక చరిత్రకారుడిగా, ఒక చిన్న రాజకీయ–చారిత్రక చిత్రాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. మీలో చాలా మంది 21వ శతాబ్దంలో జన్మించారు. అమెరికాలో జన్మించినవారు 2001 సెప్టెంబర్ 11 (9/11) ఉగ్రదాడుల ప్రభావంలో పెరిగారు. 1814లో అమెరికా క్యాపిటల్ భవనం, వైట్ హౌస్‌కు బ్రిటిష్ సైన్యం నిప్పంటించిన తర్వాత... యూఎస్ఏ భూభాగంపై జరిగిన తొలిపెద్ద విదేశీ దాడి అదే. మీరు పెరుగుతున్న సమ యంలో అమెరికా ప్రభుత్వం ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో రెండు దీర్ఘకాల యుద్ధాలు చేసింది. నా కంటే ముందు తరాలకు మాత్రం అమెరికా కేంద్ర ప్రభుత్వం ఎంతో సమర్థంగా కనిపించేది. అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, హ్యారీ ట్రూమన్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని సాధించారు. వ్యోమగాములను చంద్రుడిపైకి!1960ల ప్రారంభంలో యువతకు ఫెడరల్ ప్రభుత్వం అంటే దేశంలో ఆధునిక రహదారులు నిర్మించడం, అమెరికా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడం వంటి గొప్ప విజ యాలు గుర్తుకు వచ్చేవి. అప్పట్లో సోవియట్ యూనియన్‌తో జరుగుతున్న పోటీలోనూ అమెరికా ముందంజలో ఉండేది. 1965లో అధ్యక్షుడు, కాంగ్రెస్ కలిసి ఒక చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా ఎంతో గౌరవంగా భావించిన ఆ చట్టమే... 1965 ఓటింగ్ హక్కుల చట్టం. మీ తరం మాత్రం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ చరిత్రలోని మరో కోణాన్ని కూడా చూసింది. వియత్నాం యుద్ధంలో వేలాది మంది యువ అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని మీరు చదివారు. అలాగే మీ కళ్ల ముందే ధనికులు–పేదల మధ్య అంతరం పెరగడం చూశారు. ఎంతో మంది అమెరికన్లు తమ ‘అమెరికన్ డ్రీమ్‘ సాధించే అవకాశాన్ని కోల్పోవడమూ గమనించారు. కరోనా మహమ్మారి అనే విషాదాన్ని మనమందరం అనుభవించాం. ఆ మహమ్మారి ప్రభావం ఇప్పటికీ మన జీవి తాలపై ఉంది. ఆ వ్యాధి వల్ల పది లక్షలకు పైగా అమెరికన్లు మరణిస్తారని అప్పట్లో మనలో ఎవరైనా ఊహించామా? ఇప్పుడు మనం అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సమావేశమయ్యాం. ఒక్కసారి చరిత్రలోకి చూస్తూ... అమెరికాను బలంగా నిలబెట్టిన ఆరు గొప్ప సంప్రదాయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మొదటి విలువ–చట్టం అందరికీ సమానం:నా దృష్టిలో మొదటి గొప్ప సంప్రదాయం చట్ట పరిపాలన (రూల్ ఆఫ్ లా). ప్రతి పౌరుడికి సమాన న్యాయం లభించడం. న్యాయ వ్యవస్థలో ఎవరికీ ప్రత్యేక సౌకర్యాలు ఉండకపోవడం. అలాగే ఎవరికీ ప్రత్యేక శిక్షలు కూడా ఉండకపోవడం. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే అనే సూత్రాన్ని మనం ఎప్ప టికీ కాపాడుకోవాలి. రెండో సంప్రదాయం–స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు:ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తన ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించే అవకాశం కలిగి ఉండాలి. బ్రిటన్ రాజరిక వ్యవస్థలా కాకుండా, అమెరికా వ్యవస్థాపకులు దేశ పాలనా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టారు. వారు ప్రభుత్వ పని తీరును ఓటు ద్వారా అంచనా వేస్తారు. ఎన్నికలు అంటే అదే. యుద్ధం జరిగినా ఎన్నికలు ఆగలేదు. అమెరికా అంతర్యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎన్నికలు రద్దు చేయాలని కొంతమంది మేధావులు సూచించారు. కొంతమంది మరింత ముందుకెళ్లి, ఫెడరల్ సైన్యాన్ని రాష్ట్రాల్లో మోహరించి, పోలింగ్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకోవాలనీ, అవసరమైతే మార్షల్ లా కూడా అమలు చేయాలనీ కోరారు. కానీ అంతర్యుద్ధం సమయంలో అబ్రహాం లింకన్, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రూజ్వెల్ట్ కేవలం ఒకే వాక్యంలో సమాధానం చెప్పారు: ‘ఎన్నికలు యథావిధిగా జరగాలి’. అలా చేయడం ద్వారా అమెరికా ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో, ఎంత స్థిర మైనదో ప్రపంచానికి చూపించాలని వారు కోరుకున్నారు. మూడో విలువ – నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ:మూడో గొప్ప సంప్రదాయం ఏమిటంటే... దేశ వ్యవస్థాప కులు నిజాయితీ, పారదర్శకత, సామర్థ్యం, నైతికత, కరుణ, మర్యాద, త్యాగస్ఫూర్తి వంటి విలువలతో నడిచే రాజకీయ వ్యవస్థను కలగన్నారు. అధ్యక్షులు జాన్ ఎఫ్.కెన్నెడీ, రోనాల్డ్ రీగన్ తరచూ అమెరికాలోని తొలి కాలనీ గవర్నర్ జాన్ విన్త్రోప్ చెప్పిన మాటలను గుర్తు చేసేవారు. ఆయన ఇలా చెప్పారు: ‘ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తోంది. కాబట్టి మనం కొండపై వెలిగే నగరంలా ఆదర్శంగా ఉండాలి’. ఫిలడెల్ఫియా లోని వాల్నట్ స్ట్రీట్ ప్రాంతంలో థామస్ జెఫర్సన్ ఒక గొప్ప కల కనేవారు. పారదర్శకమైన, నిజాయితీతో కూడిన, మిత వ్యయంతో, గౌరవప్రదంగా, సమర్థవంతంగా పనిచేసే రాజ కీయ వ్యవస్థ ఏర్పడితే... ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని ఆయన నమ్మారు.నాలుగో విలువ–ప్రతి పౌరుడిలో నాయకత్వం ఉండాలి:దేశానికి నాయకత్వం అనేది కేవలం వాషింగ్టన్ డి.సి.లోని ప్రభుత్వానికే పరిమితం కాకూడదు. 1776లో బ్రిటన్ లో అన్ని ముఖ్యమైన నిర్ణయాలు రాజే తీసుకునేవాడు. కానీ అమెరికా వ్యవస్థాపకులు వేరే విధంగా ఆలోచించారు. ఒకవేళ ప్రజలకు అధ్యక్షుడు, కాంగ్రెస్ లేదా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే... వారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని దేశాన్ని సరైన దిశలో నడిపించాలని ఆశించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ఒక గొప్ప మాట చెప్పేవారు: ‘అమెరికాలో అత్యంత గొప్ప హోదా ‘మిస్టర్ ప్రెసిడెంట్’ కాదు. ‘మిస్టర్ సిటి జన్’(పౌరుడు)! అమెరికా రాజ్యాంగం ప్రకారం... ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలి.ఐదో విలువ – చరిత్రకారులు, మేధావుల బాధ్యత:ఐదో సంప్రదాయం... అమెరికా సమాజంలో చరిత్రకా రులు, పరిశోధకులు, మేధావులకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి. దేశ వ్యవస్థాపకులు విమర్శ కూడా ప్రజాస్వామ్యానికి అవసర మేనని భావించారు. రాజరిక వ్యవస్థల్లో, నియంతృత్వ పాలనల్లో కనిపించేలా కాకుండా... అమెరికా వ్యవస్థాపకులు నిరంతర ఆత్మపరిశీలన ద్వారా సమాజాన్ని మెరుగుపరచాలని విశ్వసించారు. దేశాన్ని పొగిడేవారికే కాదు... దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా విమర్శించేవారికీ సమాన గౌరవం ఇవ్వాలని నమ్మారు. గొప్ప అమెరికన్ నాయకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆయన చెప్పిన అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే... ‘ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే’! కానీ 2026లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లోని కొందరు రాజకీయ నాయకులు, చరిత్రకారులు తమకు అను కూలంగా మాత్రమే మాట్లాడాలని కోరుకుంటున్నారు. సర్కస్‌లో చెప్పినట్లు చెప్పే విదూషకుల్లా వారు ప్రవర్తించాలని ఆశిస్తున్నారు. అమెరికా చరిత్రలో జరిగిన తప్పులు, లోపాలు బయటపడితే వాటిని పట్టించుకోవద్దని లేదా వాటికి సాకులు చెప్పాలని వారు కోరుతున్నారు. అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనది. చరిత్రను మార్చే ప్రయత్నాలు మరింత ప్రమాదకరం. కొంతమంది రాజకీయ నాయకులు... నల్లజాతి చరిత్రలోని కీలకమైన అంశాలను తగ్గించి చూపాలని, లేదా పూర్తిగా తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారు. అది అమెరికా విలువలకు విరుద్ధం. ఆరో విలువ – జాతీయ ఐక్యత:నేను చెప్పబోయే ఆరు గొప్ప సంప్రదాయాల్లో చివరిది... జాతీయ ఐక్యత. అమెరికా వ్యవస్థాపకులు ప్రజలు రాజకీయాలపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చని అంగీకరించారు. వారు పరస్పరం చర్చించాలి, వాదించాలి. కానీ చివరికి ఒకేదేశ ప్రజలమనే భావనను కోల్పోకూడదని ఆశించారు. బ్రిటిష్ రాజరికంలో లాగా రాజభవనం నుంచి ఆదేశాలు రావడం కాకుండా... ప్రజలే దేశ భవిష్యత్తును నిర్ణయించాలని వారు విశ్వసించారు. వ్యవస్థాపకులు అధ్యక్షుడిని ప్రభుత్వ అధినేత గానే కాకుండా, దేశ రాజకీయ నాయకుడిగానూ రూపొందించారు. జార్జ్ వాషింగ్టన్‌ను ఆదర్శంగా తీసుకొని, ఎప్పటి కప్పుడు దేశాన్ని ఏకం చేసే నాయకులు రావాలని వారు ఆశించారు. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘అమెరికా అనేది ఒక అందమైన రంగురంగుల మొజాయిక్’(అందమైన చిత్రం) అన్నారు. అంటే... భిన్న సంస్కృతులు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి దేశాన్ని నిర్మిస్తారని ఆయన ఉద్దేశం. అబ్రహాం లింకన్ చెప్పినట్లుగా... ‘పరస్పర ప్రేమ, అనుబంధాలే మనందరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతాయి’. -
ప్రేమ, క్షమాగుణం చూపండి!
ఈ అవకాశం దక్కడం నాకెంతో సంతోషంగా ఉంది. గ్రాడ్యుయేషన్‌తో ఒక దశకు అంకురార్పణ (జననం) జరుగుతుంది. జననంతో మొదలుపెట్టి మాట్లాడటం తేలికైన పని. కానీ, దానికన్నా ముందు నన్ను మరణం గురించి మాట్లాడనివ్వండి. ఇదేదో స్నాతకోపన్యాసంలా లేదు, సంస్మరణోపన్యాసంలా ఉంది అనుకుంటున్నారా? కంగారుపడకండి. ఇది వ్యాధిగ్రస్త స్థితి గురించిన ప్రసంగం కాదు. ఉత్తేజపరచేదే. ‘‘నాలుగు నివేదనలు: రెండు ప్రకటనలు, రెండు ప్రశ్నలు’’ అని నా ప్రసంగానికి మీరు శీర్షిక పెట్టుకోవచ్చు.కడపటి క్షణాల ఆలోచనలు!మొదట పూర్వ రంగాన్ని కొంత వివరించనివ్వండి. నేను డాక్టర్ని. ఫిజీషియన్–సైంటిస్టుని. క్యాన్సర్ వైద్య నిపుణుడిని. చికిత్సనందించడం, కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రాణాంతకమైన వాటిని కూడా నయం చేయడం నా లక్ష్యం. చదువులో ఉన్నత డిగ్రీలు గడించినా, మీ విశ్వవిద్యాలయ అధిపతి చెప్పినట్లుగా,అందరం అన్నీ అర్థం చేసుకోలేం. మృత్యువు కబళిస్తున్న ఆ క్షణంలో ఏం జరుగుతుంది? అది నా స్వానుభవంలోకి రాలేదు కానీ, వెయ్యికి మంది పైగా విషయంలో, ఆ క్షణాలకు నేను సాక్షీభూతంగా ఉన్నాను. లుకేమియా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న ఏడేళ్ల బాలిక క్లినికల్ ట్రయల్‌లో మరణించడం చూశాను. ప్రాణం పోయే ముందు కడ పటి క్షణాలలో, ఆమె తన తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది. ఒక యువ ఇంగ్లిష్ ప్రొఫెసర్ తాను రాస్తున్న చివరి పుస్తకాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని కలలుగంది. తీరా, ఆ కోరిక తీరకుండానే గర్భాశయ క్యాన్సర్‌తో కన్నుమూసింది. మరో పెద్దాయన మనవడు పుట్టాడన్న సంతోషాన్ని ఇంకా పూర్తిగా అనుభవించకుండానే ప్రోస్టేట్ క్యాన్సర్‌తో మరణించారు. వీరిని, ఇలాంటివారే ఇంకా అనేక మందిని నేనొక ప్రశ్న అడిగాను. అంత్యకాలం సమీపిస్తోందని గ్రహించిన ఈ క్షణంలో మీకేమైనా చెయ్యాలని కానీ, చెప్పాలని కానీ ఉందా? అని అడిగాను. రెండు చెప్పారు; రెండు అడిగారు!కొందరు పర్వతారోహణ చేయాలని ఉందన్నారు. కొందరు ఓ కవితను చదవాలని ఉందన్నారు. తమను ఈ స్థితికి తెచ్చిన విధితో పోరాడాలని కొందరు కోరుకున్నారు. కొందరు పవిత్రతతో, ప్రశాంతంగా కన్నుమూయాలని ఉందని చెప్పారు. కానీ, వినగా వినగా వారి మాటల్లో నాకొక సారూప్యత, ధోరణి కనిపించాయి. వారి స్పందనల్లో ఒక సార్వజనీనత, సమ్మేళనం, నైరూప్యత కనిపించాయి. అవి సరళంగా, బట్టబయలు చేసినట్లుగా ఉన్నాయి. భేష జాలు లేవు. అంతిమ క్షణాలలో ఉన్నవారిలో నేను కలుసుకున్న ప్రతి వ్యక్తీ నాలుగింటిని ఇవ్వజూపారు. రెండు ప్రకటనలు చేశారు. రెండు ప్రశ్నలు వేశారు. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాలని ఉంది.’’, ‘‘నేను నిన్ను క్షమిస్తున్నానని నీకు చెప్పాలని ఉంది.’’ ; ‘‘నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నట్లు చెబుతావా?’’, ‘‘నువ్వు నన్ను క్షమిస్తావా?’’... ఈ నాలుగూ ఎంతో ముఖ్యమైనవి. ప్రగాఢమైనవి. జీవితానికి అన్వయించుకోండిఏదో సంతాప సభకు రాసుకున్న పత్రాలను పొరపాటున ఇక్కడకు తెచ్చి చదువుతున్నానని అనుకోకండి. స్నాతకోపన్యాస సంప్రదాయాలను ఇప్పటికే ఉల్లంఘించాను కనుక, మరికొన్నింటిని ఉల్లంఘించనివ్వండి. మీరు నా కోసం ఓ పని చెయ్యండి. ఎక్కడున్న వారు అక్కడే కూర్చుని మీకిష్టమైన వారిని తలచుకుని పై నాలుగు వాక్యాలను మననం చేసుకోండి. ఈ పని మీరు ఏ సమయంలోనైనా చేయవచ్చు. కానీ, ఇప్పుడే, వాయిదా వేయకుండా, ఈ క్షణమే ఆ పని చెయ్యండి. ఇది కూడా ఒక మార్పునకు, జననానికి, మరణానికి సంకేతమే. కీలకాంశం దీనిలోనే ఉంది. మృత్యువు ఎదురైనపుడు తోస్తున్న ఆ పాఠాన్ని జీవితానికి అన్వయింపజేసుకోవాలి. ఆ సూత్రా లను అనుసరిస్తూ జీవించాలి. ఛిద్రమైన మానవ బంధాలుఅత్యంత హృదయ వైశాల్యానికి తోడ్పడే చదువును మీరు ఇప్పుడే ముగించుకున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు. నా జీవితానికి మార్గదర్శనం చేసిన ఒక స్వీయ అనుభవాన్ని వివరిస్తాను. నేనొక కాందిశీకుల కుటుంబం నుంచి వచ్చినవాడిని. దేశ విభజనకు కొద్ది వారాల ముందు 1946లో, మా బామ్మ (అప్పట్లో ఒక యువ వితంతువు) ఇప్పుడు బంగ్లాదేశ్‌గా పిలుస్తున్న ప్రాంతం నుంచి ఐదుగురు మగపిల్లలు, ఒక సినా రేకు పెట్టెతో కలకత్తా చేరింది. అప్పటికే ఆ నగరం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. గృహ దహనాలు, లూటీలతో నగరం ఎర్రబారింది. ఆమె ఒక గదిని అద్దెకు తీసుకుంది. ఆ గదిలోనే ఆ ఐదుగురు పిల్లలు సర్దుకుని పడుకునేవాళ్లు. మా బామ్మ తాత్కాలికంగా ఏర్పచుకున్న వంట గదిలో పడుకునేది. ఆ పిల్లలు తమ దగ్గర ఉన్న ఒక్క పెన్సిల్ని ఒకరి తర్వాత ఒకరు పంచు కునేవాళ్లు. సగం తెల్లకాగితంపై హోమ్‌వర్క్ పూర్తి చేసుకునేవారు. ఆ పిల్లల్లో నేనూ ఒకరిని. ‘‘వాటిని వెనక్కి ఇచ్చెయ్యి’’! కొన్నేళ్ల తర్వాత, మాతోబాటు జీవించేందుకు, మా బామ్మ కూడా ఢిల్లీ వచ్చింది. వెంట సినా రేకు పెట్టె కూడా తెచ్చింది. అది ఆమెతోపాటు చాలా నగరాలు చుట్టి వచ్చింది. దాన్ని ఆమె ఒక అల్మరాలో పెట్టింది. దానిలో ఏమున్నాయో ఎవరికీ తెలియవు. ఆమె కన్నుమూశాక పెట్టె తెరిచాం. ఊహించినట్లుగానే, అందులో కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే మెమెంటోలు, ఫోటోలు... నిరాశా నిస్పృహలకు అద్దం పట్టేవి, చేయబోయే ప్రయాణానికి భయపడుతూ చివరి నిమిషంలో ఆదరాబాదరాగా సర్దినవి ఉన్నాయి. వాటన్నింటి మధ్య ఓ గుడ్డలో చుట్టిన నాలుగు స్కూలు పుస్తకాలు! ఔను. అక్షరాలా పుస్తకాలే. ప్రాణాలకే దిక్కులేని సరి హద్దు వెంట, పలు నగరాలను దాటుకుంటూ పుస్తకాలను కూడా వెంట తెచ్చుకోవడమా? బామ్మ చనిపోవడానికి కొద్ది ఏళ్లకు ముందు రేకు పెట్టెలో వస్తువులను ఏం చేయమంటావు? అని అడిగాను. ‘‘వాటిని వెనక్కి ఇచ్చెయ్యి’’ అని ఆమె మార్మికంగా జవాబు ఇచ్చింది. అంతా కాలం చెల్లిపోయిన సరుకు. 1940ల నాటి గణిత శాస్త్ర పాఠ్య గ్రంథం ఎవరికి కావాలి? నాలుగు వాక్యాల పునర్నిర్మాణంనేను 16 ఏళ్ల వయసులో, 1986లో బర్కిలీ యూనివర్శిటీ లైబ్రరీలోకి అడుగుపెట్టాను. అక్కడ వరుసగా పుస్తకాలు పేర్చి ఉన్నాయి. ఐన్‌స్టీన్, న్యూటన్, రూమి, ఫ్రాన్స్ ఫానన్, బాల్డ్ విన్, డికిన్సన్, మన్రో ఇలా... కొలువుదీరి ఉన్నారు. అలా పుస్తకాలను చూస్తే, వాటిపై ఎంతో మక్కువ కలిగింది. మెడికల్ స్కూలులో చదువు పూర్తి చేసుకున్న తర్వాత, బామ్మ చెప్పిన మాట నిలబెట్టే ప్రయత్నం చేశాను. వెనక్కి ఇచ్చెయ్యమంటే పుస్తకాలను ఇచ్చెయ్య మని కాదు. సమాజం పట్ల ఉన్న బాధ్యత నెరవేర్చమని. బహుశా, అది ఆ నాలుగు వాక్యాల పునర్నిర్మాణం కావచ్చు. తెగువను చూపమని కోరుతున్నామన చుట్టూ ఉన్న ప్రపంచం కలహాలతో నిండి ఉంది. ప్రేమ, క్షమా గుణం కాలం చెల్లినవిగా భావిస్తున్న ప్రపంచంలోకి మీరు అడుగుపెడుతున్నారు. ప్రేమ, క్షమ అవసరం అని చెప్పే తెగువను ప్రదర్శించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆకళింపు చేసుకున్న జీవన సత్యాలుగా వాటిని చాటండి. మీదైన మార్గంలో, మీదైన రీతిలోనే ఆ పని చేయండి. ప్రేమను, క్షమాగుణాన్ని తిరిగి పంచండి. చుట్టూ అలుముకున్న భయానక, నిరాశాపూరిత పరిస్థితుల్లో క్షమించరాని, మన్నించలేని ప్రపంచాన్ని కూడా క్షమించి వదిలెయ్యండి. తిరిగి ప్రేమనే అందించండి. మరణం ఆసన్నమై నపుడు కాదు, జీవించి ఉండగానే నలుగురికీ మేలు చేయాలని సంకల్పించండి! -
సిలికాన్ లేకుండానే కంప్యూటర్
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ టెక్నాలజీలో రారాజుగా వెలుగొందుతున్న సిలికాన్ మూలకానికి ఉన్న ప్రాభవం భవిష్యత్తులో తగ్గిపోనుందని తాజా పరిశోధన ఒకటి స్పష్టంచేస్తోంది. ఆధునిక ఎలక్ట్రానిక్, సాంకేతిక ప్రపంచానికి ప్రాణాధారంగా నిలుస్తున్న స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో సిలికాన్ మూలకం అత్యంత కీలకం. ఈ మూలకం లేకుండా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువు పురుడుపోసుకోదన్న వాదనను బద్దలుకొడుతూ అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధనా బృందం ప్రపంచంలోనే తొలిసారిగా సిలికాన్రహిత కంప్యూటర్ను అభివృద్ధిచేసింది. గత అర్ధశతాబ్దకాలంతో పోలిస్తే నేటి కంప్యూటర్ల పరిమాణం తగ్గడానికి, స్మార్ట్ఫోన్లు, విద్యుత్ వాహనాల సర్క్యూట్లలో సిలికాన్ అత్యంత ప్రధానమైన మూలకం.అలాంటి సిలికాన్ లేకుండానే ‘కాంప్లిమెటరీ మెటల్ –ఆక్సైడ్ సెమీకండక్టర్’ కంప్యూటర్ను తయారుచేశామని వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరిశోధనా తాలూకు వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. తక్కువ పరిమాణంలో విద్యుత్‌తో వినియోగించుకుంటూ అత్యంత పల్చటి, వేగవంతమైన ఎలక్ట్రానిక్స్ తయారీకి ఈ ద్విమితీయ వస్తువులు బాటలు వేస్తాయని పరిశోధకులు చెప్పారు. సర్క్యూట్లో ట్రాన్సిస్టర్లు ముఖ్యమైనవి. ఈ ట్రాన్సిస్టర్లను అత్యంత శుద్ధమైన సిలికాన్‌తో తయారుచేస్తారు. అయితే తాజా పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకులు సిలికాన్‌కు బదులుగా ఎన్–టైప్ ట్రాన్సిస్టర్ కోసం మాలిబ్డినమ్ డైసల్ఫైడ్, పీ–టైప్ టాన్సిస్టర్ కోసం టంగ్స్టన్ డైసెలినైడ్ను ఉపయోగించారు. సారథ్యం వహించిన భారతీయుడుఈ పరిశోధనకు పెన్సిల్వేనియా వర్సిటీలోని ఇంజనీరింగ్ సైన్స్, మెకానిక్స్ విభాగ ప్రొఫెసర్, భారతీయ మూలాలున్న సప్తర్షి దాస్ సారథ్యం వహించారు. ఈయన నేతృత్వంలోని బృందం తాజాగా ప్రాథమిక స్థాయిలో కాంప్లిమెంటరీ మెటల్–ఆక్సైడ్ సెమీకండక్టర్ (సీఎంఓఎస్)కంప్యూటర్ను తయారు చేసింది. ‘‘ సిలికాన్ పాడైతే ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. అదే ఈ ద్విమితీయ వస్తువులతో తయారైన సర్క్యూట్.. విద్యుత్ ప్రవాహాన్ని స్థిరీకరిస్తుంది. దాంతో సర్క్యూట్ ఎక్కువకాలం మన్నుతుంది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ రంగంలో ఇదొక మైలురాయి.భవిష్యత్తులో సిలికాన్రహిత సర్క్యూట్ల తయారీకి ఇది బాటలువేస్తుంది’’ అని సప్తర్షి దాస్ వివరించారు. మెటల్–ఆర్గానిక్ కెమికల్ వేపర్ డిపోజీషన్(ఎంఓసీవీడీ) విధానంలో అత్యంత పల్చని పొరల మీద మాలిబ్డినమ్ డైసల్ఫైడ్, టంగ్స్టన్ డైసెలినైడ్ పరుచుకునేలా చేస్తారు. తద్వారా ఈ వినూత్న ట్రాన్సిస్టర్లను తయారుచేశారు. రెండు అంగుళాల పొరమీద సైతం ఈ ట్రాన్సిసర్ను అభివృద్ధిచేయొచ్చు. ఈ కంప్యూటర్ అత్యంత తక్కువ కరెంట్‌ను ఉపయోగించుకుంటూ 25 కిలోహెడ్జ్ సామర్థ్యంతో పనిచేస్తుందని పరిశోధనలో కీలకపాత్ర పోషించిన డాక్టోరల్ విద్యార్థి, భారతీయ మూలాలున్న సుభీర్ ఘోష్ చెప్పారు. ఈ ప్రాథమిక స్థాయి కంప్యూటర్ ప్రస్తు తానికి సింపుల్ లాజిక్ ఆపరేషన్స్‌ను సమర్థవంతంగా పూర్తిచేయగలదు.భవిష్యత్తు అంతా 2డీదే‘‘మీరొక బహుళ అంతస్తుల భవనం కట్టాలంటే పటిష్టమైన ఇటుకలను వాడతారు. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతను ఉపయోగించి పటిష్టమైన పల్చటి పేపర్లతోనూ నిర్మాణం పూర్తిచేయొచ్చు. పల్చని, వేగవంతమైన ట్రాన్సిస్టర్లతో కంప్యూటర్‌నూ రూపొందించవచ్చు’’ అని సప్తర్షి వ్యాఖ్యానించారు. సిలికాన్ సాంకేతికత గత 80 ఏళ్లుగా సరైన అభివృద్ధికి నోచుకోలేదు. కానీ 2డీ టెక్నాలజీ 2010లో మొదలైనా వెనువెంటనే అభివృద్ధిచెందుతోంది. భవిష్యత్తు అంతా 2డీ టెక్నాలజీదే’’ అని పరిశోధకులు చెప్పారు. ఈ పరిశోధనకు అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్, ది ఆర్మీ రీసెర్చ్ ఆఫీస్, నేవీ రీసెర్చ్ ఆఫీస్‌లు సైతం ఆర్థికసాయం అందిస్తున్నాయి. -
లాక్డౌన్లో పట్టభద్రురాలైన పాప్ సింగర్
లాక్డౌన్లో సరదాగా కోసం తీసుకున్న పురాతన తత్త్వశాస్త్రంలో పట్టా పొందారు పాప్ సింగర్ షకీరా. ఈ విషయాన్ని ఆమె శనివారం సోషల్ మీడియాలో వెల్లడించారు. నాలుగు వారాలు పాటు మాత్రమే తీసుకున్న ఈ కోర్సును పూర్తి కావడంతో ఆమెకు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం గురువారం డిగ్రీ సిర్టిఫికేట్ను ఇచ్చింది. ఈ సర్టిఫికెట్ ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ... ‘నేను ఇప్పుడే నాలుగు వారాల పురాతన తత్త్వశాస్త్రంలో డిగ్రీ పొందాను. నా అభిరుచులు కాస్తా అసాధ్యమైనవే అని నాకు తెలుసు. అయితే పిల్లలతో ఈ కోర్సు చేయడం కష్టమే. అయినా వారు నిద్రపోయాక నేను రాత్రంతా మెలకువతో ఉండి ఈ కోర్సు పూర్తి చేశాను’ అని ట్వీట్ చేశారు. (లాక్డౌన్: ‘వీరిని చూస్తే గర్వంగా ఉంది’) I just graduated from my 4 week Ancient Philosophy course with the University of Pennsylvania (@Penn). I know... my hobbies are very impractical, but it took a lot of hours after the kids were asleep. Thank you Plato and predecessors for all the "fun" over the past month! pic.twitter.com/cFTCXDjliX — Shakira (@shakira) April 23, 2020 ఇక తను అందరి కంటే భిన్నంగా ఆలోచించి లాక్డౌన్లో పట్టభద్రులైన షకీరా తెలివికి అభిమానులు ఫిదా అవుతూ ప్రశంసిస్తూంటే మరికొందరు ఇది మీకు ఇప్పడంత ముఖ్యమా అంటూ విమర్శిస్తున్నారు. ‘‘మీరిలా అనవసరమైన కోర్సును తీసుకుని మీ అమూల్యమైన సమయాన్ని వృథా చేస్తారని అనుకోలేదు. మీకు పిల్లలు ఉన్నారు కదా. ఈ సమయాన్ని వారికి కేటాయించొచ్చు. మీ సమయాన్ని పిల్లలకు ఇచ్చేదాని కంటే ఇది మీకు ముఖ్యమైనదా. అంటే వారు మీకు అంతా ముఖ్యమైన వారు కాదా?’’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (‘ఆ నూనెతో కరోనా చనిపోతుంది’) ఇక లాక్డౌన్లో ఏంచేయాలో తోచక చాలా మంది ఇంట్లో కొత్త కొత్త వంటకాలు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం, టైమ్ పాస్ కోసం టిక్‌టాక్‌లు, డ్యాన్స్‌లు వంటివి చేస్తున్నారు. అయితే వీటన్నింటిని పక్కన పెట్టి షకీరా కొత్తగా ఆలోచించారు. సరదా కోసం తీసుకున్న నాలుగు వారాల ప్రాచీన తత్త్వశాస్త్రంలో షకీరా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. -
ఖర్చులేని సమస్యలను పరిష్కరించండి
సాక్షి, అమరావతి : ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచడమే లక్ష్యంగా ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ ప్రవేశపెట్టామని, అధికారులు మరింత జవాబుదారీతనంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజా వినతుల్లోని ప్రతి సమస్యను పరిష్కరించాలని, ముందుగా ఆర్థికేతర వినతులపై దృష్టి పెట్టాలని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే జన్మభూమి కల్లా వినతులను పెద్దఎత్తున పరిష్కరించాలని చెప్పారు. వినతుల పరిష్కారంలో ప్రజా సంతృప్తి ప్రస్తుతం 59 శాతమే వుందని, దీనిని 80 శాతానికి తీసుకువెళ్లాలని సూచించారు. గురువారం సచివాలయంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్, రియల్ టైమ్ గవర్నెన్స్, ఇ–ఆఫీసు, ప్రజా వినతుల పరిష్కారంపై జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల విభాగాధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో పెన్సిల్వేనియా మెగా విశ్వవిద్యాలయం కాగా, అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ‘పెన్సిల్వేనియా స్టేట్ సిస్టమ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ ముందుకు వచ్చిందని సీఎం చెప్పారు. పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి బృందం గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యింది. పలు రకాల అకడమిక్ కార్యకలాపాలు, పాలనాపరమైన వ్యవహారాల్లో సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని బృందం తెలిపింది. ఇందులో భాగంగా ఏపీలోని విశ్వవిద్యాలయాలకు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సహకారం అందిస్తాయి. -
థైరాయిడ్ ‘తేడా’తో గుండె జబ్బులు
న్యూయార్క్: థైరాయిడ్ గ్రంధి పనితీరులో చిన్నపాటి తేడా ఏర్పడినా తీవ్రమైన హృద్రోగ సమస్యలు తలెత్తవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఈ తాజా పరిశోధన మేరకు తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారిలో థైరాయిడ్ హార్మోన్లుగా పిలిచే టీఎస్‌హెచ్(థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్), టీ4ల స్థాయి ఎక్కువగా, టీ3 స్థాయి తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు గుర్తించారు. టీ4 స్థాయి ఎక్కువైతే గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయని నిర్ధారించారు. ఇందు కోసం మొత్తం 1,382 మంది హృద్రోగ బాధితులపై పరిశోధన చేశారు. టీఎస్‌హెచ్ స్థాయి 7 ఎంఐయు/లీ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రాణాపాయం సంభవించే అవకాశాలున్నాయని పరిశోధకుల్లో ఒకరైన భారతీయ శాస్త్రవేత్త లక్ష్మీ కణ్ణన్ చెప్పారు. థైరాయిడ్ పనితీరు మందగించడంతో ఏర్పడే హైపోథైరాయిడిజం వల్ల గుండెకు కృత్రిమ యంత్రాల సాయం అవసరమవచ్చని కొన్ని సందర్భాల్లో మరణం సంభవిస్తుందన్నారు. -
ఈ మల్లిక పదవిలోనూ పరిమళించింది!
స్ఫూర్తి ఆమె ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఎంబిఏ చేశారు. భారతదేశంలో అత్యుత్తమ ఎంట్రప్రెన్యూర్‌గా గుర్తింపు పొందారు... ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో గవర్నింగ్ మెంబర్‌గా ఉన్నారు. మద్రాస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా రికార్డు సాధించారు... 2006 ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. ఫోర్బ్స్ అమేజింగ్ టాప్ 50లో పవర్ఫుల్ బిజినెస్ ఉమన్‌గా ఎంపికయ్యారు. ఎప్పుడూ ఆకాశాన్ని అందుకోవడానికే ప్రయత్నిస్తారు... కాని నేల మీదే నడుస్తారు... కొందరు ఆమెకు తలపొగరని అంటారు... కాని పెద్ద పెద్ద కంపెనీలు తల ఎత్తుకునేలా చేస్తారామె. ఆమె 2500 కోట్ల టర్నోవర్ ఉన్న టాఫే కంపెనీ డెరైక్టర్ మల్లికా శ్రీనివాసన్. బడా పారిశ్రామికవేత్త శివశైలమ్ ఇంట్లో 1959 నవంబర్ 19న పుట్టిన మల్లిక, మద్రాసు యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్ పట్టా పుచ్చుకున్నాక, పెన్సిల్వేనియాలో ఎం.బి.ఏ చేసి, టీవీఎస్ కంపెనీ సీఎండీ వేణు శ్రీనివాసన్ని వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. 1986లో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆమె తన తండ్రిదైన ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ కంపెనీ (టాఫే)లో ఉద్యోగిగా చేరారు. సొంత కంపెనీలోనే పని చేస్తున్నప్పటికీ మల్లిక మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఆమెది ఆ కంపెనీలో ఏ పదవో తెలియలేదు. అయితే ఆమె ఏం చేయాలో మాత్రం చెప్పారు. ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకోగలిగే చాకచక్యం... తండ్రి పర్యవేక్షణ, సాటి ఉద్యోగుల చేయూతతో ఆమె తాను ఎదుగుతూ, ట్రాక్టర్ పరిశ్రమకు సిఈవో అయ్యే స్థాయికి చేరారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనప్పటికీ దృఢదీక్షతో ముందుకు దూసుకువెళ్లారు. ట్రాక్టర్ మ్యాన్యుఫాక్చరింగ్‌లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ట్రాక్టర్‌ను రైతులకు మరింత ఉపయోగపడేలా చేశారు. స్వభావం... గొప్పశక్తి అనేది గొప్ప బాధ్యత నుంచి వస్తుంది అని నమ్మే మల్లిక తన ఆశయాలు, ఆలోచనల విషయంలో ఆశావాది. ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టాఫే) చెన్నైలో ఉంది. చైర్మన్, సిఈవో ఆఫీస్ కూడా అక్కడే ఉంది. అయితే ఆమె అందరితో కలిసి పని చేస్తారు. తాను కంపెనీలో చేరిన తొలి రోజులను గుర్తు తెచ్చుకుంటూ... టాఫే బిల్డింగ్ కారిడార్‌లో కొంత భాగాన్ని వేరు చేసి అందులో ఆఫీసు పెట్టారు. ఉన్న స్థలంలోనే మంచి టీమ్ ఎంతో పొందికగా కంఫర్ట్‌గా ఉంది. పనిచేస్తున్నవారిలో చాలామంది మా నాన్నగారి టైమ్‌లో అంటే 1964లో కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి ఉన్నారు. కొందరు నన్ను ఆహ్వానించారు. కొందరు మాత్రం ‘ఈవిడ ఎంతకాలం ఉంటుందిలే’ అనుకునేవారు’’ అని చెప్పారామె. 2005లో ఏషర్ మోటార్స్‌ను దాటి టాఫే రెండోస్థానానికి రావడం చూసి ‘‘ఆమె తీసుకున్న తెలివైన నిర్ణయానికి చాలామంది ఆశ్చర్యపోయారు’’ అంటారు టాఫే కార్పొరేట్ కమ్యూనికేషన్ వ్యవహారాలు చూసే విజయకుమార్ బ్రౌనింగ్. మార్కెటింగ్ అండ్ ప్రొడక్ట్ స్ట్రాటెజీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టి.ఆర్ కేశవన్... మల్లిక చాలా నిబద్ధత కల్గిన వ్యక్తి. అందరినీ ముందుకు నడిపించే శక్తి ఆమెలో ఉంది అంటారు. 1986లో నాలుగు వేల ట్రాక్టర్లను ఉత్పత్తి చేసిన ఈ సంస్థ ప్రస్తుతం 1,20,000 ట్రాక్టర్లను ఉత్పత్తి చేసే స్థాయికి వెళ్లి, ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. 2000 వ సంవత్సరంలో కంపెనీ చాలా నష్టాల్లో కూరుకుని పోయి ఉన్న సమయంలో మల్లిక రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోను, కొత్త ఉత్పత్తుల కోసమూ కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి, ఉత్పత్తుల ప్రమాణాలను పెంచారు. తాను చేరే నాటికి 86 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీని 2011 నాటికి 5800 కోట్లకు తీసుకువెళ్లారు. మహీంద్రా ట్రాక్టర్ల తరువాత రెండోస్థానాన్ని సంపాదించి పెట్టారు టాఫేకి. ‘‘జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు కుంగిపోకుండా అవకాశాల కోసం వెతుకుతూండాలి. అలాగే... చేస్తున్న పని పట్ల నిబద్ధతతో ఉంటూ, ఆనందంగా చేయాలి’’ అంటారు మల్లిక. ఉత్తమ సీఈఓగానే కాదు, ఉత్తమ ఉద్యోగిగా... ఆఖరుకు బాధ్యత గల పౌరుడిగా పేరు తెచ్చుకోవాలన్నా కూడా ఆమె చెప్పిన సూత్రాలను, క్రమశిక్షణను పాటించడం అవసరమేమోననిపిస్తుంది. ఎందుకంటే అది అక్షర సత్యం కాబట్టి! - డా. వైజయంతి ఏ ప్రధాన బాధ్యత స్వీకరించవలసి వచ్చినా, ముందుగా ఆ విషయం గురించి కూలంకషంగా తెలుసుకుని తనను తాను నిరూపించుకునేవారు మల్లిక. తన ఉద్యోగస్థులందరితోటీ చక్కగా మాట్లాడతారు. ఎక్కడ సమస్య ఉందో తెలుసుకుని, దానికి పరిష్కారం కనుక్కునేవారు. కంపెనీలో అత్యున్నత పదవిలో ఉన్నా కూడా చాలా సాధారణ ఉద్యోగిలాగే ఉంటారామె. ‘‘ఇలా ఉండటం వలన ఎవరు ఎక్కడ పనిచేయగలరో తెలుసుకోవడానికి ఉపయోగపడింది’’ అంటారు మల్లిక. పొద్ద్దున్న తొమ్మిది గంటలకు ఆఫీసుకి వెళ్లి చూస్తే, అప్పటికే ఆమె కంపెనీ ఫైల్స్ చూస్తూ, ఉద్యోగులకు సూచనలు ఇస్తూ కనిపిస్తారు. బహుశ అదే ఆమె విజయ రహస్యం కావచ్చు! -
విసుగులోంచి ఉరిమిందొక మెరుపు!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని ‘యురేకా...’ క్షణాలు ఉంటాయి. ఆర్కెమెడిస్లా ‘కేక’ పెట్టించే ఐడియాలు వస్తుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు అవి పరిష్కారం అవుతుంటాయి. ఆ ఐడియాలు జీవితాలనే మార్చేస్తూ ఉంటాయి. మెరెడిత్ పెర్రీకి కూడా ఒకసారి అలాంటి ఐడియానే వచ్చింది. ఒక సమస్యకు పరిష్కారం గురించి ఆలోచిస్తున్న సమయంలో ఆమెకీ అద్భుతమైన ఐడియా తట్టింది. అది అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం. మెరిడిత్ అక్కడ ఆస్ట్రోబయాలజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. వర్సిటీలో ‘ఇన్నోవేటివ్ ఐడియాస్ కాంపిటీషన్’ జరుగుతోంది. ప్రత్యేకంగా ఫైనలియర్ విద్యార్థులు ఏదైనా నవ్యతతో కూడిన ఐడియాను వివరించి చెబితే... వాళ్ల చదువుకు సార్థకత చేకూరిన ట్టే. మెరిడిత్ కూడా ఆ కాంపిటీషన్లో పాల్గొనాల్సి ఉంది. ఏదైనా మంచి ఐడియా వస్తే బావుణ్ణు అనుకొంటూ గూగుల్‌లో గాలించింది. చాలాసేపు ప్రయత్నించినా ఏమీ దొరక్కపోవడంతో ల్యాప్‌టాప్ మూసి బ్యాగ్‌లో సర్దుతుండగా, పొడవైన వైర్‌తో ఉన్న ల్యాప్చార్జర్ బ్యాగ్‌లో సెట్ కాలేదు. అప్పుడు పుట్టిన విసుగులోంచి ఆమె బుర్రలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. ఒక్కసారి ‘యురేకా..’ అనుకొంది పెర్రీ. బ్యాగ్‌లో సెట్ కాని చార్జర్ తనను ఎంతగా విసిగిస్తోందో ఆమెకు తెలుసు. ఆమెకే కాదు... ల్యాప్‌టాప్‌ను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగే ప్రతి ఒక్కరికీ చార్జర్‌ను క్యారీ చేయడం పెద్ద రిస్కే! అయినా మనం వైర్లెస్ కమ్యూనికేషన్ యుగంలో ఉన్నాం. ఇంటర్నెట్టే వైర్‌లెస్‌గా వస్తోంది. అలాంటిది చార్జింగ్ కోసం అంత పెద్ద వైర్ ఎందుకు? అలా చార్జర్‌ను అతి కష్టం మీద క్యారీ చేయడం ఎందుకు? అనే సంఘర్షణ నుంచి ‘వైర్లెస్’ చార్జింగ్ ఐడియా వచ్చింది. దాని గురించి మళ్లీ గూగుల్లోనే గాలిస్తే.. అదొక ఇన్నోవేటివ్ ఐడియా అని అర్థమైంది. ఐడియా ఈజీనే, కసర త్తులో కష్టం! తమ అవసరం, ఊహాశక్తిని బట్టి...‘అలాంటి టెక్నాలజీ అందుబాటులోకి వస్తే బావుండు...’ అని చాలా మంది అనుకొంటుంటారు. అలాంటి వారి దగ్గర ఎన్నో ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. అయితే అవి సాధ్యం అవుతాయో కాదో... వారికి తెలీదు. మొదట్లో పెర్రీ పరిస్థితి కూడా ఇంతే. చార్జర్లకు పొడవాటి వైర్లు అవసరం లేకుండా... పవర్ జనరేటర్ నుంచి డెరైక్ట్‌గా విద్యుత్ తరంగాల రూపంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల బ్యాటరీని నింపితే బావుంటుందనేది పెర్రీకి వచ్చిన ఆలోచన. అయితే అది ఎంత వరకూ సాధ్యపడుతుందో ఆమెకు మొదట అర్థం కాలేదు. ఇన్నొవేటివ్ ఐడియాగా ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు తక్కిన స్టూడెంట్స్ దగ్గర నుంచి మిశ్రమ స్థాయి స్పందన వచ్చింది. కొంతమంది మాత్రం వైర్ సాయం లేకుండా గాలిలో విద్యుత్ తరంగాలను ఎలా పంపిస్తారు మేడమ్... అన్నారు. దీంతో ఈ ఐడియాపై మరింత కసరత్తు చేసింది పెర్రీ. సౌండ్, ఎలక్ట్రిసిటీ, బ్యాటరీ టెక్నాలజీల గురించి అధ్యయనం చేసింది, పిజోఎలక్ట్ట్రిసిటీ గురించి అర్థం చేసుకొంది. కొన్ని మీటర్ల అవధిలో ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్‌ల బ్యాటరీలను చార్జ్ చేయడానికి ఒక ఫార్ములాను రూపొందించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమల్లో పెట్టడానికి పెర్రీ చాలా ప్రయత్నాలను చేసింది. ఈ ఫార్ములాను వివరిస్తే ఇదొక క్రేజీ ప్రాజెక్ట్ అని కొంతమంది కొట్టిపడేశారు. అయితే కొంతమంది దాతల సహకారంతో పెర్రీ ‘యూ బీమ్’ స్టార్టప్‌ను మొదలుపెట్టగలిగింది. ఆల్ట్రాసౌండ్ ట్రాన్స్మిటర్స్ ద్వారా గ్యాడ్జెట్‌లోని బ్యాటరీలను చార్జింగ్ చేయగలిగే పద్ధతి గురించి పరిశోధన చేస్తోంది. పెర్రీ ప్రాజెక్ట్ ఫలప్రదం అయ్యే అవకాశాలున్నాయని అనేకమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ 22 యేళ్ల ఇంజినీర్ సంచలనంగా మారింది. వివిధ పరిశోధన సంస్థలు ఈమెపై దృష్టిసారించాయి. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక కూడా పెర్రీ ఇన్నోవేటివ్ ఐడియాను గుర్తించి ‘30 అండర్ 30’ జాబితాలోకి ఎంపిక చేసింది. 30 సంవత్సరాల్లోపు అద్బుతాలు సాధించిన ప్రస్తుతతరం యువతీయువకుల జాబితానే ‘30 అండర్ 30’. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న పెర్రీ తన స్టార్టప్‌ను సక్సెస్ చేసుకొని ‘ఫోర్బ్స్ ప్రభావాత్మక వ్యక్తుల జాబితా’లో స్థానం సాధించగలను అంటూ దృఢంగా చెబుతోంది! ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక కూడా పెర్రీ ఇన్నోవేటివ్ ఐడియాను గుర్తించి ‘30 అండర్ 30’ జాబితాలోకి ఎంపిక చేసింది. 30 సంవత్సరాల్లోపు అద్భుతాలు సాధించిన ప్రస్తుత తరం యువతీయువకుల జాబితానే ‘30 అండర్ 30’. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న పెర్రీ తన స్టార్టప్‌ను సక్సెస్ చేసుకొని ‘ఫోర్బ్స్ ప్రభావాత్మక వ్యక్తుల జాబితా’ లో స్థానం సాధించగలను అని దృఢంగా చెబుతోంది!


