ఖర్చులేని సమస్యలను పరిష్కరించండి

university of Pennsylvania in the state - Sakshi

     జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

     రాష్ట్రంలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం

సాక్షి, అమరావతి : ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచడమే లక్ష్యంగా ‘రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌’ ప్రవేశపెట్టామని, అధికారులు మరింత జవాబుదారీతనంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజా వినతుల్లోని ప్రతి సమస్యను పరిష్కరించాలని, ముందుగా ఆర్థికేతర వినతులపై దృష్టి పెట్టాలని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే జన్మభూమి కల్లా వినతులను పెద్దఎత్తున పరిష్కరించాలని చెప్పారు. వినతుల పరిష్కారంలో ప్రజా సంతృప్తి ప్రస్తుతం 59 శాతమే వుందని, దీనిని 80 శాతానికి తీసుకువెళ్లాలని సూచించారు. గురువారం సచివాలయంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్, ఇ–ఆఫీసు, ప్రజా వినతుల పరిష్కారంపై జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల విభాగాధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

ఏపీలో పెన్సిల్వేనియా మెగా విశ్వవిద్యాలయం
కాగా, అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ‘పెన్సిల్వేనియా స్టేట్‌ సిస్టమ్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ ముందుకు వచ్చిందని సీఎం చెప్పారు. పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి బృందం గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యింది. పలు రకాల అకడమిక్‌ కార్యకలాపాలు, పాలనాపరమైన వ్యవహారాల్లో సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని బృందం తెలిపింది. ఇందులో భాగంగా ఏపీలోని విశ్వవిద్యాలయాలకు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సహకారం అందిస్తాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top