ప్రఖ్యాత వైద్యుడు, పరిశోధకుడు, గ్రంథకర్త సిద్ధార్థ ముఖర్జీ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల 2024 జట్టును ఉద్దేశించి చేసిన స్నాతకోపన్యాస సంక్షిప్త పాఠం.
విశ్వ గురు
ఈ అవకాశం దక్కడం నాకెంతో సంతోషంగా ఉంది. గ్రాడ్యుయేషన్‌తో ఒక దశకు అంకురార్పణ (జననం) జరుగుతుంది. జననంతో మొదలుపెట్టి మాట్లాడటం తేలికైన పని. కానీ, దానికన్నా ముందు నన్ను మరణం గురించి మాట్లాడనివ్వండి. ఇదేదో స్నాతకోపన్యాసంలా లేదు, సంస్మరణోపన్యాసంలా ఉంది అనుకుంటున్నారా? కంగారుపడకండి. ఇది వ్యాధిగ్రస్త స్థితి గురించిన ప్రసంగం కాదు. ఉత్తేజపరచేదే. ‘‘నాలుగు నివేదనలు: రెండు ప్రకటనలు, రెండు ప్రశ్నలు’’ అని నా ప్రసంగానికి మీరు శీర్షిక పెట్టుకోవచ్చు.
కడపటి క్షణాల ఆలోచనలు!
మొదట పూర్వ రంగాన్ని కొంత వివరించనివ్వండి. నేను డాక్టర్‌ని. ఫిజీషియన్–సైంటిస్టుని. క్యాన్సర్ వైద్య నిపుణుడిని. చికిత్సనందించడం, కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రాణాంతకమైన వాటిని కూడా నయం చేయడం నా లక్ష్యం. చదువులో ఉన్నత డిగ్రీలు గడించినా, మీ విశ్వవిద్యాలయ అధిపతి చెప్పినట్లుగా,అందరం అన్నీ అర్థం చేసుకోలేం. మృత్యువు కబళిస్తున్న ఆ క్షణంలో ఏం జరుగుతుంది? అది నా స్వానుభవంలోకి రాలేదు కానీ, వెయ్యికి మంది పైగా విషయంలో, ఆ క్షణాలకు నేను సాక్షీభూతంగా ఉన్నాను.
లుకేమియా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న ఏడేళ్ల బాలిక క్లినికల్ ట్రయల్‌లో మరణించడం చూశాను. ప్రాణం పోయే ముందు కడ పటి క్షణాలలో, ఆమె తన తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది. ఒక యువ ఇంగ్లిష్ ప్రొఫెసర్ తాను రాస్తున్న చివరి పుస్తకాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని కలలుగంది. తీరా, ఆ కోరిక తీరకుండానే గర్భాశయ క్యాన్సర్‌తో కన్నుమూసింది. మరో పెద్దాయన మనవడు పుట్టాడన్న సంతోషాన్ని ఇంకా పూర్తిగా అనుభవించకుండానే ప్రోస్టేట్ క్యాన్సర్‌తో మరణించారు. వీరిని, ఇలాంటివారే ఇంకా అనేక మందిని నేనొక ప్రశ్న అడిగాను. అంత్యకాలం సమీపిస్తోందని గ్రహించిన ఈ క్షణంలో మీకేమైనా చెయ్యాలని కానీ, చెప్పాలని కానీ ఉందా? అని అడిగాను.
రెండు చెప్పారు; రెండు అడిగారు!
కొందరు పర్వతారోహణ చేయాలని ఉందన్నారు. కొందరు ఓ కవితను చదవాలని ఉందన్నారు. తమను ఈ స్థితికి తెచ్చిన విధితో పోరాడాలని కొందరు కోరుకున్నారు. కొందరు పవిత్రతతో, ప్రశాంతంగా కన్నుమూయాలని ఉందని చెప్పారు. కానీ, వినగా వినగా వారి మాటల్లో నాకొక సారూప్యత, ధోరణి కనిపించాయి. వారి స్పందనల్లో ఒక సార్వజనీనత, సమ్మేళనం, నైరూప్యత కనిపించాయి. అవి సరళంగా, బట్టబయలు చేసినట్లుగా ఉన్నాయి. భేష జాలు లేవు. అంతిమ క్షణాలలో ఉన్నవారిలో నేను కలుసుకున్న ప్రతి వ్యక్తీ నాలుగింటిని ఇవ్వజూపారు. రెండు ప్రకటనలు చేశారు. రెండు ప్రశ్నలు వేశారు. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాలని ఉంది.’’, ‘‘నేను నిన్ను క్షమిస్తున్నానని నీకు చెప్పాలని ఉంది.’’ ; ‘‘నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నట్లు చెబుతావా?’’, ‘‘నువ్వు నన్ను క్షమిస్తావా?’’... ఈ నాలుగూ ఎంతో ముఖ్యమైనవి. ప్రగాఢమైనవి.
జీవితానికి అన్వయించుకోండి
ఏదో సంతాప సభకు రాసుకున్న పత్రాలను పొరపాటున ఇక్కడకు తెచ్చి చదువుతున్నానని అనుకోకండి. స్నాతకోపన్యాస సంప్రదాయాలను ఇప్పటికే ఉల్లంఘించాను కనుక, మరికొన్నింటిని ఉల్లంఘించనివ్వండి. మీరు నా కోసం ఓ పని చెయ్యండి. ఎక్కడున్న వారు అక్కడే కూర్చుని మీకిష్టమైన వారిని తలచుకుని పై నాలుగు వాక్యాలను మననం చేసుకోండి. ఈ పని మీరు ఏ సమయంలోనైనా చేయవచ్చు. కానీ, ఇప్పుడే, వాయిదా వేయకుండా, ఈ క్షణమే ఆ పని చెయ్యండి. ఇది కూడా ఒక మార్పునకు, జననానికి, మరణానికి సంకేతమే. కీలకాంశం దీనిలోనే ఉంది. మృత్యువు ఎదురైనపుడు తోస్తున్న ఆ పాఠాన్ని జీవితానికి అన్వయింపజేసుకోవాలి. ఆ సూత్రా లను అనుసరిస్తూ జీవించాలి.
ఛిద్రమైన మానవ బంధాలు
అత్యంత హృదయ వైశాల్యానికి తోడ్పడే చదువును మీరు ఇప్పుడే ముగించుకున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు. నా జీవితానికి మార్గదర్శనం చేసిన ఒక స్వీయ అనుభవాన్ని వివరిస్తాను. నేనొక కాందిశీకుల కుటుంబం నుంచి వచ్చినవాడిని. దేశ విభజనకు కొద్ది వారాల ముందు 1946లో, మా బామ్మ (అప్పట్లో ఒక యువ వితంతువు) ఇప్పుడు బంగ్లాదేశ్‌గా పిలుస్తున్న ప్రాంతం నుంచి ఐదుగురు మగపిల్లలు, ఒక సినా రేకు పెట్టెతో కలకత్తా చేరింది. అప్పటికే ఆ నగరం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. గృహ దహనాలు, లూటీలతో నగరం ఎర్రబారింది. ఆమె ఒక గదిని అద్దెకు తీసుకుంది. ఆ గదిలోనే ఆ ఐదుగురు పిల్లలు సర్దుకుని పడుకునేవాళ్లు. మా బామ్మ తాత్కాలికంగా ఏర్పచుకున్న వంట గదిలో పడుకునేది. ఆ పిల్లలు తమ దగ్గర ఉన్న ఒక్క పెన్సిల్‌ని ఒకరి తర్వాత ఒకరు పంచు కునేవాళ్లు. సగం తెల్లకాగితంపై హోమ్‌వర్క్ పూర్తి చేసుకునేవారు. ఆ పిల్లల్లో నేనూ ఒకరిని.
‘‘వాటిని వెనక్కి ఇచ్చెయ్యి’’!
కొన్నేళ్ల తర్వాత, మాతోబాటు జీవించేందుకు, మా బామ్మ కూడా ఢిల్లీ వచ్చింది. వెంట సినా రేకు పెట్టె కూడా తెచ్చింది. అది ఆమెతోపాటు చాలా నగరాలు చుట్టి వచ్చింది. దాన్ని ఆమె ఒక అల్మరాలో పెట్టింది. దానిలో ఏమున్నాయో ఎవరికీ తెలియవు. ఆమె కన్నుమూశాక పెట్టె తెరిచాం. ఊహించినట్లుగానే, అందులో కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే మెమెంటోలు, ఫోటోలు... నిరాశా నిస్పృహలకు అద్దం పట్టేవి, చేయబోయే ప్రయాణానికి భయపడుతూ చివరి నిమిషంలో ఆదరాబాదరాగా సర్దినవి ఉన్నాయి. వాటన్నింటి మధ్య ఓ గుడ్డలో చుట్టిన నాలుగు స్కూలు పుస్తకాలు! ఔను. అక్షరాలా పుస్తకాలే. ప్రాణాలకే దిక్కులేని సరి హద్దు వెంట, పలు నగరాలను దాటుకుంటూ పుస్తకాలను కూడా వెంట తెచ్చుకోవడమా? బామ్మ చనిపోవడానికి కొద్ది ఏళ్లకు ముందు రేకు పెట్టెలో వస్తువులను ఏం చేయమంటావు? అని అడిగాను. ‘‘వాటిని వెనక్కి ఇచ్చెయ్యి’’ అని ఆమె మార్మికంగా జవాబు ఇచ్చింది. అంతా కాలం చెల్లిపోయిన సరుకు. 1940ల నాటి గణిత శాస్త్ర పాఠ్య గ్రంథం ఎవరికి కావాలి?
నాలుగు వాక్యాల పునర్నిర్మాణం
నేను 16 ఏళ్ల వయసులో, 1986లో బర్కిలీ యూనివర్శిటీ లైబ్రరీలోకి అడుగుపెట్టాను. అక్కడ వరుసగా పుస్తకాలు పేర్చి ఉన్నాయి. ఐన్‌స్టీన్, న్యూటన్, రూమి, ఫ్రాన్స్ ఫానన్, బాల్డ్ విన్, డికిన్సన్, మన్రో ఇలా... కొలువుదీరి ఉన్నారు. అలా పుస్తకాలను చూస్తే, వాటిపై ఎంతో మక్కువ కలిగింది. మెడికల్ స్కూలులో చదువు పూర్తి చేసుకున్న తర్వాత, బామ్మ చెప్పిన మాట నిలబెట్టే ప్రయత్నం చేశాను. వెనక్కి ఇచ్చెయ్యమంటే పుస్తకాలను ఇచ్చెయ్య మని కాదు. సమాజం పట్ల ఉన్న బాధ్యత నెరవేర్చమని. బహుశా, అది ఆ నాలుగు వాక్యాల పునర్నిర్మాణం కావచ్చు.
తెగువను చూపమని కోరుతున్నా
మన చుట్టూ ఉన్న ప్రపంచం కలహాలతో నిండి ఉంది. ప్రేమ, క్షమా గుణం కాలం చెల్లినవిగా భావిస్తున్న ప్రపంచంలోకి మీరు అడుగుపెడుతున్నారు. ప్రేమ, క్షమ అవసరం అని చెప్పే తెగువను ప్రదర్శించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆకళింపు చేసుకున్న జీవన సత్యాలుగా వాటిని చాటండి. మీదైన మార్గంలో, మీదైన రీతిలోనే ఆ పని చేయండి. ప్రేమను, క్షమాగుణాన్ని తిరిగి పంచండి. చుట్టూ అలుముకున్న భయానక, నిరాశాపూరిత పరిస్థి తుల్లో క్షమించరాని, మన్నించలేని ప్రపంచాన్ని కూడా క్షమించి వదిలెయ్యండి. తిరిగి ప్రేమనే అందించండి. మరణం ఆసన్నమై నపుడు కాదు, జీవించి ఉండగానే నలుగురికీ మేలు చేయాలని సంకల్పించండి!


